Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

మల్కాజిగిరి ఈటలకే

ABN , Publish Date - Mar 03 , 2024 | 03:52 AM

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కీలకంగా వ్యవహరించిన ఆయనకు తొలి జాబితాలోనే టికెట్‌ ఇచ్చింది.

మల్కాజిగిరి ఈటలకే

తొమ్మిది మందితో బీజేపీ తెలంగాణ అభ్యర్థుల తొలి జాబితా

సిటింగ్‌లు కిషన్‌రెడ్డి, సంజయ్‌, అర్వింద్‌లకు టికెట్‌

ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావుకు పెండింగ్‌

చేవెళ్ల నుంచి కొండా, జహీరాబాద్‌ బీబీ పాటిల్‌కు..

భువనగిరిలో బూర నర్సయ్యగౌడ్‌, హైదరాబాద్‌లో మాధవీలత

నాగర్‌కర్నూల్‌ నుంచి రాములు కుమారుడు భరత్‌ప్రసాద్‌

న్యూఢిల్లీ, మార్చి 2(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కీలకంగా వ్యవహరించిన ఆయనకు తొలి జాబితాలోనే టికెట్‌ ఇచ్చింది. స్థానికుడికే టికెట్‌ కేటాయించాలని నియోజకవర్గ నేతలు కోరినప్పటికీ ఈటల వైపే అధిష్ఠానం మొగ్గుచూపింది. శనివారం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్‌ తావడే 195 స్థానాలకు అభ్యర్థుల పేర్లను వెల్లడించగా.. ఇందులో తెలంగాణలోని 9 సీట్లు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 17 లోక్‌సభ సీట్లకు గాను బీజేపీకి నలుగురు ఎంపీలున్నారు. వీరిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (సికింద్రాబాద్‌), జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ కుమార్‌ (కరీంనగర్‌), ధర్మపురి అర్వింద్‌ (నిజామాబాద్‌)లకు మళ్లీ టికెట్‌ దక్కింది. ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావు పేరు లేదు. ఊహించినట్లే చేవెళ్ల, భువనగిరిలలో మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడి, బూర నర్సయ్యగౌడ్‌కు అవకాశం దక్కింది. హైదరాబాద్‌ సీటుకు విరించి ఆస్పత్రుల చైర్‌పర్సన్‌ డాక్టర్‌ కొంపెల్ల మాధవీ లతను ప్రకటించారు. కాగా, బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలో చేరిన జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌కు ఒక్క రోజులోనే టికెట్‌ లభించింది. రెండు రోజుల కిందట తండ్రితో కలిసి కాషాయ జెండా కప్పుకొన్న ఎంపీ పి.రాములు కుమారుడు భరత్‌ప్రసాద్‌ను నాగర్‌కర్నూల్‌లో పోటీకి నిలిపారు. ఈ జాబితాలోని 9 మందిలో బీసీలు ఐదుగురు కాగా, ఇద్దరు రెడ్డిలు, మాదిగ, బ్రాహ్మణ అభ్యర్థులు ఒక్కొక్కరు ఉన్నారు. కాగా, ఒకరే పోటీకి ఉన్న, బలమైన అభ్యర్థులున్న సీట్లకు తొలి జాబితాలో చోటిచ్చారు. మరింత స్పష్టత వచ్చిన తర్వాత వారం, పది రోజుల్లో మిగిలిన సీట్లకూ పేర్లు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.

బాపూరావుకు తప్పని నిరీక్షణ

బాపూరావు పేరు తొలి జాబితాలో లేకపోవడం బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గురువారం అర్థరాత్రి వరకు కొనసాగిన పార్టీ ఎన్నికల కమిటీ సమావేశంలో టికెట్‌ దాదాపు ఖరారైందని పార్టీ నాయకులు ప్రచారం చేశారు. మలి జాబితాలోనైనా అవకాశం దక్కుతుందా?లేదా? అన్నది చర్చగా మారింది. బాపూరావు బదులు ఆదిలాబాద్‌ లోక్‌సభ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు మరొకరిని సూచిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. మాజీ ఎంపీలు గోడం నగేశ్‌, రాథోడ్‌ రమేశ్‌ విస్తృత ప్రయత్నాలు చేస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. మహబూబ్‌నగర్‌ అభ్యర్థిని కూడా తొలి జాబితాలోనే ప్రకటిస్తారని అనుకున్నా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి పట్టుదలతో ఉండడంతో పెండింగ్‌లో పెట్టారు.

బలమైనవారి కోసం అన్వేషణ

కాంగ్రెస్‌ కంచుకోటలు ఖమ్మం, నల్లగొండ నుంచి బలమైన అభ్యర్థులను నిలబెట్టే ఆలోచనలో బీజేపీ ఉంది. అవసరమైతే ఇతర పార్టీలోని గట్టి వారిని చేర్చుకోవాలని చూస్తున్నట్లు తెలిసింది. మెదక్‌లో మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌తో పాటు మరో ఇద్దరు టికెట్‌ ఆశిస్తున్నారు. పెద్దపల్లి (ఎస్సీ)లోనూ దళితుల్లో బలమైన నేతను దింపాలని యోచిస్తోంది. మహబూబాబాద్‌లో కాంగ్రెస్‌ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ లంబాడీ నేత కోసం అన్వేషిస్తోంది. ఎస్సీ వర్గీకరణ చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో వరంగల్‌ నుంచి ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగను నిలుపుతారనే ప్రచారం బీజేపీ వర్గాల్లో బలంగా వినిపించింది. ఈ స్థానానికి మాజీ ఐపీఎస్‌ అధికారి కృష్ణప్రసాద్‌, సీనియర్‌ నేతలు చింతా సాంబమూర్తి, శ్రీధర్‌ పోటీ పడుతున్నారు.

హైదరాబాద్‌లో తొలిసారి మహిళ

మజ్లి్‌సకు పెట్టని కోట హైదరాబాద్‌ నుంచి బీజేపీ తొలిసారిగా మహిళా నేత డాక్టర్‌ మాధవీలతను దింపింది. రెండుసార్లు పోటీచేసిన భగవంత్‌రావుకు అవకాశం దక్కలేదు. హైదరాబాద్‌ లోక్‌ సభ పరిధిలో, ముఖ్యంగా పాతబస్తీలో మాధవీలత ఏడేళ్లుగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. హిందువులను సామాజికంగా, రాజకీయంగా ఏకం చేసే కార్యక్రమాలు చేపట్టారు. నిజాం కళాశాలలో డిగ్రీ, ఉస్మానియా వర్సిటీలో పీజీ చదివారు. భరతనాట్య కళాకారిణిగా వందల ప్రదర్శనలు ఇచ్చారు. లతామా ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. కాగా, బీజేపీ భువనగిరి టికెట్‌ లభించిన బూర నర్సయ్యగౌడ్‌ 2014లో బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి 2019లో ఓడిపోయారు. 65వ పుట్టిన రోజు జరుపుకొంటున్న శనివారమే అభ్యర్థిత్వం ఖరారు కావడం విశేషం. మరోవైపు పెద్దపల్లి స్థానాన్ని నేతకాని సామాజిక వర్గానికి చెందిన తనకు కేటాయించాలని బీజేపీ అధిష్ఠానానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజీ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. పెద్దపల్లి పరిధిలో మూడు లక్షల మంది ఓటర్లు నేతకాని వర్గానికి చెందినవారు ఉన్నారని పేర్కొన్నారు.

Updated Date - Mar 03 , 2024 | 03:52 AM