‘ఓపెన్’గా వింటా..!
ABN , Publish Date - Jan 12 , 2024 | 06:05 AM
‘‘యాక్చువల్‌గా.. ప్రపంచంలో ప్రతి మనిషికి తన గురించి అవతలి వారు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది.

ఓపెన్ ఎయిర్ జైలు అధికారి తీరు
ఖైదీ చేతికి సెల్‌ఫోన్ ఇచ్చి, దారుణాలు
మహిళా అధికారుల వద్ద.. ఆ ఫోన్‌ను పెట్టేలా ఖైదీకి తర్ఫీదు
వారు మాట్లాడుకునే మాటల రికార్డింగ్
జైళ్లశాఖ డీజీకి బాధితుల ఫిర్యాదు
విచారణకు ఆదేశాలు.. చంచల్‌గూడకు ఖైదీ
హైదరాబాద్, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ‘‘యాక్చువల్‌గా.. ప్రపంచంలో ప్రతి మనిషికి తన గురించి అవతలి వారు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. అది సహజం’’ మన్మథుడు సినిమాలో స్పై మైక్ విక్రయించే సమయంలో నాగార్జునతో ధర్మవరపు సుబ్రమణ్యం అనే మాటలివి. అయితే.. జైళ్ల శాఖలో పనిచేసే ఓ అధికారికి కూడా అచ్చంగా ఇలాగే అనిపించింది. తమతో కలిసి పనిచేసే ఇద్దరు మహిళా అధికారులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకున్నాడు. అంతే.. ఖైదీ చేతికి ఓ సెల్‌ఫోన్ ఇచ్చాడు. ఆ ఇద్దరు మహిళా అధికారులు ఒకచోట కూర్చొని మాట్లాడుకునే టేబుల్ వద్ద కనిపించకుండా ఆ ఫోన్‌ను పెట్టించి, ఏం మాట్లాడుకుంటున్నారో వినేవాడు. ఈ ఘటన సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు నిలయమైన చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలు(వ్యవసాయ క్షేత్రం)లో చోటుచేసుకుంది. సదరు అధికారి, ఖైదీ ఇప్పుడు ఉన్నతాధికారుల క్రమశిక్షణ చర్యలను ఎదుర్కోనున్నారు.
ఏం జరిగిందంటే..?
చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలులో ఉద్యానశాఖ, వైద్య శాఖ తరఫున ఇద్దరు అధికారులు పనిచేస్తారు. ప్రస్తుతం ఇద్దరు మహిళలు ఉద్యాన అధికారిగా.. వైద్యాధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీరు రోజూ మధ్యాహ్నం ఒకేచోట కూర్చుని భోజనం చేసేవారు. ఆ సమయంలో వారు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఓ అధికారి తన దొంగబుర్రకు పనిచెప్పాడు. అంతే.. ఓ ఖైదీకి ఫోన్ ఇచ్చి.. మహిళా అధికారులు ఇద్దరూ భోజనానికి వెళ్లడానికి ముందే.. అక్కడ ఫోన్ పెట్టించేవాడు. ఆ ఫోన్‌తో తన నంబర్‌కు ఫోన్ చేయించి, ఎవరికీ కనబడని చోట పెట్టేలా జాగ్రత్త తీసుకునేవాడు. ఈ తంతంగమంతా రెండు నెలలుగా సాగినట్లు జైళ్ల శాఖలో సిబ్బంది చెప్పుకొంటున్నారు. మహిళా అధికారులిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు సెల్‌ఫోన్ బీప్, మెసేజ్ వచ్చిన శబ్దం వినిపించేది. వారిద్దరూ తమ ఫోన్లను చూసుకున్నా.. వేరే ఫోన్ ఉందనే విషయం అర్థమయ్యేది కాదు. ఇటీవల వీరిద్దరూ మాట్లాడుతుండగా.. ఖైదీ సీక్రెట్‌గా పెట్టిన ఫోన్ రింగ్ అయ్యింది. దాంతో వారు అలెర్ట్ అయ్యారు. ఆ ఫోన్‌ను తీసుకెళ్లి.. తమ మాటలు వింటున్న అధికారి చేతికే ఇచ్చి, లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే.. సదరు అధికారి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా పలు సమావేశాల్లో తామిద్దరు మాట్లాడుకున్న మాటలను సదరు అధికారి ఏదో ఒక సందర్భంలో చెబుతుండేవాడు. ఆ అధికారే తమ మాటలు వింటున్నట్లు నిర్ధారించుకుని, జైళ్ల శాఖ డీజీకి ఫిర్యాదు చేశారు. డీజీ కూడా మహిళా అధికారి కావడంతో.. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని, విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. ఆ అధికారికి సహకరించిన ఖైదీని ఓపెన్ ఎయిర్ జైలు నుంచి చంచల్‌గూడ కేంద్ర కారాగారానికి తరలించారు.
ఓపెన్ ఎయిర్ జైలులో ఫోన్ల హవా?
ఖైదీలు సెల్‌ఫోన్లను వాడుతున్న ఉదంతాలు గతంలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే..! చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలులో 70 మంది దాకా ఖైదీలుంటే.. 30-40 ఫోన్లు వారి చేతుల్లో ఉంటాయనే ఆరోపణలున్నాయి. మిగతా జైళ్లలో సెల్‌లో తనిఖీ చేస్తే ఫోన్లు దొరుకుతాయి. కానీ, ఓపెన్ ఎయిర్ జైలులో.. వ్యవసాయ క్షేత్రమంతా తిరిగే స్వేచ్ఛ ఖైదీలకు ఉంటుంది. వారు సెల్‌ఫోన్లను ఎక్కడ దాచుతారనేది పసిగట్టడం కష్టమని అధికారులు చెబుతున్నారు.