కమల దళంలో మల్కాజ్‌గిరి చిచ్చు!
ABN , Publish Date - Mar 01 , 2024 | 04:33 AM
మల్కాజ్‌గిరి టికెట్ అంశం కమల దళంలో చిచ్చు రగిల్చింది. పార్టీ జాతీయ కార్యవర్గసభ్యులు ఈటల రాజేందర్‌కు ఇక్కడ టికెట్ ఖరారైనట్లు జరుగుతున్న ప్రచారం పట్ల పలువురు సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు
ఈటలకు అవకాశమిస్తే సహకరించం
అధినాయకత్వానికి సీనియర్ల అల్టిమేటం
హైదరాబాద్, ఫిబ్రవరి 29 (ఆంధ్రజ్యోతి): మల్కాజ్‌గిరి టికెట్ అంశం కమల దళంలో చిచ్చు రగిల్చింది. పార్టీ జాతీయ కార్యవర్గసభ్యులు ఈటల రాజేందర్‌కు ఇక్కడ టికెట్ ఖరారైనట్లు జరుగుతున్న ప్రచారం పట్ల పలువురు సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రచారానికి అనుగుణంగా ఆయనకు టికెట్ ఇస్తే పనిచేయొద్దని అంతర్గతంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని పార్టీ జాతీయ నాయకత్వానికి నివేదించారు. ఏళ్ల తరబడి పార్టీ కోసం ఎవరు పనిచేస్తున్నారో వారికే అవకాశం ఇవ్వాలని, ఇప్పుడు టికెట్ అడుగుతున్నవారికి కనీసం ఐదేళ్లు పనిచేసిన తర్వాతే అవకాశం ఇవ్వాలని కోరారు. ‘‘ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పోటీచేస్తామంటే ఒప్పుకొనే ప్రసక్తేలేదు.. 35 లక్షల మంది ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో బయటి నుంచి వచ్చే వ్యక్తి పోటీ చేయాల్సిన అవసరం ఉందా? మల్కాజ్‌గిరిలో కార్యకర్తల్లేరా? మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు పోటీచేయడానికి అర్హులు కాదా?’’ అని సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి అవకాశం ఇవ్వొద్దని పార్టీ జాతీయ నాయకత్వానికి విజ్ణప్తి చేశారు. పార్టీ కోసం స్థానికంగా పనిచేస్తున్న నాయకుల్లో ఎవరికి టిక్కెట్ ఇచ్చినా తాము పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈటల రాజేందర్‌కే టికెట్ ఖరారైందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, పలువురు ఆశావహులు, సీనియర్ నేతలు గురువారం రాత్రి అత్యవసరంగా సమావేశమయ్యారు. మాజీ ఎంపీ చాడ సురేశ్‌రెడ్డి, మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు హరీశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, సామ రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్‌రావు తదితరులు కొంపెల్లిలో గురువారం రాత్రి భేటీ అయ్యారు. తమలో ఎవరికి అవకాశం ఇచ్చినా మిగతావారంతా కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈటల, కొంతమంది కార్యకర్తలు, నాయకులతో బుధవారం నిర్వహించిన బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌పై సమావేశంలో చర్చించారు. మల్కాజ్‌గిరి టిక్కెట్ తనకే ఖరారైందంటూ ఈటల ఈ సమావేశం ద్వారా ప్రచారం చేసుకున్నారని వారు పేర్కొంటూ, ఇలాంటి ఘటనలను పార్టీ జాతీయ నాయకత్వం ప్రోత్సహించడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన రెండు చోట్లా ఓడిపోయిన వ్యక్తికి ఇప్పుడు అవకాశం ఇస్తే ఏ ముఖం పెట్టుకుని ప్రచారం చేస్తాం? అని ఒక నేత ఆవేదన వ్యక్తం చేశారు. ఈటల ఆత్మగౌరవం కోసం తామంతా హుజురాబాద్ వెళ్లి ఉప ఎన్నికలో ఆయన్ను గెలిపించామని పేర్కొంటూ, ఇప్పుడు తమ ఆత్మగౌరవం ఆయన తమను గెలిపించాలని మరో నేత అభిప్రాయపడ్డారు. మరోవైపు అసలు పార్టీలో సభ్యత్వమే లేని వ్యక్తి తనకే టికెట్ ఖరారైందని మరో నేత ప్రచారం చేసుకుంటున్నా పార్టీ స్థానిక నాయకత్వం చూసీ చూడనట్లు వ్యవహరించడం పట్ల మరికొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.