Share News

కేటీఆర్‌.. కల్వకుంట్ల ట్యాపింగ్‌రావు!

ABN , Publish Date - Apr 03 , 2024 | 06:36 AM

కేసీఆర్‌ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అరాచకాలే జరిగాయని....కేటీఆర్‌.. కల్వకుంట్ల ట్యాపింగ్‌ రావుగా మారిపోయారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. దేవుడి పేరుతో కట్టిన కాళేశ్వరంలో,

కేటీఆర్‌.. కల్వకుంట్ల ట్యాపింగ్‌రావు!

కూతురి మద్యం స్కాం, కుమారుడి ఫోన్‌ ట్యాపింగ్‌తో ఆ దేవుడు కూడా తట్టుకోలేకపోయాడు

అందుకే రాష్ట్రంలో వర్షాలు పడలేదు

సికింద్రాబాద్‌లో 2 లక్షల ఆధిక్యంతో దానం గెలుపు: మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అరాచకాలే జరిగాయని....కేటీఆర్‌.. కల్వకుంట్ల ట్యాపింగ్‌ రావుగా మారిపోయారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. దేవుడి పేరుతో కట్టిన కాళేశ్వరంలో, దేవుని గుడి కట్టిన యాదగిరిగుట్టలో కేసీఆర్‌ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో వర్షాలు పడకపోతే ఆ కరువును కాంగ్రెస్‌ పార్టీపై నెట్టి లబ్థి పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కూతురు లిక్కర్‌ కుంభకోణం, కుమారుడు ట్యాపింగ్‌ చర్యలతో దేవుడు కూడా తట్టుకోలేకపోయాడని.. అందుకే గత వర్షాకాలం సరిపడా వర్షాలు పడలేదని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ పార్టీ ఉనికి పూర్తిగా కనుమరుగవుతుందని పేర్కొన్నారు. నాలుగుకోట్ల మంది ప్రజలను బీఆర్‌ఎస్‌ ముంచిందని, ఆ పార్టీలో కేసీఆర్‌ కుటుంబంలోని నలుగురే బాగుపడ్డారని ఆరోపించారు. కేసిఆర్‌, కుటుంబం రాజకీయాలు మానేసి.. ప్రజలకు క్షమాపణ చెప్పి.. కుటుంబాన్ని చూసుకొని బతకాల్సిందేనన్నారు. మంగళవారం సికింద్రాబాద్‌ పార్లమెంటరీ ఎన్నికల సన్నాహక సమావేశంలో కోమటిరెడ్డి మాట్లాడారు. పార్టీ సీనియర్‌ నాయకుడు అంజన్‌ కుమార్‌ యాదవ్‌ ఇక్కడి నుంచి రెండు పర్యాయాలు విజయం సాధించారని.. ఈసారి అందరి సహకారంతో తమ అభ్యర్థి దానం నాగేందర్‌ రూ.2లక్షల మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. రానున్న పదేళ్లు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంటుందన్నారు.

6న చరిత్రలో నిలిచిపోయేలా తుక్కుగూడ సభ నిర్వహిస్తామన్నారు. తుక్కుగూడ జనజాతర మహాసభకు ఒక ప్రత్యేకత ఉందని, ఇండియా కూటమి ఎన్నికల మేనిఫెస్టోను ఆ సభా వేదికగా పార్టీ అగ్రనేతలు రాహుల్‌, ఖర్గే విడుదల చేస్తారనని వెల్లడించారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో రాష్ట్రంలో 13 నుంచి 14 ఎంపీ సీట్లు గెలవడమే కాంగ్రెస్‌ ప్రధాన లక్ష్యమన్నారు. కిషన్‌ రెడ్డి కేంద్రమంత్రిగా ఉన్నా సికింద్రాబాద్‌ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. రూ.వేల కోట్ల నిధులతో నమామి గంగా అంటూ మోదీ గంగానదిని శుద్ధి చేసుకున్నారని.. పార్లమెంటులో తాను గతంలో మూసీ ప్రక్షాళన గురించి కోట్‌ చేస్తే.. పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న కిషన్‌ రెడ్డి స్పందించలేదని విమర్శించారు. కిషన్‌రెడ్డి ఎప్పుడూ మతాలమధ్య ఘర్షణలు పెట్టి గెలుద్దామని అనుకుంటారని, ఈసారి ఆది పనిచేయదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి చొరవతో మూసీ నదిని రూ.40-50వేల కోట్లతో అభివృద్థి చేయనున్నట్లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. దీనికి సంబంధించిన డీపిఆర్‌లు సైతం సిద్ధమయ్యాయన్నారు.

Updated Date - Apr 03 , 2024 | 06:36 AM