Share News

నాగోల్‌లో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ABN , Publish Date - Apr 03 , 2024 | 02:54 AM

గడ్డి అన్నారం బీజేపీ కార్పొరేటర్‌ ప్రేమ్‌ మహేశ్వర్‌ రెడ్డితో పాటు ఇద్దరు వ్యక్తులు తనను తీవ్రంగా అవమానించారని.. వారి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని ఓ వ్యక్తి సూసైడ్‌ నోట్‌ రాశాడు.

నాగోల్‌లో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

గడ్డి అన్నారం కార్పొరేటర్‌, మరో ఇద్దరు.. అవమానించి, వేధించారని సూసైడ్‌ నోట్‌

వనస్థలిపురం, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): గడ్డి అన్నారం బీజేపీ కార్పొరేటర్‌ ప్రేమ్‌ మహేశ్వర్‌ రెడ్డితో పాటు ఇద్దరు వ్యక్తులు తనను తీవ్రంగా అవమానించారని.. వారి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని ఓ వ్యక్తి సూసైడ్‌ నోట్‌ రాశాడు. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణం చెందాడు. నాగోల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకులకు చెందిన చలమల్ల బాలవర్ధన్‌ రెడ్డి(36).. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నాగోల్‌ డివిజన్‌లోని శ్రీనివాస్‌ కాలనీలో ఉంటున్నారు. ఆయన ఈవెంట్‌ ఆర్గనైజింగ్‌, రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌గా పనిచేస్తున్నారు. కొంత కాలంగా పనిలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత నెల 30న ఆయన భార్య అంజలి పిల్లలతో కలిసి తన సోదరి ఇంటికి వెళ్లింది. 31న భర్తకు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన అంజలి.. పక్కింటి వారికి ఫోన్‌ చేసి తమ ఇంటికి వెళ్లి చూడాలని చెప్పింది. వారు వెళ్లి చూడగా బాలవర్ధన్‌ రెడ్డి ఉరేసుకుని కనిపించారు. ఇంట్లోని భర్త రాసిన సూసైడ్‌ నోట్‌ను అంజలి గుర్తించింది. అందులో.. ‘‘చైతన్యపురికి చెందిన భాగ్య.. కారు కావాలని నాకు రూ.2.30 లక్షలు ఇచ్చింది. వాటిని వేరే వాళ్లకు ఇచ్చాను. వాళ్లేమో కారు ఇవ్వడం లేదు. తన డబ్బులు ఇచ్చేయాలని భాగ్య నా ఇంటి దగ్గరికి వచ్చి యాభై మంది ముందు నన్ను ఘోరంగా అవమానించింది. అది భరించలేక చనిపోతున్నా. నా కుటుంబం రోడ్డున పడటానికి భాగ్య, ఆమె భర్త రాములు, గడ్డి అన్నారం బీజేపీ కార్పొరేటర్‌ ప్రేమ్‌ మహేశ్వర్‌ రెడ్డి కారణం. మహేశ్వర్‌ రెడ్డి నా మీద రేప్‌ కేసు పెట్టిస్తానని బెదిరించారు. డబ్బు, రాజకీయ అండ ఉందని ఎంతో హింసించారు’’ అని ఆ నోట్‌లో ఉంది. బాలవర్ధన్‌ రెడ్డి భార్య అంజలి ఫిర్యాదు మేరకు నిందితులు భాగ్య, ఆమె భర్తను పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్‌ చేశారు. కార్పొరేటర్‌ ప్రేమ్‌ మహేశ్వర్‌ రెడ్డి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Apr 03 , 2024 | 02:54 AM