Share News

కమలం... మిషన్‌ సౌత్‌!

ABN , Publish Date - Mar 26 , 2024 | 03:19 AM

‘మిషన్‌ సౌత్‌’లో భాగంగా తెలంగాణ నుంచి గణనీయంగా ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఐదేళ్ల కిందటితో పోలిస్తే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు బ్యాంకు భారీగా పెరిగిన నేపథ్యంలో... వచ్చే ఎంపీ ఎన్నికల్లో దీన్ని పునరావృతం చేసే దిశగా పావులు

కమలం... మిషన్‌ సౌత్‌!

రాష్ట్రంలో 12 సీట్లు దక్కించుకునేలా ప్రణాళిక..

కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై విస్తృత ప్రచారం

బీఆర్‌ఎస్‌ ఓట్లను కొల్లగొట్టాలని నిర్ణయం

బూత్‌ల వారీగా ఓటు బ్యాంకుపై నజర్‌

దళిత, యువ ఓటర్లే లక్ష్యంగా వ్యూహం

హైదరాబాద్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ‘మిషన్‌ సౌత్‌’లో భాగంగా తెలంగాణ నుంచి గణనీయంగా ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఐదేళ్ల కిందటితో పోలిస్తే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు బ్యాంకు భారీగా పెరిగిన నేపథ్యంలో... వచ్చే ఎంపీ ఎన్నికల్లో దీన్ని పునరావృతం చేసే దిశగా పావులు కదుపుతోంది. పార్లమెంటు ఎన్నికల వేళ తెలంగాణలోనూ సమీకరణాలు మారే అవకాశం ఉందని భావిస్తున్న కమలనాథులు.. డబుల్‌ ఇంజిన్‌ సర్కారుతోనే తెలంగాణ అభివృద్ధి వేగవంతమవుతుందన్న వాదనను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కేంద్రంలో సొంతంగా 370 స్థానాలు సాధించాలన్న లక్ష్యం నెరవేరాలంటే తెలంగాణ అత్యంత కీలకమని బీజేపీ అగ్ర నాయకత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో కనీసం 12 ఎంపీ స్థానాలు, 35 శాతం ఓటుబ్యాంకు సాధించాలని ప్రణాళికలు రచిస్తోంది. ప్రత్యర్థుల కంటే ముందుగానే మెజారిటీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన పార్టీ.. ప్రచారంలోనూ ఇదే దూకుడు కనబరుస్తుండడం కేడర్‌లో జోష్‌ నింపుతోంది. ఇటీవల కేవలం 10 రోజుల వ్యవధిలోనే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బహిరంగసభలు, రోడ్డు షోలు నిర్వహించడం పాజిటివ్‌ వాతావరణాన్ని సృష్టించిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండగట్టేలా..

ఒకవైపు కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్ర స్థాయిలో ఎండగడుతూ, మరోవైపు కేంద్ర ప్రభుత్వ పథకాలను, మోదీ ప్రభుత్వ విజయాలను విస్తృతస్థాయిలో ప్రచారం చేసేందుకు బీజేపీ రంగం సిద్ధం చేసింది. ఇదే సమయంలో బీఆర్‌ఎస్‌ ఓటు బ్యాంకుపై గురిపెట్టింది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ప్రభావం పెద్దగా ఉండబోదని భావిస్తున్న కమలనాథులు.. ఆ పార్టీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అంచనా వేస్తున్నారు. సదరు బీఆర్‌ఎస్‌ ఓటు బ్యాంకు కాంగ్రెస్‌ వైపు మళ్లకుండా ఉండేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ మేరకు ‘ప్రశ్నిస్తున్న తెలంగాణ’ పేరిట రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రచారం చేయాలని బీజేపీ నిర్ణయించింది. మరోవైపు, వికసిత భారత్‌కు ప్రధాని మోదీ గ్యారంటీ నినాదాన్ని ప్రజలకు చేరువ చేయాలని భావిస్తోంది. భారీ బహిరంగసభలు, జాతీయ అగ్రనేతల విస్తృత పర్యటనలకు బదులుగా పోలింగ్‌ బూత్‌ కేంద్రంగా ఓటు బ్యాంకును పెంచుకునేందుకు కసరత్తు చేస్తోంది. ప్రతి పోలింగ్‌ బూత్‌ పరిధిలో పార్టీ కేడర్‌ను ఎప్పటికప్పుడు క్రియాశీలక కార్యక్రమాల్లో భాగస్వాములు చేయడం ద్వారా ప్రతి గడపకూ కమలం గుర్తును చేర్చాలని భావిస్తోంది. ఆయా కార్యక్రమాలకు జిల్లా, మండల, రాష్ట్ర పార్టీ నాయకులను కూడా బాధ్యులుగా నియమించనుంది. ఇటీవలి పర్యటనలో పార్టీ అగ్రనేత అమిత్‌షా కూడా రాష్ట్ర పార్టీ నాయకత్వానికి ఇదే అంశంపై దిశానిర్దేశం చేశారు. ఇందులోభాగంగా కనీసం 20 మంది కార్యకర్తలతో కలిసి ప్రతీ రెండు, మూడు రోజులకు ఒక సారి పోలింగ్‌ బూత్‌ పరిధిలో బైక్‌ర్యాలీలు నిర్వహించనున్నారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ప్రధాని మోదీ ఘనతను వివరిస్తూ వాల్‌రైటింగ్‌లు, డిజిటల్‌ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి పోలింగ్‌ బూత్‌ పరిధిలోని ఓటర్లతో టెలీ కాన్ఫరెన్సులు నిర్వహించనున్నారు. ఇందుకు గాను అన్ని నియోజకవర్గాల పరిధిలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాదు.. రాష్ట్రంలోని మహిళలు, దళితులు, యువ ఓటర్లపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. కేంద్రం నుంచి మహిళలకు అందుతున్న పథకాలను వివరించడంతోపాటు యువ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా సమ్మేళనాలు నిర్వహించనుంది. తద్వారా ప్రధానిగా మోదీ మూడోసారి ఎన్నిక కావాల్సిన అవశ్యకతను తెలియజేయనుంది. మరోవైపు, దళిత ఓటు బ్యాంకు గణనీయంగా పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఎస్సీ వర్గీకరణ పట్ల ప్రధాని మోదీ చిత్తశుద్ధిని పెద్దఎత్తున ప్రచారం చేయనుంది. ‘‘రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలకు ఎస్సీ మోర్చా తరపున ఇన్‌చార్జిలను నియమించాం. ప్రతీ పార్లమెంట్‌ స్థానంలో 5వేల మంది ఎస్సీ ప్రతినిధులతో సమ్మేళనాలు, బస్తీ సంపర్క్‌ అభియాన్‌లో భాగంగా ప్రతి గ్రామంలోని ఎస్సీ కాలనీల్లో కార్నర్‌ మీటింగ్‌లు నిర్వహించనున్నాం. ఎస్సీలకు మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించనున్నాం’’ అని పార్టీ ముఖ్య నేత ఒకరు పేర్కొన్నారు.

Updated Date - Mar 26 , 2024 | 03:19 AM