భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి
ABN , Publish Date - Jul 06 , 2024 | 11:20 PM
భూత్పూర్-చించోళి హైవే 167ఎన్ పనుల్లో భాగంగా భూసేకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు.
- డంపింగ్ యార్డ్‌ను మరోచోటుకు తరలించాలి
- అటవీ భూములకు అనుమతులు తీసుకోవాలి
- భూత్పూర్-చించోళి హైవే పనులను పరిశీలించిన కలెక్టర్
మహబూబ్‌నగర్, జూలై 6 : భూత్పూర్-చించోళి హైవే 167ఎన్ పనుల్లో భాగంగా భూసేకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ జిల్లా అధికారులతో కలిసి భూత్పూర్ నుంచి హన్వాడ వరకు జరుగుతున్న జాతీయ రహదారి పనులను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ భూత్పూర్ నుంచి వికారాబాద్ జిల్లా దుగ్యాల గేట్ వరకు 60 కిలోమీటర్ల ప్యాకేజీ-1 పనులలో భాగంగా 40 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేశారన్నారు. భూత్పూర్ నుంచి మొదలైన పనులు గండీడ్ మండలం జానంపల్లి వరకు 47 కిలో మీటర్లు జిల్లాలో పనులు జరుగుతున్నాయన్నారు. పెండింగ్ భూసేకరణ పనులపై చర్చించిన ఆమె వెంటనే ఆ పనులు పూర్తి చేయాలన్నారు. భూత్పూర్ సమీపంలో ఉన్న సాగునీటి చెరువు హైవే నిర్మాణంలో భాగంగా చెరువుకట్ట దెబ్బతినకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం అంచనాలు రూపొందించి సమర్పించాలని సాగునీటి శాఖ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా డంపింగ్ యార్డు గుండా రహదారి వెళుతున్నందున డంపింగ్ యార్డ్‌ను త్వరగా మరోచోటుకు తరలించాలని మునిసిపల్ అధికారులకు సూచించారు. చిన్నదర్పల్లి దగ్గర అటవీ భూములకు సంబంధించి ఆ శాఖ అనుమతుల కోసం పంపామని, అధికారులతో చర్చించి త్వరగా క్లియరెన్స్ పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైవే ఈఈ రమేశ్, డీఈ రమేశ్‌బాబు పాల్గొన్నారు.