Share News

బీజేపీలోకి జలగం!

ABN , Publish Date - Mar 09 , 2024 | 02:59 AM

లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక సీట్లు సాధించాలనే లక్ష్యంతో బీజేపీ నాయకత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలను కాషాయ దళంలోకి చేర్చుకునే ప్రయత్నాలు వేగవంతం

బీజేపీలోకి జలగం!

ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా వెంకట్రావ్‌

పోటీకి కాషాయ పార్టీ యోచన

కిరణ్‌కుమార్‌రెడ్డి ద్వారా యత్నం

జలగం కోసం రంగంలోకి మాజీ సీఎం

సీతారానాయక్‌కు కిషన్‌ రెడ్డి ఆహ్వానం

హైదరాబాద్‌, వరంగల్‌, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక సీట్లు సాధించాలనే లక్ష్యంతో బీజేపీ నాయకత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలను కాషాయ దళంలోకి చేర్చుకునే ప్రయత్నాలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, బీఆర్‌ఎస్‌ నేత సీతారాంనాయక్‌ త్వరలో బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టిన బీజేపీ.. లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి జలగం వెంకట్రావును బరిలోకి దించాలని భావిస్తుంది. ఇందుకు సంబంధించి ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి.. జలగం వెంకట్రావుతో సమావేశమై చర్చలు జరిపినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. వెంకట్రావు చేరికపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని సమాచారం.

మరోవైపు, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత ఆజ్మీరా సీతారాంనాయక్‌ బీజేపీలో చేరడం ఖాయమైంది. శుక్రవారం హనుమకొండలోని సీతారాంనాయక్‌ ఇంటికెళ్లిన కిషన్‌రెడ్డి.. బీజేపీలోకి రావాలని ఆయన్ను ఆహ్వానించారు. 2014లో బీఆర్‌ఎస్‌ తరఫున మహబూబాబాద్‌ ఎంపీగా గెలిచిన సీతారాంనాయక్‌కు 2019లో పార్టీ టికెట్‌ నిరాకరించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు టికెట్‌ కేటాయించాలని సీతారాం కోరినా.. నిరాశే మిగిలింది. తాజాగా.. మహబూబాబాద్‌ ఎంపీ టికెట్‌ను సిటింగ్‌ ఎంపీ మాలోతు కవితకే బీఆర్‌ఎస్‌ కేటాయించింది. దీంతో తీవ్ర నిరాశకు గురైన సీతారాంనాయక్‌ బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కిషన్‌రెడ్డి ఆయన్ను స్వయంగా కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఈ విషయమై సీతారాం మాట్లాడుతూ.. బీఆర్‌ఎ్‌సలో అనేక అవమానాలు ఎదుర్కొన్నానని, కనీసం గౌరవం లేని చోట ఎలా ఉండగలమని ప్రశ్నించారు. కార్యకర్తలతో చర్చించిన తర్వాత బీజేపీలో చేరికపై స్పష్టత ఇస్తానని చెప్పారు. స్పష్టం చేశారు.

Updated Date - Mar 09 , 2024 | 07:16 AM