Share News

సన్నాలకు సున్నం!

ABN , Publish Date - Nov 28 , 2024 | 12:24 AM

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సన్నధాన్యం కొనుగోలుకు నిర్వాహకులు కొర్రీలు పెడుతున్నారు. ధాన్యం గింజ వలిచి మరీ పరిశీలిస్తున్నారు. గింజ సైజులో తేడా ఉందంటూ తిరకాసు పెడుతున్నారు. దీనికి తోడు లారీ వడ్లు తెస్తేనే కొనగోలు చేస్తామంటున్నారు. దీంతో రైతులు ఏమి చేయాలో తెలియక లబోదిబోమంటున్నారు. దిక్కులేక ధర తక్కువైనా ప్రైవేట్‌ వ్యాపారులకు విక్రయించి తీవ్రంగా నష్టపోతున్నారు. ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండడం గమనార్హం.

     సన్నాలకు సున్నం!
కొనుగోలు కేంద్రం వద్ద దాన్యం నిల్వలు

కొనుగోలు కేంద్రం వద్ద దాన్యం నిల్వలు

సన్నవడ్ల కొనుగోలుకు కొర్రీలు

గింజ సైజులో తేడా ఉందని తిరకాసు

లారీ వడ్లు తేస్తేనే కొంటామని మెలిక

కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకుల ఇష్టారాజ్యం

దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు

గత్యంతరం లేక ప్రైవేటు వ్యాపారులకు విక్రయం

క్వింటాల్‌కు రూ. వంద తక్కువకే అమ్ముతున్న వైనం

చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సన్నధాన్యం కొనుగోలుకు నిర్వాహకులు కొర్రీలు పెడుతున్నారు. ధాన్యం గింజ వలిచి మరీ పరిశీలిస్తున్నారు. గింజ సైజులో తేడా ఉందంటూ తిరకాసు పెడుతున్నారు. దీనికి తోడు లారీ వడ్లు తెస్తేనే కొనగోలు చేస్తామంటున్నారు. దీంతో రైతులు ఏమి చేయాలో తెలియక లబోదిబోమంటున్నారు. దిక్కులేక ధర తక్కువైనా ప్రైవేట్‌ వ్యాపారులకు విక్రయించి తీవ్రంగా నష్టపోతున్నారు. ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండడం గమనార్హం.

పెద్దేముల్‌, నవంబర్‌ 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పెద్దేముల్‌ మండలం మంబాపూర్‌, జనగాం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొంతమంది రైతులు సన్నధాన్యం అమ్మడానికి శాంపుల్స్‌ తీసుకువచ్చి చూయిస్తే వాటిని కొనుగోలు చేయడానికి కొర్రీలు పెడుతున్నారు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ధాన్యం మొత్తం లారీలోడ్‌కు సరిపోతేనే కొంటామని నిర్వాహకులు చెపుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లారీలోడ్‌ కోసం తాము అన్ని వడ్లు ఎక్కడి నుంచి తీసుకురావాలని ప్రశ్నిస్తున్నారు. రైతులు తెచ్చిన ధాన్యం వచ్చినవి వచ్చినట్లు కొనుగోలు చేయాలని కోరుతున్నారు. ఇక వాటిని యంత్రంతో పరిశీలించడానికి ధాన్యంపై పొట్టుతీసి యంత్రంలో గింజవేస్తే అందులో పాసవుతేనే తీసుకుంటామని చెబుతున్నారు. వ్యవసాయ పొలాల్లో సాగుచేసే పంటలు అన్ని ఒకేసైజులో రావడం ఎలా కుదురుతుందని రైతులు పేర్కొంటున్నారు. ఒకే రకం ధాన్యం ఒకపొలంలో ఒకలా మరోపొలంలో మరోలా వస్తుందని చెబుతున్నారు. సాగు అనేది యంత్రంలో వేసి తీసేది కాదని, అన్ని ఒకేసైజు ధాన్యం ఎలా వస్తుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. ధాన్యంలో తాలులేకుండా, బాగా ఎండపెట్టి గాలికిపోసుకుని తీసుకురమ్మంటే ఫరవాలేదు కానీ, గింజలు అన్ని ఒకేసైజు ఉండాలంటే ఎలా కుదురుతుందని మండిపడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే మద్దతుధర, బోనస్‌ కలిపితే రూ 2,820 అవుతుందని, కానీ ప్రైవేటుకు తీసుకుపోతే ఎలాంటి కొర్రీలు లేకుండా రూ 2,720కి కొనుగోలు చేస్తున్నారని పేర్కొంటున్నారు. అందుకే రైతులు సన్నధాన్యాన్ని ధారూర్‌ మార్కెట్‌కు తరలిస్తున్నారు. క్వింటాల్‌కు వందరూపాయలు నష్టంతో పాటు ట్రాన్స్‌పోర్టు భారం కూడా రైతులపై పడుతోంది. ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు కొర్రీలు పెడుతుండడంతో రైతులు బయటి మార్కెట్‌లో విక్రయించి కొంతమేర నష్టాలకు గురవుతున్నారు. సన్నధాన్యం, దొడ్డురకం వడ్లను చూడగానే చెప్పొచ్చని, అలాంటిది అధికారులు, నిర్వాహకులు యంత్రాలలో వేసి అందులో పాసైతేనే తీసుకుంటామని కొర్రీలు పెట్టడం మానుకోవాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతుధరతో పాటు బోనస్‌ రైతులకు అందేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సన్నరకాలు, దొడ్డురకాలను కంటితో చూసి గుర్తించవచ్చు

సన్నరకాలు, దొడ్డురకాల వడ్లను కంటితో చూసి గుర్తించవచ్చు. ధాన్యం గింజను వలిచి యంత్రంలో వేసి అందులో గుర్తించిన సైజులో ఉంటేనే అది సన్నరకం అని చెప్పడం సరైనపద్దతి కాదు. ప్రభుత్వం రైతులకు మద్దతు ధర, బోనస్‌ చెల్లించాలనుకుంటే సన్నరకాలను యంత్రాలతో కొలవాల్సిన అవసరం లేదు. కావాలంటే వడ్లను బాగా ఎండబెట్టి, గాలికి పోసి తీసుకురమ్మంటే బాగుంటుంది. వ్యవసాయం చేసి పండించే గింజలు యంత్రంలో వేసి తయారు చేసేవికాదు. ఒక్కో విత్తనం ఒక్కోరకంగా ఉంటుంది. కాబట్టి సన్నవడ్లను సన్నవడ్లుగా గుర్తిస్తే చాలు. అధికారులు రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి

- గొబ్బురు బాలప్ప (మంబాపూర్‌)

Updated Date - Nov 28 , 2024 | 12:24 AM