పల్లెల్లో ‘మీసేవ’లు
ABN , Publish Date - Jul 03 , 2024 | 10:17 PM
ఇప్పటి వరకు పట్టణ ప్రాంతాలతో పాటు మేజర్ గ్రామ పంచాయతీల్లోనే అందుబాటులో ఉన్న ‘మీసేవ’ కేంద్రాలు ఇక మారుమూల పల్లె ప్రాంతాల్లోకి కూడా అందుబాటులోకి రానున్నాయి.
కొత్తగా 82 కేంద్రాలు మంజూరు
‘మహిళా శక్తి’ పేరుతో అతివలకే కేటాయింపు
ప్రభుత్వ భవనాల్లోనే ఏర్పాటు చేయాలని ఆదేశం
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి)
ఇప్పటి వరకు పట్టణ ప్రాంతాలతో పాటు మేజర్ గ్రామ పంచాయతీల్లోనే అందుబాటులో ఉన్న ‘మీసేవ’ కేంద్రాలు ఇక మారుమూల పల్లె ప్రాంతాల్లోకి కూడా అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో కూడా మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ పక్రియను మొదలుపెట్టిన ప్రభుత్వం దశల వారీగా వీటిని మరింత విస్తరించాలని భావిస్తోంది. కొత్తగా ఏర్పాటు చేసే మీసేవ కేంద్రాలను పూర్తిగా మహిళా సంఘాలకే కేటాయించింది. మహిళా శక్తి పేరుతో అర్హులైన సభ్యులకు వీటిని మంజూరు చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 82 మీసేవ కేంద్రాలను మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 46 ఏర్పాటు కానుండగా వికారాబాద్ జిల్లాలో 20, మేడ్చల్ జిల్లాలో 16 కేంద్రాలను మంజూరు చేశారు. మీసేవ కేంద్రం ద్వారా దాదాపు 40 రకాల ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉంటాయి. ఆధార్, ధరణి, స్థానికత, ఆదాయ, కుల, జనన, మరణ ధ్రువపత్రాలతో పాటు ఆర్టీసీ, రైల్వే తిరుపతి దర్శనం టిక్కెట్ల రిజర్వేషన్ల్లు వంటి సేవలను ప్రజలు తమ గ్రామం నుంచే పొందే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పాటు చేసే మీసేవ కేంద్రాలు ఆగస్టు 15నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావాలని ప్రభుత్వం ఆదేశించింది. జూలై 20వ తేదీనుంచి ఈ కేంద్రాలను ప్రారంభించాలని సూచించింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల్లో లక్షలాది మంది ప్రజలకు ప్రభుత్వ సేవలు తమ ముంగిటే అందనున్నాయి. ఈ ప్రక్రియ విజయవంతమైతే డిమాండ్‌కు అనుగుణంగా మరికొన్ని గ్రామాల్లో కూడా మీసేవ కేంద్రాలను విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఎంపిక ఇలా...
మీసేవ కేంద్రాల ఏర్పాటుకు ఆయా జిల్లాల గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) అధికారులు సన్నాహాలు మొదలు పెట్టారు. ఈ కేంద్రాల నిర్వహణ బాధ్యతలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులకే అప్పగించాలని ప్రభుత్వం ఆదేశించడంతో అర్హులైన వారిని ఎంపికచేసే ప్రక్రియ మొదలు పెట్టారు. మీ సేవ కేంద్రాలు మంజూరైన గ్రామాల్లో గ్రామైక్య సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మీసేవ కేంద్రాల నిర్వహణపై ప్రాథమికంగా అవగాహన కల్పిస్తున్నారు. ఆయా సంఘాల నెలవారి పొదుపుతో పాటు వాటి ప్రగతి, స్త్రీనిధి, బ్యాంకు లింకేజ్‌ల ద్వారా తీసుకున్న రుణాల వివరాలను సేకరిస్తున్నారు. అలాగే రుణాల రికవరీ ఎలా ఉంది? అనే అంశాలను పరిశీలించి వీటి ఆధారంగా సంఘంలోని సభ్యులను ఎంపిక చేస్తున్నారు. ఇంటర్ అంతకంటే ఎక్కువ చదువుకున్న వారే ఈ కేంద్రాల నిర్వహణకు అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. గ్రామైక్య సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి మీసేవ కేంద్రం నిర్వహణకు ముందుకు వచ్చే మహిళల జాబితాను తీసుకుని వీరిలో ఒకరిని ఎంపిక చేసే బాధ్యత సంఘాలకే అప్పగిస్తున్నారు. ఎక్కువ మందికి సమాన అర్హతలు ఉంటే ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు.
ప్రభుత్వ భవనాల్లో కేంద్రాల ఏర్పాటు
కొత్తగా గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న మీసేవ కేంద్రాల ఏర్పాటుపై ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రభుత్వ భవనాల్లోనే ఈ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. గ్రామ పంచాయతీలు. మహిళా సంఘాల భవనాలు, కమ్యూనిటీ భవనాలు, యువజన సంఘాల భవనాల్లో మాత్రమే ఈ కేంద్రాలను ఏర్పాటుచేయాలని స్పష్టంగా పేర్కొంది.
రూ.2.50లక్షల రుణ సహాయం
మీ సేవ కేంద్రాలు మంజూరైన వారికి వీటి ఏర్పాటు కోసం ప్రభుత్వం రుణసహాయం అందచేయాలని నిర్ణయించింది. మీ సేవ ఏర్పాటు చేసే సభ్యురాలికి గ్రామైక్య సంఘం సిఫారసుతో స్త్రీనిధి ద్వారా రూ.2.50లక్షల వరకు రుణం మంజూరు చేస్తారు. ఈ రుణంతో మీసేవ కేంద్రం ఏర్పాటుకు కావాల్సిన కంప్యూటర్, ప్రింటర్, కెమెరా, ఇంటర్నెట్, జీపీఎస్, బయోమెట్రిక్ పరికరాలు, టేబుళ్లు వంటివి సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం ద్వారా అందే దాదాపు 40సేవల ద్వారా మీసేవ నిర్వాహకులకు ఆదాయం సమకూరుతుంది.
గ్రామాల్లో ఏర్పాటుకానున్న మీసేవ కేంద్రాలు (జిల్లాల వారీగా)
జిల్లా కేంద్రాలు
రంగారెడ్డి 46
వికారాబాద్ 20
మేడ్చల్ 16