ఘనంగా లక్షపుష్పార్చన
ABN , Publish Date - Jan 12 , 2024 | 12:22 AM
నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని ప్రసిద్ధ శైవక్షేత్రమైన చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో అమావాస్య తిథిని పురస్కరించుకుని గురువారం రాత్రి లక్షపుష్పార్చన వేడుకను ఘనంగా నిర్వహించారు.

నార్కట్‌పల్లి, జనవరి 11: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని ప్రసిద్ధ శైవక్షేత్రమైన చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో అమావాస్య తిథిని పురస్కరించుకుని గురువారం రాత్రి లక్షపుష్పార్చన వేడుకను ఘనంగా నిర్వహించారు. స్వామిని దర్శించుకుని గుట్టపై నిద్ర చేసేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. తొలత పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ మూర్తులను ప్రధానాలయం నుంచి మంటపం వరకు భక్తుల శివన్నామస్మరణల మధ్య పల్లకిసేవతో తీసుకువచ్చారు. అనంతరం ఆలయ ప్రధానార్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, సహార్చకులు సురేశ్‌శర్మ, శ్రీకాంత్‌శర్మ వేదపండితుల మంత్రోఛ్చారణలు, సన్నాయి వాయిద్యాల మధ్య స్వామి వారి లక్ష పుష్పార్చన వేడుకను ఆద్యంతం కన్నుల పండువగా నిర్వహించారు. పార్వతీ పరమేశ్వరుల చెంత పూజలందుకున్న పుష్పాలను పవిత్రంగా భావించిన భక్తులు వాటిని తీసుకునేందుకు పోటీ పడ్డారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఈవో సిరికొండ నవీన్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.