Share News

మాదిగల కోసం నిజాయితీగా పోరాడలేదు

ABN , Publish Date - Apr 04 , 2024 | 04:58 AM

మాదిగల కోసం మంద కృష్ణ మాదిగా నిజాయితీగా ఏనాడూ పోరాడలేదని, స్వప్రయోజనాల కోసమే ఆయన పార్టీలు మారుతున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆరోపించారు.

మాదిగల కోసం నిజాయితీగా పోరాడలేదు

మంద కృష్ణపై కవ్వంపల్లి సత్యనారాయణ ధ్వజం

అప్పుల పాలు చేసినందుకే బొందపెట్టారు

బీఆర్‌ఎ్‌సపై చామల కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్య

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): మాదిగల కోసం మంద కృష్ణ మాదిగా నిజాయితీగా ఏనాడూ పోరాడలేదని, స్వప్రయోజనాల కోసమే ఆయన పార్టీలు మారుతున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆరోపించారు. బీజేపీలో దళితులు, ముస్లింలు లేరని, మతతత్వ పార్టీ అని తెలిసీ ఆ పార్టీకి మంద కృష్ణ ఎందుకు మద్దతుగా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్‌ పార్టీకే సాధ్యమన్నారు. మంద కృష్ణమాదిగను కేసీఆర్‌ జైల్లో పెడితే ఆదుకున్నది ఎవరన్నది గ్రహించాలన్నారు. కాగా, బీజేపీ మొప్పు కోసమే సీఎం రేవంత్‌రెడ్డిపై మంద కృష్ణమాదిగ వ్యాఖ్యలు చేస్తున్నారని టీపీసీసీ ఎస్సీ సెల్‌ చైర్మన్‌ ప్రీతం అన్నారు. మంద కృష్ణమాదిగ కుట్రలను తిప్పికొట్టేలా అన్ని జిల్లా, మండల కేంద్రాలలో ప్రెస్‌ మీట్‌ లు పెట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేసీఆర్‌కు రైతులపై నిజంగా ప్రేమే ఉంటే.. ఆయన హయాంలో ఎందుకు ఖమ్మం రైతుల చేతికి బేడీలు వేయించి.. జైలుకు పంపారని కిసాన్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ప్రశ్నించారు. ఈ నాలుగు నెలల్లో రాష్ట్రంలో 63 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే.. అందులో సగం మంది రైతులు కానివారే ఉన్నారన్నారు. ఆ రోజున బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చిన్న, చిన్న కాల్వలను పూర్తి చేసుంటే ఈ రోజున తెలంగాణ సస్యశ్యామలమయుండేదని, ఈ పనుల్లో కమీషన్లు రావనే పూర్తి చేయలేదని కాంగ్రెస్‌ పార్టీ భువనగిరి అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజల్ని మభ్యపెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినందునే ఎన్నికల్లో ఆ పార్టీని బొంద పెట్టారన్నారు.

Updated Date - Apr 04 , 2024 | 09:54 AM