Share News

ఆగస్టు 15లోగా రుణమాఫీ!

ABN , Publish Date - Apr 16 , 2024 | 03:54 AM

ఎన్నికల కోడ్‌ కారణంగా రాష్ట్రంలోని 68 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయలేకపోయామని, ఆగస్టు 15వ తేదీలోపు వారందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం వచ్చే పంట నుంచి రూ.500 బోనస్‌ ఇచ్చి

ఆగస్టు 15లోగా రుణమాఫీ!

వచ్చే పంట నుంచి రూ.500 బోనస్‌

బిడ్డ కోసం బీజేపీకి భారత రాష్ట్ర సమితి తాకట్టు

ఐదు లోక్‌సభ స్థానాల్లో బీజేపీ గెలుపునకు

ప్రధాని మోదీ నుంచి సుపారీ తీసుకున్న కేసీఆర్‌

మహబూబ్‌నగర్‌, చేవెళ్ల, మల్కాజిగిరి, జహీరాబాద్‌,

భువనగిరిల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల ఓటమికి కుట్ర

14 స్థానాల్లో గెలిస్తే ముదిరాజ్‌ బిడ్డకు మంత్రి పదవి

ఎస్సీ వర్గీకరణ పోరులో మంద కృష్ణకు మద్దతు తెలిపాం

మేం వచ్చాక వర్గీకరణపై సుప్రీంలో కేసు వాదిస్తున్నాం

మాదిగల ఏబీసీడీ వర్గీకరణ బాధ్యత కాంగ్రెస్‌ తీసుకుంది

రాష్ట్రాన్ని చక్కదిద్దేందుకు 18 గంటలు పని చేస్తున్నాం

నారాయణపేట జన జాతర సభలో సీఎం రేవంత్‌ రెడ్డి

ప్రజలంతా పెంచుకున్న రేవంత్‌ రెడ్డి అనే మొక్కను నరకడానికి ఢిల్లీ నుంచి ఒకరు.. గజ్వేల్‌ ఫామ్‌హౌస్‌ నుంచి మరొకరు బయల్దేరారు. ఆ మొక్కను రక్షించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలదే!

- సీఎం రేవంత్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఎన్నికల కోడ్‌ కారణంగా రాష్ట్రంలోని 68 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయలేకపోయామని, ఆగస్టు 15వ తేదీలోపు వారందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం వచ్చే పంట నుంచి రూ.500 బోనస్‌ ఇచ్చి పండిన చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని ప్రకటించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో సోమవారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జన జాతర సభకు సీఎం రేవంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎ్‌సపై నిప్పులు చెరిగారు. ‘‘తన బిడ్డ బెయిల్‌ కోసం మాజీ సీఎం కేసీఆర్‌ బీఆర్‌ఎ్‌సను బీజేపీకి తాకట్టు పెట్టారు. బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం మోదీతో చీకటి ఒప్పందం చేసుకొని సుపారీ తీసుకున్నారు. మహబూబ్‌నగర్‌, చేవెళ్ల, మల్కాజ్‌గిరి, జహీరాబాద్‌, భువనగిరి లోక్‌సభ నియోజక వర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారు. అందుకే.. ఆయా నియోజకవర్గాల పరిధిలో మాజీ ఎమ్మెల్యేలు ఎవరూ గ్రామాలకు వెళ్లి బీఆర్‌ఎ్‌సకు ఓటు వేయాలని కూడా అడగడం లేదు’’ అని వివరించారు. బీఆర్‌ఎ్‌సను బీజేపీకి తాకట్టు పెట్టడం ద్వారా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకుల ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ల దగ్గర ఉంచారని మండిపడ్డారు. బిడ్డ లగ్గం ఉన్నా కూడా వదలకుండా తనను, ఇతర పార్టీల నాయకులను, కార్యకర్తలను జైల్లో పెట్టినప్పుడు కేసీఆర్‌కు బాధ కలగలేదని, కానీ, తన బిడ్డను జైల్లో పెట్టగానే తెలంగాణ ఆత్మగౌరవాన్ని కేసీఆర్‌ తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా గద్వాల వంటి నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించడానికి బీజేపీ సహకరించిందని, ఇప్పుడు బీజేపీ గెలవడానికి బీఆర్‌ఎస్‌ సహకరిస్తోందని ఆరోపించారు. ‘‘సామాజిక న్యాయం కాంగ్రె్‌సతోనే సాధ్యం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా సామాజికవర్గ కూర్పు ఆధారంగా టికెట్లు ఇచ్చాం. బీసీ బిడ్డ నీలం మధుకు కాంగ్రెస్‌ మెదక్‌ టికెట్‌ ఇస్తే.. కేసీఆర్‌ వెంకట్రామి రెడ్డికి ఇచ్చారు. ఇదే ఆ పార్టీ విధానం. 119 నియోజక వర్గాల్లో 10 శాతం ఉన్న ముదిరాజ్‌ బిడ్డలను బీఆర్‌ఎస్‌ పట్టించుకోలేదు. మేం టికెట్‌ ఇచ్చి మరీ మక్తల్‌ ఎమ్మెల్యేగా వాకిటి శ్రీహరిని గెలిపించుకున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 14 పార్లమెంట్‌ స్థానాల్లో గెలిస్తే ముదిరాజ్‌ బిడ్డను ఆగస్టు 15లోపు మంత్రిని చేస్తాను’’ అని హామీ ఇచ్చారు. బీసీ ఏలో ఉన్న ముదిరాజ్‌లను ప్రత్యేక పరిస్థితుల్లో బీసీ డీలోకి మార్చారని, ఆ కేసు సుప్రీం కోర్టులో ఉందని, పదేళ్లుగా ఆ కేసులో కేసీఆర్‌ సర్కారు వాదనలు వినిపించలేదని తప్పుబట్టారు. ‘‘మాదిగల ఏబీసీడీ వర్గీకరణను పదేళ్లు కేసీఆర్‌ పట్టించుకోలేదు. మేం అధికారం చేపట్టిన తర్వాత మంత్రి రాజనర్సింహతోపాటు ఎనిమిది మంది ఎమ్మెల్యేలను పంపించి సుప్రీంలో కేసు వాదిస్తున్నాం. వర్గీకరణ కోసం పోరాడుతున్న మంద కృష్ణకు పలుమార్లు మద్దతు తెలిపాం. అసెంబ్లీలో గళం విప్పి మార్షల్స్‌తో గెంటేయించుకున్నాం’’ అని గుర్తు చేశారు. దళిత నాయకులు సిరిసిల్ల రాజయ్య, సంపత్‌కుమార్‌, పాల్వాయి రజిని, ప్రీతంకుమార్‌కు పదవులు ఇచ్చామని, సర్వే సత్యనారాయణ కుమార్తె, దళిత ఐఏఎస్‌ సంగీతను తన పేషీలో నియమించుకున్నామని చెప్పారు. కురుమ బిడ్డకు సీటు ఇస్తే డీకే అరుణ అల్లుడి కోసం ఆమెను ఓడించారని, వారికి అన్యాయం జరిగిందని గుర్తించి అనిల్‌కుమార్‌ యాదవ్‌కు రాజ్యసభ ఇచ్చామని వివరించారు.

నన్నెందుకు ఓడించాలి!?

అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ సహచర మంత్రులతో కలిసి సెలవు కూడా తీసుకోకుండా రోజుకు 18 గంటలపాటు పని చేస్తున్నామని, పదేళ్లలో చేసిన వందేళ్ల విధ్వంసాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. ‘‘మహిళలకు గ్యాస్‌ సిలిండర్‌ ఇచ్చాం. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించాం. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచాం. పేదలకు 200 యూనిట్లలోపు ఉచితంగా కరెంటు ఇస్తున్నాం. నియోజక వర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి రూ.22,500 కోట్లు మంజూరు చేశాం. 60 ఏళ్లుగా పోరాడుతున్న బీసీ గణనకు అనుకూలంగా అసెంబ్లీలో బిల్లు పాస్‌ చేశాం. 126 రోజుల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చాం. ఇందుకేనా రేవంత్‌ రెడ్డిని ఓడగొట్టాలని, ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తున్నారు!?’’ అని బీజేపీ, బీఆర్‌ఎ్‌సలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వంద రోజులుగా అధికారంలో ఉన్న తనను గద్దె దించాలని అంటున్న బీఆర్‌ఎస్‌ నేతలు.. పదేళ్లుగా ప్రధానిగా ఉన్న మోదీని గద్దె దించాలని ఎందుకు కోరడం లేదని నిలదీశారు. ‘‘పాలమూరు బిడ్డగా ముఖ్యమంత్రిగా పని చేసే హక్కు నాకు లేదా!? దొరలే ఎప్పుడూ సీఎం కావాలా!? వారు కాకపోతే వారి కొడుకులే కావాలా!?’’ అని ప్రశ్నించారు. రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పాలమూరు ప్రజలకు అందకుండా ఎమ్మెల్సీ కోడ్‌తో బీజేపీ కుట్ర పన్నిందని విమర్శించారు. కోడ్‌ ముగిసిన వెంటనే రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను పాలమూరులో కూడా అమలు చేస్తామని తెలిపారు. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని, కాంగ్రెస్‌ కార్యకర్తలు ఏమాత్రం ఏమరపాటుగా ఉండొద్దని, కుట్రలు చేస్తున్న వారిని అడ్డుకొని, ప్రతి బూత్‌, గ్రామంలో మెజారిటీ తెచ్చేందుకు కష్టపడితే ఆ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చి గెలిపించుకునే బాధ్యత పార్టీ తీసుకుంటుందని అన్నారు. రానున్న రోజుల్లో గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు వేసి సంక్షేమ పథకాలను కార్యకర్తల చేతులమీదుగానే అందజేస్తామన్నారు. ఉమ్మడి పాలమూరులో రెండు పార్లమెంట్‌ స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సభలో ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, పర్ణికారెడ్డి, శంకర్‌, వాకిటి శ్రీహరి, యెన్నం శ్రీనివా్‌సరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, జనుంపల్లి అనిరుధ్‌రెడ్డి పాల్గొన్నారు.

వాకిటి శ్రీహరికి మంత్రి పదవి!?

సీఎం రేవంత్‌ వ్యాఖ్యలతో ఊహాగానాలు

నారాయణపేట జిల్లా మక్తల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని మంత్రి పదవి వరించనుందా!? కాంగ్రెస్‌ జన జాతర సభలో సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్య ఆయన గురించేనా!? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే అంటున్నాయి కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 14 స్థానాలు ఇస్తే ముదిరాజ్‌ బిడ్డకు ఆగస్టు 15లోపు మంత్రి పదవి ఇస్తానని సీఎం రేవంత్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలిచిన ఏకైక ముదిరాజ్‌ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాత్రమే. దీనికితోడు, మంత్రివర్గ విస్తరణ పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత ఉంటుందని అంతా భావిస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో మంత్రివర్గ విస్తరణ చేయలేదు. రేవంత్‌ రెడ్డితోపాటు 11 మంది మంత్రులు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రివర్గంలో మరో ఆరుగురికి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే వచ్చే మంత్రివర్గ విస్తరణలో వాకిటికి అవకాశం ఉంటుందంటూ ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

Updated Date - Apr 16 , 2024 | 03:54 AM