Share News

మళ్లీ ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌!

ABN , Publish Date - Jan 03 , 2024 | 03:15 AM

ఖజానాకు భారీగా కాసులు కురిపించే ‘క్రమబద్ధీకరణ’ పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టనుంది.

మళ్లీ ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌!

క్రమబద్ధీకరణకు కొత్త దరఖాస్తులకు చాన్స్‌, పాతవాటి పరిష్కారం

కటాఫ్‌ గడువు పెంపుతో ఎక్కువ మందికి లబ్ధి.. సర్కారు పరిశీలన

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే అపరిష్కృతంగా 25.59 లక్షల దరఖాస్తులు

పాత కటాఫ్‌ 2020 ఆగస్టు 26.. అనంతరం ఏడాది, రెండేళ్లు పెంపు

పాతవి, కొత్తవి కలిపితే ఎల్‌ఆర్‌ఎస్‌ కింద రూ.10 వేల కోట్లు!

హైదరాబాద్‌, జనవరి 2(ఆంధ్రజ్యోతి): ఖజానాకు భారీగా కాసులు కురిపించే ‘క్రమబద్ధీకరణ’ పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టనుంది. కటాఫ్‌ గడువు పెంపు ద్వారా ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. అనధికార లే ఔట్లలోని స్థలాల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్‌), అనుమతి లేకుండా చేపట్టిన భవనాల క్రమబద్ధీకరణ (బీఆర్‌ఎస్‌) పథకాలను మళ్లీ తెరపైకి తీసుకురానుంది. వీటి కింద పెండింగ్‌లో ఉన్న లక్షల దరఖాస్తులను పరిష్కరించడంతో పాటు, కొత్తగా దరఖాస్తుకు అవకాశం ఇచ్చే ప్రతిపాదనపై ప్రభుత్వం కసరత్తు సాగిస్తున్నట్లు తెలిసింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శాఖ ముఖ్య కార్యదర్శి, భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ ఇటీవల రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ సందర్భంగా క్రమబద్ధీకరణ పథకాలపై చర్చించారు. ఆదాయ మార్గాలు ఏమిటి? వృథా ఖర్చులను అరికట్టడం ఎలా? అనే అంశాలపైనే ఎక్కువగా దృష్టిసారించారు. ఇందులోభాగంగా పెండింగ్‌లో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, అందుకు ఎదురవుతున్న ఇబ్బందులను అధికారులు వివరించారు.

అప్పట్లో దరఖాస్తు ఫీజు కిందే రూ.257.47 కోట్లు

ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌ కింద 25.59 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. జీవో 58, 59లలో వచ్చిన దాదాపు 50 వేల దరఖాస్తుల్లోనూ కొన్ని పరిష్కారం కాలేదు. జీవో 59 కింద రుసుము వసూలు చేసినా.. జీవో 58 దరఖాస్తుల క్రమబద్ధీకరణ ఉచితమే. కాగా, 25.59 లక్షల దరఖాస్తుల్లో పంచాయతీలవి 10,83,394, మున్సిపాలిటీవి 10,60,013, కార్పొరేషన్ల పరిధిలోవి 4,16,155 ఉన్నాయి. దరఖాస్తుల్లో స్థలానికి రూ.1,000, లే అవుట్లకు రూ.10 వేల చొప్పున ప్రభుత్వం వసూలు చేసింది. దీని ద్వారానే రూ.257.47 కోట్ల ఆదాయం వచ్చింది. అనంతరం దరఖాస్తులన్నిటినీ పరిశీలించి.. ఎల్‌ఆర్‌ఎస్‌ కింద ఆమోదించే ప్రక్రియను ప్రారంభించింది. రూ.6 వేల కోట్ల ఆదాయం అంచనా వేసింది. అయితే, పథకంపై కొన్ని సామాజిక సంస్థలు కేసులు వేశాయి. తమిళనాడు, కర్ణాటక, కేరళల్లోనూ ఇలాంటి పథకానికి సంబంధించి కేసులు పడ్డాయి. ఇవన్నీ ఒకే కేసుగా ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణలో ఉన్నాయి. ఇదే కేసులో కొత్త ప్రభుత్వం ముందుకు వెళ్లనుందని సమాచారం. కాగా, ఎల్‌ఆర్‌ఎస్‌ కింద పాతవి, కొత్తవి దరఖాస్తుల పరిష్కారం ద్వారా రూ.10 వేల కోట్లు రావొచ్చని అంచనా. బీఆర్‌ఎ్‌సపై 2015లోనే కొందరు హైకోర్టులో కేసు వేశారు. నాటి ప్రభుత్వం కౌంటర్‌ ఇవ్వకపోవడంతో పెండింగ్‌లో ఉంది.

కటాఫ్‌ గడువు పెంచే అవకాశాలపై పరిశీలన

బీఆర్‌ఎస్‌, ఎల్‌ఆర్‌ఎస్‌ కటాఫ్‌ గడువును కూడా పెంచనున్నారని సమాచారం. 2020 ఆగస్టు 31న ప్రకటించినపుడు.. 26.8.2020 తేదీలోపు రిజిస్ట్రేషన్‌ అయిన అనధికార లే అవుట్లలోని స్థలాలకే క్రమబద్ధీకరణకు అనుమతించారు. ఇప్పుడు ఆ గడువును మరో ఏడాది, రెండేళ్ల పాటు పెంచే అంశాన్ని పరిశీలించనున్నట్లు తెలిసింది. అయితే, వీటన్నింటికీ కోర్టు అనుమతివ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే.. ఎల్‌ఆర్‌ఎ్‌సలో వసూలు చేసిన మొత్తాన్ని ఆయా లే అవుట్లలో మౌలిక సదుపాయాలకు ఉపయోగిస్తామని ప్రభుత్వం కోర్టులో చెప్పనుంది. ఈ మేరకు గత ప్రభుత్వమే సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయగా.. అదే అంశాన్ని మరింత బలంగా చెప్పాలని కాంగ్రెస్‌ సర్కారు భావిస్తోంది. మరోవైపు గత ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ ఆదాయం కోసం అనేక ప్రయత్నాలు చేసినా కోర్టులో కేసు ఉండడంతో సాధ్యం కాలేదు. దీంతో 2020డిసెంబరు 30న పురపాలక శాఖ ఒక మెమోను జారీచేసింది. ఎల్‌ఆర్‌ఎస్‌ కింద క్రమబద్ధీకరణ చేయించుకోకున్నా.. 14 శాతం ఫీజు, ఆ చార్జీలపై 33శాతం కాంపౌండ్‌ ఫీజు కడితే భవన నిర్మాణాలకు అనుమతిచ్చేందుకు అవకాశం కల్పించింది.

అంటే 26.8.2020 లోపు రిజిస్ట్రేషన్లు అయిన అనధికార లే అవుట్‌లలోని స్థలాలు ఎల్‌ఆర్‌ఎస్‌ కింద క్రమబద్ధీకరణ కానప్పటికీ భవనాల నిర్మాణానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎల్‌ఆర్‌ఎ్‌సపై కేసు ఉండడంతో నిలిచిపోయిన ఈ ఆదాయం ఈ మెమో రూపంలోనైనా వస్తుందని, సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందని భావించింది. అయితే దీనివల్ల కొంతమంది మాత్రమే భవనాల నిర్మాణాలకు పెనాల్టీలు చెల్లించి అనుమతులు తీసుకున్నారు. మిగతావారంతా తమ ప్లాట్లు నగరాలు, పట్టణాలు, గ్రామాలకు దూరంలో ఉండడంతో నిర్మాణాలకు మొగ్గు చూపలేదు. వారి దరఖాస్తులూ పరిష్కారం కాలేదు. ఇవన్నీ 24 లక్షల పైనే ఉంటాయని అంచనా. వీటి పరిష్కారం దిశగా ఏం చేయాలన్న ఆలోచనలో కొత్త ప్రభుత్వం ఉంది. మరోవైపు జీవో 59 దరఖాస్తులను పరిశీలించి అర్హత ఉన్నవాటిని క్రమబద్ధీరించి ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. గతంలో మాదిరిగానే ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో ఉన్న స్థలాలు, 30 అడుగుల రోడ్లు లేని ఇళ్ల స్థలాలు, చట్టపరమైన ఇతర ఉల్లంఘనలు ఉన్న స్థలాలు, లే అవుట్లు, ఇళ్ల స్ధలాల క్రమబద్ధీకరణకు అనుమతి ఇవ్వకపోవచ్చని తెలిసింది.

Updated Date - Jan 03 , 2024 | 03:15 AM