Share News

అద్దె బకాయికోసం తహసీల్దార్‌ కార్యాలయ భవనానికి తాళం

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:17 AM

యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్‌ తహసీల్దార్‌ కార్యాలయ భవనానికి 42 నెలలుగా అద్దె చెల్లించడం లేదని ఆగ్రహించిన భవన యజమాని సోమవారం తాళాలు వేశాడు.

అద్దె బకాయికోసం తహసీల్దార్‌ కార్యాలయ భవనానికి తాళం
తహసీల్దార్‌ కార్యాలయానికి తాళం వేసి ఉండడంతో బయటే కూర్చున్న రైతులు

చౌటుప్పల్‌ టౌన్‌, ఏప్రిల్‌ 15: యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్‌ తహసీల్దార్‌ కార్యాలయ భవనానికి 42 నెలలుగా అద్దె చెల్లించడం లేదని ఆగ్రహించిన భవన యజమాని సోమవారం తాళాలు వేశాడు. యజమాని వేసిన తాళాలను సిబ్బంది పగులగొట్టి లోనికి వెళ్లారు. ఇందుకు సంబం ధించిన వివరాలిలా ఉన్నాయి. చౌటుప్పల్‌కు చెందిన ఎంఏ. రషీద్‌కు చెందిన భవనాన్ని నెలకు రూ.46,500చొప్పున తహసీల్దార్‌ కార్యాలయ నిర్వహణ కోసం 2020 అక్టోబరు నుంచి అద్దెకు తీసుకున్నారు. యజమానికి అద్దె చెల్లింపు కోసం 2023 జూన్‌లో రూ.3లక్షలు, 2024 పిబ్రవరిలో రూ.3లక్షలు, 2024 మార్చి లో రూ. 1.50 లక్షల బిల్లులు చేసి ఎస్టీవో కార్యాలయానికి పంపించారు. ఈ బిల్లులు సచివాలయంలోని ఆర్థిక శాఖలో పెండింగ్‌ లో ఉండడంతో యజమానికి అద్దె డబ్బులు అందలేదు. 2024 మార్చి 31 నాటికి ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్‌ వస్తుందని రెవెన్యూ సిబ్బంది చెప్పడంతో యజమాని కొంత ఓపిక పట్టారు. అందులోనూ రంజాన్‌ ఉపవాసాలు ఉండటంతో యజమాని అద్దె ప్రయత్నాలు తాత్కాలికంగా పక్కన పెట్టారు. ఏప్రిల్‌ నెల కూడా సగం దాటిపోతుండడంతో అద్దె వసూలు చేసుకునేందుకు యజమాని సోమవారం ఉదయం 8.45 గంటలకు మూడు తలుపులకు తాళాలు వేసి వెళ్లిపోయారు. స్వీపర్‌, అటెండర్లు వచ్చేసరికి కొత్త తాళాలు ఉండడంతో విస్మయానికి గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని తహసీల్దార్‌ హరికృష్ణకు తెలిపారు. తహసీల్దార్‌ వెంటనే కార్యాలయానికి వచ్చి కొత్త తాళాలను పరిశీలించి యజమానికి ఫోన్‌ చేయగా లిప్ట్‌ చేయలేదు. యజమాని నుంచి స్పందన రాకపోవడంతో తాళాలను పగుల గొట్టి లోనికి వెళ్లారు. తహసీల్దార్‌ కార్యాలయం కోసం అద్దెకు ఇచ్చిన భవనానికి సంబంధించి 42 నెలల అద్దె సుమారు రూ.20 లక్షలు రావాల్సి ఉందని భవన యజమాని ఎంఏ.రషీద్‌ తెలిపారు. 2020 అక్టోబరు నెలలో కార్యాలయ భవనాన్ని అద్దెకు ఇచ్చానని, అప్పటి నుంచి ఇప్పటి వరకు రెవెన్యూ శాఖ ఒక్క రూపాయి కూడా అద్దె చెల్లించలేదని తెలిపాడు. తహసీల్దార్‌ కార్యాలయ భవనానికి సంబంధించి 24 నెలల అద్దె మాత్రమే చెల్లించాల్సి ఉందని తహసీల్దార్‌ హరికృష్ణ తెలిపారు. అందులోనూ 12నెలల అద్దెకు సంబంధించి బిల్లు చేసి పంపించాం. 12నెలలకు సంబంధించిన బిల్లు (అద్దె)ను చేయాల్సి ఉందన్నారు. గతంలో ఇచ్చిన బిల్లులు(చెక్కులు) ఎస్టీవోలో పెండింగ్‌ లో ఉన్నాయని త్వరలో పాస్‌ అవుతాయని తెలిపారు.

Updated Date - Apr 16 , 2024 | 12:17 AM