manchiryala- కాళేశ్వరంపై కేటీఆర్ అవగాహన లేదు
ABN , Publish Date - Jul 28 , 2024 | 11:20 PM
కాళేశ్వరం ప్రాజెక్టుపై కేటీఆర్‌కు కనీస అవగాహన లేదని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకానంద అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఏసీసీ, జూలై 28: కాళేశ్వరం ప్రాజెక్టుపై కేటీఆర్‌కు కనీస అవగాహన లేదని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకానంద అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేటీఆర్ ప్రచారం కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చాడన్నారు. మేడిగడ్డ నుంచి పంపుల ద్వారా నీటిని ఎత్తిపోయాలని అంటున్న కేటీఆర్‌కు నీటిని ఎత్తిపోస్తే ఆ నీరు ఎక్కడకు పోతుంతో తెలియ దన్నారు. మేడిగడ్డ బ్యారేజీ నుంచి నీరు లిప్ట్ చేస్తే ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుతుందన్నారు.ఎల్లంపల్లి పూర్తిస్ధాయి సామర్ధ్యం 20 టీఎంసీలు అని ప్రస్తుతం అందులో 17.5 టీఎంసీల నీరు ఉందన్నారు. ప్రతి రోజు ఎల్లంపల్లికి పై నుంచి 1 టీఎంసీ నీరు వస్తుందన్నారు. గతంలో బీఆర్‌ఎస్‌ప్రభుత్వం ఉన్నప్పుడు మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి 40 టీఎంసీల నీటిని ఎత్తిపోశారని పై నుంచి ఎల్లంపల్లికి వరద రావడంతో ఎత్తిపోసిన నీటిని మళ్లీ కిందకు వదలాల్సి వచ్చిందన్నారు. నీటిని ఎత్తి పోయడానికి కరెంటు బిల్లు రూ. 2 వేల కోట్లు అయ్యాయన్నారు. కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించారన్నారు. రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో తీసుకున్న నిధులను కేంద్రం బీజేపీ పాలిత రాష్ట్రాలకు మళ్లిస్తుందని విమర్శించారు. సమావేశంలో నాయకులు చేకుర్తి సత్యనారాయణరెడ్డి, బండి సదానందం తదితరులు పాల్గొన్నారు.