Share News

DHARANI : నిషేధిత జాబితాలో భూములు మాయం!

ABN , Publish Date - Jan 12 , 2024 | 05:05 AM

నిషేధిత జాబితాలో నమోదు చేసిన అనేక భూములు గత ప్రభుత్వ హయాంలో ఽధరణి పోర్టల్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆక్రమణలకు గురైనట్లు ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం.

DHARANI : నిషేధిత జాబితాలో భూములు మాయం!

ధరణి పోర్టల్‌ వచ్చాక ఆక్రమణలు

నిషేధం నుంచి పట్టా భూమిగా మార్పు

వాటి ద్వారా రూ.వేల కోట్ల కుంభకోణాలు

ప్రభుత్వ గుర్తింపు.. ధరణి కమిటీ దృష్టి

ఆయా భూముల వివరాలు ఇవ్వాలని

అధికారులకు ఆదేశం

అనుమానాస్పద లావాదేవీలను

పరిశీలించాలని నిర్ణయం

సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయికి కమిటీ

హైదరాబాద్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): నిషేధిత జాబితాలో నమోదు చేసిన అనేక భూములు గత ప్రభుత్వ హయాంలో ఽధరణి పోర్టల్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆక్రమణలకు గురైనట్లు ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. వేలాది కోట్ల రూపాయల కుంభకోణం దీని ద్వారా జరిగిందని నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. దీని వెనక ఎవరున్నారు!? వారికి సహకరించిన అధికారులు ఎవరు!? అన్న దానిపై ధరణిపై నియమించిన కమిటీ ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిషేధిత జాబితాలో ఉండి అన్యాక్రాంతమైన ఆయా భూముల వివరాలు అందజేయాలని అధికారులను సదరు కమిటీ ఆదేశించింది. ఈ కమిటీ తొలి సమావేశం గురువారం జరిగింది. కమిటీ కన్వీనర్‌, సీసీఎల్‌ఏ నవీన్‌ మిత్తల్‌ అధ్యక్షతన సభ్యులు, కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి, భూ పరిపాలన పూర్వ ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ), రిటైర్డ్‌ ఐఏఎస్‌ రేమండ్‌ పీటర్‌, నల్సార్‌ యూనివర్సిటీకి చెందిన భూ చట్టాల నిపుణుడు సునీల్‌, మాజీ స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ మధుసుదన్‌, సీఎంఆర్వో ప్రాజెక్టు డైరెక్టర్‌ లచ్చిరెడ్డి సమావేశమయ్యారు. ‘‘ధరణిలో ఏ రకమైన లావాదేవీలు జరిగాయి? నిషేధిత జాబితాలో ఉన్న భూములను కూడా ధరణి ద్వారా ప్రైవేట్‌ వ్యక్తుల పరం చేశారా? అసైన్డ్‌ భూములను ఆ జాబితా నుంచి తొలగించారా!? ప్రభుత్వ భూముల పరిస్థితి ఏమిటి!?’’ అంటూ ఆరా తీశారు. ధరణిలో గత మూడేళ్లలో జరిగిన అనుమానాస్పద లావాదేవీలన్నీ పరిశీలించాలని నిర్ణయించారు. ఇందుకు ధరణికి సంబంధించిన పూర్తి లావాదేవీలను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. నిజానికి, ధరణి పోర్టల్‌ రాకముందు రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌ ప్రకారం విక్రయించడానికి వీల్లేని భూములను 22 (ఏ) కింద నిషేధిత జాబితా (ప్రొహిబిషన్‌ ఆర్డర్‌ బుక్‌- పీవోబీ)లో పెట్టారు. ఆయా భూములు చాలాచోట్ల మాయమైనట్లు ప్రభుత్వం గుర్తించింది. గత ప్రభుత్వ హయాంలో జీవో 59 కింద అన్యాక్రాంతమైన కొన్ని భూములు కూడా ఈ జాబితాలోనివేనని గుర్తించినట్లు తెలుస్తోంది.

నిజానికి, పీవోబీలోని నిషేధిత భూములను ధరణి పోర్టల్‌లోకి కూడా యథాతథంగా ఎక్కించారు. ఆ తర్వాత అయిన వారి కోసం నిషేధిత జాబితాలోని భూములను ధరణి పోర్టల్‌లో గుట్టుగా తొలగించారని ప్రభుత్వం భావిస్తోంది. ప్రధానంగా శివారు జిల్లాల్లోని కలెక్టర్ల పనితీరుపై ఆరోపణలు బలంగా ఉన్నాయి. దాంతో, నిషేధిత జాబితా నుంచి మాయమైన భూముల చిట్టాను పరిశీలించాలని కమిటీ నిర్ణయించింది. ‘‘ఆయా భూములను ఎలా బదలాయించారు? దీని వెనక ఎవరున్నారు? అందుకు సహకరించిన అధికారులు ఎవరు!? ముఖ్యంగా, పెద్దఎత్తున ప్రభుత్వ, ఈనాం, అసైన్డ్‌ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి పట్టా భూములుగా ఎలా మార్చారు!?’’ తదితర అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. అలాగే, ఈనాం భూములకు ఓఆర్‌సీ (అధీన ధ్రువీకరణ పత్రం) సర్టిఫికెట్‌ లేకుండా వేల ఎకరాల భూములను కొనుగోలు చేసి పట్టా భూములుగా మార్చుకున్నారు. 1955 తరువాత ఈనాందారుల నుంచి ఓఆర్‌సీ లేకుండా కొనుగోలు చేసిన ఈనాం భూములు చెల్లవని కోర్టు కూడా పేర్కొంది. అయినా.. ఈ లావాదేవీలు ఆగలేదు. రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాలకు చెందిన వేల కోట్ల విలువైన ఈనాం, అసైన్డ్‌ భూములను ధరణి ద్వారా రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు కట్టబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ లావాదేవీలు అన్నిటినీ పరిశీలించాలని ధరణి కమిటీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల్లో ఇచ్చిన 8,05,618 ఎకరాల ఈనాం భూమికి92,250 మంది ఈనాందారులు ఉన్నట్లు 1966లో జాతీయ భూ సంస్కరణల అమలు కమిటీ పేర్కొంది. ఈనాం భూములకు ఓఆర్‌సీ పొందకుండానే దాదాపు 6 లక్షల ఎకరాల భూమి చేతులు మారింది. ఇందులో చాలా భూములు ధరణి వచ్చిన తర్వాతనే అన్యాక్రాంతమైనట్లు ప్రభుత్వం భావిస్తోంది.

క్షేత్రస్థాయి కమిటీ సభ్యులు

ధరణి పోర్టల్‌ ద్వారా రైతులకు, ఇతర భూముల యజమానులకు ఎదురవుతున్న సమస్యలను కమిటీ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. ధరణి పోర్టల్‌లో నమోదైన డాటా వివరాలు కావాలని కోరారు. అదే సమయంలో, ధరణిని సంస్కరించేందుకు చేపట్టాల్సిన మార్గాలను అన్వేషించేందుకు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లాలని నిర్ణయించారు. ప్రజలు, బాధితులతో నేరుగా మాట్లాడాలని, ఆరోపణలు వచ్చిన చోటకు వెళ్లి పరిశీలించాలని నిశ్చయించారు. అందరికీ అందుబాటులో ఉండేలా సీసీఎల్‌ఏలోనే కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ధరణిపై లోతుగా అధ్యయనం చేయడం, బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించడం, ఏయే సమస్యలు ఎక్కువగా ఉన్నాయో నమోదు చేసుకోవడం, ఎక్కువ సమస్యలున్న బాధితులు, గ్రామాలను గుర్తించి వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడానికి రూట్‌ మ్యాప్‌ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. అనుమానాస్పద లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక రూపొందించనున్నారు. ధరణి సమస్యలపై దశల వారీగా నివేదికలు ఇవ్వనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈనెల 17న మరోసారి సమావేశమై ధరణి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ఏజెండాను రూపొందించనున్నారు.

Updated Date - Jan 12 , 2024 | 05:05 AM