Share News

కొలువు ఆశలు.. ఆవిరి

ABN , Publish Date - Apr 05 , 2024 | 05:38 AM

ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో యూనివర్సిటీలు, కళాశాలల్లో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల జోష్‌ కనిపిస్తుంది. అత్యుత్తమ మానవ వనరులను చేజిక్కించుకునేందుకు బహుళజాతి కంపెనీలు విద్యాసంస్థల ప్రాంగణాలకు వచ్చి పోటీ పడతాయి. ప్రతిభ ఉన్న విద్యార్థులకు భారీ ప్యాకేజీలు ఇచ్చి ముందుగానే

కొలువు ఆశలు.. ఆవిరి

ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో భారీగా తగ్గిన క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు

గత ఏడాదితో పోలిస్తే ఈసారి నాలుగోవంతు కూడా లేవు

ఎన్‌ఐటీ వరంగల్‌లో నిరుడు 95 శాతం ప్రాంగణ నియామకాలు

ఈ ఏడాది 40 శాతమే.. ఐఐటీ హైదరాబాద్‌లో 50 శాతం లోపే

ఉస్మానియా, జేఎన్‌టీయూ, ఇతర యూనివర్సిటీల్లోనూ ఇదే పరిస్థితి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో యూనివర్సిటీలు, కళాశాలల్లో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల జోష్‌ కనిపిస్తుంది. అత్యుత్తమ మానవ వనరులను చేజిక్కించుకునేందుకు బహుళజాతి కంపెనీలు విద్యాసంస్థల ప్రాంగణాలకు వచ్చి పోటీ పడతాయి. ప్రతిభ ఉన్న విద్యార్థులకు భారీ ప్యాకేజీలు ఇచ్చి ముందుగానే ఆఫర్‌ లెటర్లు అందిస్తాయి. కానీ.. ఈసారి పరిస్థితి అంత ఉత్సాహంగా ఏమీ లేదు. గత డిసెంబరుతో ముగిసిన మొదటి విడత ప్రాంగణ నియామకాల్లో.. రెండోవిడత ఫిబ్రవరి, మార్చి నెలల్లోనూ కంపెనీలు నిరాసక్తంగానే ఉన్నాయి. అత్యధిక నియామకాలు, భారీ ప్యాకేజీల్లో రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో ఉంటూ వస్తున్న ఎన్‌ఐటీ వరంగల్‌లోనూ ఈసారి నియామకాలు సగానికి పైగా తగ్గాయి. ఇక్కడ బీటెక్‌ సీఎ్‌సఈ, ట్రిపుల్‌ ఈ, ఈసీఈ, కెమికల్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదివే విద్యార్థులను కంపెనీలు ఏడాది ముందుగానే ఎంపిక చేసుకునేవి. ఐఐటీ హైదరాబాద్‌లోనూ పరిస్థితి ఇలాగే ఉండేది. కానీ ఈసారి ఆ సందడి లేదు.

ఎన్‌ఐటీ, ఐఐటీలకూ రాలే!

ప్రాంగణ నియామకాల్లో ఏటా కొత్త రికార్డులు సృష్టిస్తున్న వరంగల్‌ ఎన్‌ఐటీలో బీటెక్‌, ఎంటెక్‌, సీఎస్‌ఈలో నియామకాల శాతం దేశంలోనే అత్యదికంగా నమోదవుతోంది. గత ఏడాది అక్కడ బీటెక్‌ చదివేవారిలో 99.4శాతం, ఎంటెక్‌లో 100 శాతం మందిని ప్రముఖ బహుళజాతి కంపెనీలు ఎంపిక చేసుకున్నాయి. బీటెక్‌ ట్రిపుల్‌ ఈలో 94 శాతం మంది ఎంపికవగా.. గరిష్ఠ ప్యాకేజీ రూ.53 లక్షలుగా ఉంది. కెమికల్‌ ఇంజనీరింగ్‌లో ప్రాంగణ నియామకాలు 91.6ు, ఈసీఈలో 90ు, మెకానికల్‌లో 90ు, సివిల్‌లో 82ు ఉండగా.. ఇతర బ్రాంచిల్లో సరాసరిగా 60-80శాతం విద్యార్థులు ఎంపికయ్యారు. ఎన్‌ఐటీలో నియామకాలకు ఏటా దాదాపు 300 కంపెనీలు వస్తాయి. వాటిలో గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, మెటా, అమెజాన్‌ వంటి అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలుంటాయి. కానీ, ఈసారి ప్రముఖ కంపెనీలన్నీ ఇక్కడ కొత్త నియామకాలకు ముఖం చాటేశాయి. వచ్చిన కంపెనీలు కూడా మధ్యతరహా దేశీయ కంపెనీలే. వీటి సంఖ్య ఈ రెండు విడతల్లో వందలోపే ఉన్నాయని అక్కడి విద్యార్థులు పేర్కొంటున్నారు. అత్యుత్తమ విద్యాసంస్థగా పేరుగాంచిన ఎన్‌ఐటీలో ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. ఈసారి అక్కడ సీఎ్‌సఈ బ్రాంచిలో దాదాపు 60శాతం మాత్రమే ఎంపికవగా.. ఇతర కోర్సుల్లో క్యాంపస్‌ పేస్‌మెంట్‌ వచ్చినవారి సంఖ్య 20-40శాతం లోపే ఉంది. ఐఐటీ హైదరాబాద్‌లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఆ క్యాంప్‌సను గత ఏడాది 335 ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు సందర్శించి విద్యార్థులను ఎంపిక చేసుకోగా.. ఈసారి అలా వచ్చిన కంపెనీల సంఖ్య వందలోపే ఉంది. నిరుడు అక్కడ నియామకాలు 80 శాతానికి పైగా ఉండగా.. ఈసారి 50శాతం లోపే ఉన్నట్టు తెలిసింది. కంపెనీల సందర్శన, నియామకాలు, గరిష్ఠ వార్షిక ప్యాకేజీల వివరాలను ఎన్‌ఐటీ వరంగల్‌, ఐఐటీ హైదరాబాద్‌ ఏటా మార్చిలో ప్రకటిస్తాయి. కానీ, ఈసారి ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. ఈ విషయంపై ఆ విద్యాసంస్థలను ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదించగా.. స్పందించేందుకు నిరాకరించాయి. ఉస్మానియా, జేఎన్టీయూ, ఇతర వర్సిటీల్లోనూ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల పరిస్థితి ఇలాగే ఉంది. ఐఐటీ బాంబేలో ఈ ఏడాది తొలి దశలో 2400 మంది విద్యార్థులు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల కోసం రిజిస్టర్‌ చేసుకోగా.. 1187 మంది మాత్రమే ఎంపికయ్యారు. నిరుడు ఈ సంఖ్య 2174 రిజిస్ట్రేషన్లకుగాను.. 1451 నియామకాలుగా ఉంది. ఐఐటీఖరగ్‌పూర్‌లో 2,644 మందికిగాను 1,259 మంది (నిరుడు 2,486 మందికిగాను 1600 మంది), ఐఐటీ భువనేశ్వర్‌లో 298 మందికిగాను 212 మంది ఎంపికయ్యారు.

సగానికి పడిపోయిన ప్యాకేజీలు..

ఈసారి ప్రాంగణ నియామకాలు భారీగా తగ్గడంతో పాటు కంపెనీలు వార్షిక ప్యాకేజీలనూ భారీగా తగ్గించేశాయి. వరంగల్‌ ఎన్‌ఐటీలో గతేడాది గరిష్ఠ వార్షిక ప్యాకేజీ రూ.88లక్షలుగా ఉంది. దాదాపు 40 మందికి పైగా విద్యార్థులు రూ. 75-80 లక్షల ప్యాకేజీలను అందుకున్నారు. సరాసరి వార్షిక ప్యాకేజీ రూ. 30.8 లక్షలుగా నమోదైంది. కానీ, అక్కడ ఈసారి గరిష్ఠ ప్యాకేజీయే రూ.30 లక్షలు దాటలేదని తెలిసింది. ఎంపికైన విద్యార్థుల్లో అత్యధికులకు రూ.8-10 లక్షలు మించలేదు. ఐఐటీ హైదరాబాద్‌లో నిరుడు గరిష్ఠ వార్షిక ప్యాకేజీ రూ. 51.03 లక్షలుగా ఉండగా.. ఎంపికైన విద్యార్థుల సరాసరి వార్షిక ప్యాకేజీ రూ.27.11 లక్షలుగా ఉంది. ఈసారి ఇక్కడ గరిష్ఠ ప్యాకేజీ రూ.25 లక్షలు.. సగటు వార్షిక ప్యాకేజీ రూ. 8-10 లక్షలుగా ఉండడం గమనార్హం.

3 నెలలు పనిచేసినా గ్యారంటీ లేదు

ఈసారి ఎంతో కొంతమంది ప్రాంగణ నియామకాల్లో ఎంపికైనా.. వారిలో చాలామందికి ఉద్యోగం దక్కుతుందన్న నమ్మకం లేకుండా పోతోంది. ఈసారి ఎంపిక చేసుకున్న అనేక కంపెనీలు ఎలాంటి ఉద్యోగ హామీ ఇవ్వడం లేదు. కనీసం మూడు నెలలపాటు ఉచితంగా పనిచేయాలని, పనితీరు ఆధారంగా తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. ఇలా అనేకమందిని నెల రోజుల్లోపే తొలగిస్తున్నారని ఉద్యోగులు చెబుతున్నారు. నగరంలోని ఓ ప్రముఖ ఇంజనీరింగ్‌ కాలేజీ నుంచి 10 మందిని ఎంపిక చేసుకున్న ఓ దేశీయ ఐటీ కంపెనీ నెల తిరక్కుండానే అందరినీ తొలగించింది.

అమెరికా ప్రభావంతోనే..

అగ్రరాజ్యం అమెరికాలో ఐటీ రంగం ఏడాదిన్నరగా నష్టాల్లో ఉండటం ఇక్కడ ప్రభావం చూపుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. అమెజాన్‌, మెటా, గూగు ల్‌, మైక్రోసాఫ్ట్‌ లాంటి కంపెనీలు ఉన్న ఉద్యోగులనే భారీసంఖ్యలో తొలగిస్తుండడంతో అక్కడఎన్నో ఏళ్లుగా స్థిరపడ్డ భారత టెకీలు కొలువులను కోల్పోతున్నారు. అవకాశాల్లేక అనేకమంది భారత్‌కు తిరుగుముఖం పడుతున్నారు. దేశీయ ఐటీదిగ్గజాలైన టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, విప్రో లాంటి కంపెనీలు సైతం అక్కడి ఐటి కంపెనీల బాటలో నడుస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడి కంపెనీలు గత ఏడాది వేలాదిమంది ఉద్యోగులను తొలగించాయి. ఈ పరిస్థితుల్లో అనేక కంపెనీలు కొత్త నియామకాలనూ పక్కనబెట్టడటంతో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లపై తీవ్ర ప్రభావం పడిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరో ఏడాది పాటు ఇలాంటి పరిస్థితే ఉంటుందని ఐటీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Updated Date - Apr 05 , 2024 | 05:38 AM