Share News

మద్యం లిఫ్టింగ్‌ బంద్‌

ABN , Publish Date - Mar 12 , 2024 | 04:34 AM

మద్యం వాహనాలకు సంబంధించి కొన్నాళ్లుగా వాణిజ్య పన్నుల శాఖ, ఎక్సైజ్‌ శాఖల మధ్య నెలకొన్న ‘ఈ-వేబిల్లుల’ వివాదం చివరికి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేలా చేసింది. డిపోల నుంచి మద్యం రవాణా వాహనా లు బయటకు రాగానే ఈ-వేబిల్లులు లేవంటూ వాహనాలను

మద్యం లిఫ్టింగ్‌ బంద్‌

రాష్ట్ర వ్యాప్తంగా నిలిపేసిన వ్యాపారులు

ఎక్సైజ్‌, వాణిజ్య పన్నుల శాఖల మధ్య ‘ఈ-వేబిల్లుల’ పంచాయితీనే కారణం

హైదరాబాద్‌, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): మద్యం వాహనాలకు సంబంధించి కొన్నాళ్లుగా వాణిజ్య పన్నుల శాఖ, ఎక్సైజ్‌ శాఖల మధ్య నెలకొన్న ‘ఈ-వేబిల్లుల’ వివాదం చివరికి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేలా చేసింది. డిపోల నుంచి మద్యం రవాణా వాహనా లు బయటకు రాగానే ఈ-వేబిల్లులు లేవంటూ వాహనాలను వాణిజ్య పన్నుల అధికారులు సీజ్‌ చేస్తుండటంతో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా వైన్‌షాప్‌ ఓనర్లు మద్యం లిఫ్టింగ్‌ను నిలిపివేసి, డిపోల ముందు నిరసనకు దిగారు. ఫలితంగా రాష్ట్రంలోని 19మద్యం డిపోలు పనిచేయలేదు. ఫలితంగా రాష్ట్ర ఖజానాకు రూ.150 కోట్ల రాబడికి గండిపడింది. రాష్ట్రంలోని వైన్‌ షాపులు, బార్ల ఓనర్లు ఎక్సైజ్‌ శాఖ ఆధీనంలోని 19 మద్యం డిపో ల నుంచి మద్యం, బీరును లిఫ్ట్‌ చేస్తుంటారు. ఈ డిపోల నుంచి వ్యాన్లు, ఇతర పెద్ద వాహనాల ద్వారా తమ వైన్‌ షాపుల వరకు తీసుకెళుతుంటారు. అయితే మద్యం రవాణా వాహనాలకు ‘ఈ-వేబిల్లులు’ ఉండాల్సిందేనంటూ వాణిజ్య పన్నుల శాఖ పట్టుబడుతుండగా.. అవసరం లేదని ఎక్సైజ్‌ శాఖ చెబుతోంది. శనివారం నుంచి ఈ వ్యవహారం ఎటూ తేలకపోవడంతో ఎక్కడికక్కడ వాణిజ్య పన్నుల శాఖ అధికారులు మద్యం రవాణా వాహనాలను సీజ్‌ చేస్తున్నారు. మద్యంతో కూడిన వ్యాన్లను పోలీస్‌ స్టేషన్లలో పెట్టేస్తున్నారు. సమస్య జఠిలంగా మారడంతో సోమవారం రాష్ట్రంలోని వైన్‌షాపు ఓనర్లు మద్యం లిఫ్టింగ్‌ను నిలిపేశారు. దాదాపు 200మంది వరకు యజమానులు నాంపల్లిలోని ఎక్సైజ్‌ కమిషనరేట్‌కు తరలివచ్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సాయంత్రం ఎక్సైజ్‌ కమిషనర్‌ శ్రీధర్‌, వాణిజ్య పన్నుల కమిషనర్‌ టీకే శ్రీదేవిని సచివాలయానికి పిలిపించి మాట్లాడారు. సమస్య ఎందుకు తలెత్తింది, దానికి పరిష్కారమేమిటన్న అంశాలపై వారితో సీఎస్‌ చర్చించారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ఆమె ప్రయత్నించినట్లు తెలిసింది. విచిత్రమేమిటంటే, వాణిజ్య పన్నులు/ఎక్స్‌జ్‌ శాఖలకు సునీల్‌శర్మే ప్రత్యేక ప్రధాన కార్యదర్శి. అయితే సమన్వయ లోపం కారణంగా మద్యం లిఫ్టింగ్‌ను బంద్‌ పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఖమ్మం, హైదరాబాద్‌ తదితర ప్రాంతా ల్లో శనివారంనుంచి ఇప్పటిదాకా 50 వా హనాలను సీజ్‌ చేశారు. వాహనంలో ఉన్నవారికి నోటీసులు ఇచ్చారు. ఒక్కో వాహనానికి రూ.10 లక్షలకు పైగా పెనాల్టీని వేస్తున్నారు. బెంబేలెత్తిపోయిన వైన్‌ షాపు ఓనర్లు చివరికి మద్యం లిఫ్టింగ్‌నే బంద్‌ పెట్టారు. ఎక్సైజ్‌ శాఖ మాత్రం లిక్కర్‌ రవాణా వాహనాలకు ‘ఈ-వేబిల్లులు’ అవసరం లేదని చెబుతోంది .

2018లోనే మినహాయింపు

వాస్తవానికి మద్యాన్ని డిపోల నుంచి విడుదల చేయడానికి ముందే దానిపై 70ు విలువ ఆధారిత పన్ను(వ్యాట్‌) పడుతోంది. మద్యాన్ని తరలించే వాహనాల కోసం ఇదివరకు ‘టాన్స్‌పోర్ట్‌ పర్మిట్లు’ ఇచ్చేది. కాగితం దండగ అన్న కారణంతో.. ప్రస్తుతం అలాంటి పర్మిట్లు ఇవ్వడం లేదు. అయినా ఎలాంటి రవాణా పర్మిట్లు లే కుండానే కొన్నేళ్లుగా మద్యాన్ని డిపోల నుంచి తరలిస్తున్నారు. ఇప్పుడే ఈ సమస్య ఎందుకు తలెత్తుందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. నిజానికి మద్యం రవాణా వ్యాన్లు, పెట్రోలు, డీజిల్‌ రవాణా ట్యాంకర్లకు ‘ఈ-వేబిల్లుల’ నుంచి మినహాయింపునిస్తూ 2018లో రాష్ట్ర ప్రభు త్వం జీవో జారీ చేసింది. ఈ దృష్ట్యా ఎక్సైజ్‌ శాఖ ఇచ్చే ట్రాన్స్‌పోర్ట్‌ పర్మిట్లతో మద్యాన్ని డిపో నుంచి మద్యం షాపు వరకు రవాణా చేసుకోవచ్చు. ఈ ఫిబ్రవరి 29న వాణిజ్య పన్నుల కమిషనర్‌ టీకే శ్రీదేవి ఒక సర్క్యులర్‌ జారీ చేశారు. అంతర్రాష్ట్ర మద్యం రవాణాకు తప్పకుండా ‘ఈ-వేబిల్లులు’ ఉండాలని, లేనట్లయితే.. వాహనాలను సీజ్‌ చేయాలంటూ వాణిజ్య పన్నుల శాఖ క్షేత్ర స్థాయి డిప్యూటీ, అసిస్టెంట్‌ కమిషనర్లను ఆదేశించారు. అంటే.. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు మద్యాన్ని సరఫరా చేస్తేనే.. ‘ఈ-వేబిల్లుల’ను చూడాలి. కానీ... వాణిజ్య పన్నుల అధికారులు రాష్ట్రంలోని ఒక మద్యం డిపో నుంచి ఒక వైన్‌ షాపునుకు మద్యాన్ని తరలిస్తున్న వాహనాలను కూడా సీజ్‌ చేస్తున్నారు.

Updated Date - Mar 12 , 2024 | 04:35 AM