Share News

తాండూరు - వికారాబాద్‌ రోడ్డుకు మహర్దశ

ABN , Publish Date - Jul 19 , 2024 | 11:42 PM

తాండూరు - వికారాబాద్‌ రోడ్డు డబుల్‌లైన్‌ రోడ్డుగా మారనుంది. ఇందుకు గాను రూ. 100కోట్లతో పనులు చేపట్టానున్నారు.

తాండూరు - వికారాబాద్‌ రోడ్డుకు మహర్దశ

రూ. 100కోట్లతో డబుల్‌ లైన్‌కు ప్రతిపాదనలు

ఇప్పటికే రూ.50 కోట్లు మంజూరు

27న రోడ్డు పనులకు మంత్రిచే శంకుస్థాపన

మెరుగు పడనున్న రవాణా వ్యవస్థ

తాండూరు, జూలై 19: తాండూరు - వికారాబాద్‌ రోడ్డు డబుల్‌లైన్‌ రోడ్డుగా మారనుంది. ఇందుకు గాను రూ. 100కోట్లతో పనులు చేపట్టానున్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించి చేసిన రివైజ్డ్‌ ఎస్టిమెంట్‌ తయారు చేశారు. కాగా తాండూరు - వికారాబాద్‌ డబుల్‌రోడ్డు నిర్మాణానికి ఇప్పటికే రూ. 50 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. మరో రూ. 50కోట్లు కేటాయించేందుకు ప్రతిపాదనలు చేశారు. దీంతో వంద కోట్లతో ఈ రోడ్డు పనులు చేపట్టనున్నారు. ప్రస్తుం మిగతా నిధులకు సంబంధించిన ప్రాతిపదనలు ఆర్‌అండ్‌బి చీఫ్‌ ఇంజనీర్‌ నుంచి ఆర్థిక శాఖ అనుమతి కోసం వెళ్లింది. రెండు మూడు రోజుల్లో అనుమతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మార్గంలో ప్రతి రోజు మూడు వేలకుపైగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో ఈ రోడ్డు తరుచు గుంతలు పడి రాకపోకలకు ఇబ్బందిగా మారుతోంది. అధిక లోడ్‌తో నాపరాళ్లు , సుద్ద, సిమెంట్‌ వాహనాలు వెళ్తుండటంతో రోడ్డు గుంతలమయమౌతుంది. వానాకాలంలో ఇబ్బందులు రాకుండా ఉండేలా స్వయంగా స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవడంతో పనులకు మోక్షం కలగనుంది. అయితే ఈ నెల 27న రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ఈ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసేందుకు తేదీ ఖరారు చేశారు.

Updated Date - Jul 19 , 2024 | 11:42 PM