Share News

కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి లైన్‌క్లియర్‌

ABN , Publish Date - Jan 05 , 2024 | 03:26 AM

పోలీసు శాఖలో 16 వేల కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ ప్రక్రియకు అడ్డంకులు తొలగిపోయాయి. తప్పుగా అనువాదం చేసిన నేపథ్యంలో అభ్యర్థులందరికీ నాలుగు మార్కులు కలపాలని..

కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి లైన్‌క్లియర్‌

4 మార్కులు కలపాలన్న తీర్పు కొట్టివేత

కమిటీ వేసి.. ప్రశ్నలపై నిర్ణయం తీసుకోవాలి

నెలలో నియామకాల ప్రక్రియ పూర్తిచేయాలి

ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు డివిజన్‌ బెంచ్‌

హైదరాబాద్‌, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): పోలీసు శాఖలో 16 వేల కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ ప్రక్రియకు అడ్డంకులు తొలగిపోయాయి. తప్పుగా అనువాదం చేసిన నేపథ్యంలో అభ్యర్థులందరికీ నాలుగు మార్కులు కలపాలని.. సమాధాన పత్రాలకు మళ్లీ మూల్యాంకనం చేయాలని పేర్కొంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ గురువారం కొట్టివేసింది. తప్పులు ఉన్నాయని అభ్యర్థులు పేర్కొంటున్న వివాదాస్పద ప్రశ్నలపై ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో స్వతంత్ర నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఆ కమిటీ నిర్ణయం తర్వాత నియామక ప్రక్రియను పూర్తిచేయాలని సూచించింది. ఈ మొత్తం ప్రక్రియను నాలుగు వారాల్లో ముగించాలని రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలికి ఆదేశాలను జారీచేసింది. పోలీసు కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి 2022 ఏప్రిల్‌లో నోటిఫికేషన్‌ జారీచేసిన నియామక మండలి.. అదే ఏడాది ఆగస్టు 30న తుది రాత పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రంలో 13 ప్రశ్నల్లో తప్పులున్నాయని.. తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలంటూ పలువురు అభ్యర్థులు ఆధారాలతో సహా బోర్డుకు విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంపై బోర్డు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మేఘావత్‌ ఓంకార్‌, పలువురు అభ్యర్థులు వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌లపై విచారణ చేపట్టిన సింగిల్‌ జడ్జి ధర్మాసనం.. నాలుగు ప్రశ్నలు తప్పుగా ఉన్నట్లు గుర్తిస్తూ.. నాలుగు మార్కులను కలపాలని ఆదేశించింది. ఈ తీర్పుపై పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు, పోస్టులకు ఎంపికైన ఇతర అభ్యర్థులు డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌ చేశారు. ఈ అప్పీళ్లపై జస్టిస్‌ అభినందన్‌కుమార్‌ షావిలి, జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం విచారణ చేపట్టింది. నియామక మండలి తరఫున న్యాయవాది వాదనలను వినిపిస్తూ.. సాంకేతిక అంశాలకు అనువాదాలు అవసరం లేదని పేర్కొన్నారు. విషయ నిపుణులతో పకడ్బందీగా పేపర్‌ తయారు చేయించామని.. కానిస్టేబుల్‌ ఫలితాలు సైతం వెల్లడించినందున ఈ దశలో జోక్యం చేసుకోరాదని కోరారు. ప్రతివాదుల తరఫున రమేశ్‌ చిల్లా, ఎన్‌ఎ్‌స అర్జున్‌ కుమార్‌ వాదనలను వినించారు. అనువాదం తప్పుగా చేశారని.. దీనివల్ల తెలుగు మీడియం విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. వాదనలను నమోదు చేసుకున్న ధర్మాసనం.. ప్రశ్నల్లో తప్పొప్పులను విషయ నిపుణులు తేల్చాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో స్వతంత్ర నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి.. అభ్యర్థులు తప్పుగా ఉన్నాయని పేర్కొంటున్న ప్రశ్నల్లో అభ్యంతరాలపై నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. సదరు కమిటీ నిర్ణయం మేరకు రిక్రూట్‌మెంట్‌లో తదుపరి ప్రక్రియను చేపట్టాలని సూచించింది. ఈ ప్రక్రియను 4 వారాల్లో పూర్తిచేయాలని స్పష్టం చేసింది.

Updated Date - Jan 05 , 2024 | 03:26 AM