Share News

‘ఎత్తిపోతల’పై లైడర్‌ సర్వే

ABN , Publish Date - Apr 17 , 2024 | 11:26 PM

కొడంగల్‌-నారాయణపేట ఎత్తిపోతల పథకం సర్వే పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి.

 ‘ఎత్తిపోతల’పై  లైడర్‌ సర్వే
లైడర్‌ సర్వే కోసం వికారాబాద్‌ జిల్లా కేంద్రానికి వచ్చిన హెలిక్యాప్టర్‌

‘కొడంగల్‌-నారాయణపేట’ పథకంతో కొడంగల్‌ ప్రాంతంలో లక్ష ఎకరాలకు సాగు నీరు

కొడంగల్‌/వికారాబాద్‌, ఏప్రిల్‌ 17: కొడంగల్‌-నారాయణపేట ఎత్తిపోతల పథకం సర్వే పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు గ్రౌండ్‌ లెవల్‌లో కాలువల తవ్వకం, పొలాలకు సాగునీరు అందే విధానంపై సర్వే నిర్వహించారు. తాజాగా గురువారం నుంచి కొడంగల్‌-నారాయణపేట ఎత్తిపోతల పథకం సర్వే కోసం హెలిప్యాడ్‌ ద్వారా పది రోజుల పాటు లైడర్‌ సర్వే చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన హెలిక్యాప్టర్‌ వికారాబాద్‌ జిల్లా కేంద్రానికి బుధవారం వచ్చింది. కొడంగల్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన రేవంత్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో గతంలో ఆయన కొడంగల్‌-నారాయణపేట ఎత్తిపోతల పథకం మంజూర్‌ తీసుకురాగా ప్రస్తుతం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఎత్తిపోతల సర్వే పనుల కోసం సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రూ.18కోట్లు విడుదల చేశారు. దీంతో ఇప్పటి వరకు గ్రౌండ్‌ లెవల్‌లో పొలాలకు సాగునీరందే విధంగా సర్వే చేపట్టారు. ఎత్తిపోతల పథకంతో లక్ష ఎకరాలకుపైగా సాగునీరందే విధంగా అడుగులు పడుతున్నాయి. జూరాల బ్యాక్‌ వాటర్‌ నుంచి మక్తల్‌, నారాయణపేట నియోజకవర్గాల్లోని చెరువులను నింపుతూ కొడంగల్‌ మండలం బాలంపేట, కొడంగల్‌, హస్నాబాద్‌, దౌల్తాబాద్‌, బొంరా్‌సపేట్‌ మండలంలోని కాకరవాణి ప్రాజెక్టుల్లో నీటితో నీరందించేందుకు కసరత్తు చేస్తున్నారు. దాదాపు రెండు నెలలుగా గ్రౌండ్‌ లెవల్‌లో కొనసాగుతున్న సర్వే పనులు తుది దశకు చేరుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. హెలిక్యాప్టర్‌ ద్వారా లైడర్‌ సర్వేకు అధికారులు సమాయత్తం అయ్యారు. సర్వే పూర్తితో త్వరితగతిన పథకానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో జాప్యం జరిగినా సర్వే పనులు కొనసాగనున్నాయి.

పథకం పూర్తితో కొడంగల్‌ సస్యశ్యామలం

వర్షాధారంపై ఆధారపడి జీవిస్తున్న ఈ ప్రాంత రైతులకు పథకం పూర్తయితే సాగునీరు అందనుంది. గతంలో నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరందిస్తామని ప్రకటించినా సీఎం రేవంత్‌రెడ్డి చొరవతో మరిన్ని ఎకరాలకు సాగునీరు అందేలా లక్ష్యంతో సర్వే కొనసాగుతుంది. ఎత్తిపోతల పథకం పూర్తయితే ఏడారిగా ఉన్న కొడంగల్‌ ప్రాంతంలో బోరు బావుల్లో నీటిమట్టం పెరిగి సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉందని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గ్రౌండ్‌ లెవల్‌ సర్వే పూర్తితో లైడర్‌ సర్వే గురువారం నుంచి పది రోజుల పాటు హెలిక్యాప్టర్‌ ద్వారా నిర్వహించేందుకు అధికారులు సన్నద్దం అయినట్లు తెలుస్తోంది.

Updated Date - Apr 17 , 2024 | 11:26 PM