Share News

అభ్యర్థుల ఆటవిడుపు!

ABN , Publish Date - May 15 , 2024 | 03:09 AM

పోలింగ్‌ ముగిసింది. ప్రచారం తర్వాత ఎన్నికల్లో అతి ప్రధాన ఘట్టానికి తెరపడింది. నామినేషన్‌ వేసినప్పటి నుంచి సోమవారం సాయంత్రం పోలింగ్‌ ముగిసేదాకా క్షణం తీరిక లేకుండా గడిపిన అభ్యర్థులు..

అభ్యర్థుల ఆటవిడుపు!

పోలింగ్‌ ముగియడంతో ఉపశమనం

ఫ్యామిలీతో సరదాగా గడిపిన నేతలు

హైదరాబాద్‌ సిటీ, మే 14 (ఆంధ్రజ్యోతి): పోలింగ్‌ ముగిసింది. ప్రచారం తర్వాత ఎన్నికల్లో అతి ప్రధాన ఘట్టానికి తెరపడింది. నామినేషన్‌ వేసినప్పటి నుంచి సోమవారం సాయంత్రం పోలింగ్‌ ముగిసేదాకా క్షణం తీరిక లేకుండా గడిపిన అభ్యర్థులు.. మంగళవారం రోజంతా సరదాగా గడిపారు. కుటుంబసభ్యులతో చాలాసేపు ముచ్చట్లు పెట్టారు. చిన్న పిల్లలతో ఆటలాడుతూ, పేపర్లు చదువుతూ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందారు. అదే సమయంలో తమ వద్దకు వచ్చిన నాయకులు, కార్యకర్తలతో పోలింగ్‌పై సమీక్ష నిర్వహించారు. ఓటింగ్‌ సరళిపై ఆరా తీశారు. సికింద్రాబాద్‌ నుంచి పోటీచేసిన బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి ఉదయం 11 గంటల వరకు బర్కత్‌పురలోని తన నివాసంలోనే ఉన్నారు. కుటుంబసభ్యులతో ప్రశాంతంగా గడిపారు. తర్వాత నేరుగా నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు అక్కడ నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీచేసిన మాధవీలత ఉదయం తొమ్మిది గంటలకే నాంపల్లిలోని తన కార్యాలయానికి వచ్చి.. సాయంత్రం ఐదింటిదాకా అక్కడే ఉన్నారు.

ఈ సందర్భంగా పోలింగ్‌ సరళిపై సమీక్ష జరిపారు. మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ పార్టీ కార్యక్రమాల్లోనే ఎక్కువ పాల్గొన్నారు. మేడ్చల్‌లో జరిగిన శ్రీభగీరథ మహర్షి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. తర్వా త నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశాలకు హాజరయ్యారు. బీఆర్‌ఎస్‌ అభ్యరులు తమ కుటుంబసభ్యులతో సరదాగా గడిపారు. సికింద్రాబాద్‌ అభ్యర్థి పద్మారావు టకారాబస్తీలోని తన నివాసంలో మనుమలు, మనుమరాళ్లతో ఆటలాడుతూ రిలాక్సయ్యారు. కాసేపు వివిధ దినపత్రికలు చదివి ఓటింగ్‌ శాతాన్ని తెలుసుకున్నారు. మల్కాజిగిరి అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి హబ్సిగూడలోని తన ఇంట్లో కుమారుడు, మనవడితో కలిసి ట్రెడ్‌మిల్‌పై జాగింగ్‌ చేశారు. హైదరాబాద్‌ స్థానం నుంచి బీఆర్‌ఎస్‌ తరపున పోటీచేసిన గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ గౌలిగూడలోని తన నివాసంలో ఇద్దరు మనువళ్లతో కాలక్షేపం చేశారు. సికింద్రాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌ కూడా బంజారాహిల్స్‌లోని తన నివాసంలో మనవళ్లతో సరదాగా గడిపారు.

Updated Date - May 15 , 2024 | 03:09 AM