Share News

నన్ను పిచ్చోణ్ణి చేశారు

ABN , Publish Date - Mar 30 , 2024 | 06:30 AM

‘‘కాంగ్రె్‌సలోకి నేను పోతలేనంటే.. నేనూ పోతలేనని.. నేను మంచోడినంటే.. నేను మంచోడినని పరిగి సభలో పట్నం మహేందర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి నా ముందే లొల్లి పెట్టుకున్నారు. ఆస్కార్‌ అవార్డు గ్రహీతల కన్నా ఎక్కువగా నటించారు. ఇద్దరూ కలిసి నన్ను పిచ్చోణ్ణి చేశారు.

నన్ను పిచ్చోణ్ణి చేశారు

రంజిత్‌, మహేందర్‌రెడ్డి.. ఆస్కార్‌ స్థాయి నటులు

పార్టీ మారబోమని నా ముందే లొల్లి పెట్టుకున్నారు

కట్‌ చేస్తే..15 రోజుల్లోనే ఇద్దరూ కాంగ్రెస్‌లో చేరారు

‘పట్నం‘ వెన్నుపోటు వల్లే తాండూరులో ఓడిపోయాం

కేకే, కడియం.. కష్టకాలంలో పార్టీని వీడి వెళ్తున్నారు

పార్టీ మారుతున్న ద్రోహులకు ప్రజలే బుద్ధి చెప్తారు

వాళ్లు కేసీఆర్‌ కాళ్లు పట్టుకున్నా.. మళ్లీ రానివ్వం

కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేసుకుంటాం

13న చేవెళ్లలో కేసీఆర్‌ సభను జయప్రదం చేద్దాం

బీజేపీని ఆపే బలం స్థానిక పార్టీలకే ఉంది: కేటీఆర్‌

పార్టీని వీడుతున్నది దొంగలు, ద్రోహులే

బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను ఎవ్వరూ కొనలేరు: హరీశ్‌

హైదరాబాద్‌, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): ‘‘కాంగ్రె్‌సలోకి నేను పోతలేనంటే.. నేనూ పోతలేనని.. నేను మంచోడినంటే.. నేను మంచోడినని పరిగి సభలో పట్నం మహేందర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి నా ముందే లొల్లి పెట్టుకున్నారు. ఆస్కార్‌ అవార్డు గ్రహీతల కన్నా ఎక్కువగా నటించారు. ఇద్దరూ కలిసి నన్ను పిచ్చోణ్ణి చేశారు. నేను కూడా వాళ్ల మాటలు నమ్మా.. ఇక చేవెళ్ల సీటు గెలిచినమనే అనుకున్నా. కానీ.. సీన్‌ కట్‌ చేస్తే 15 రోజుల వ్యవధిలోనే కాంగ్రె్‌సలో చేరి ఒకరు మల్కాజిగిరి, మరొకరు చేవెళ్ల సీటు తెచ్చుకున్నారు’’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు లబ్ధి పొందిన కొందరు నాయకులు.. కష్ట కాలంలో సొంత ప్రయోజనాలకోసం పార్టీ మారి ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇలా ద్రోహం చేసి వెళ్తున్న వారిని క్షమించబోమని, భవిష్యత్తులో కేసీఆర్‌ కాళ్లు పట్టుకున్నా.. పార్టీలోకి రానివ్వబోమని తేల్చిచెప్పారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ పార్టీని వీడే నాయకులు వెళ్తూ వెళ్తూ కొన్ని రాళ్లు వేసి వెళ్తారని, అది వారి విజ్ఞతకే వదిలేద్దామన్నారు. ఏదేమైనా.. అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందని వ్యాఖ్యానించారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల వేళ చేవెళ్ల పార్లమెంటు పరిధిలో కొన్ని చోట్ల నేనూ ప్రచారం చేశాను. తాండూరు అసెంబ్లీ సీటు ఏకపక్షంగా గెలుస్తామనుకున్నాం. ఏం జరిగిందో తెలియదు.. కొన్ని చోట్ల ఓడియాం. ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేడని అంటారు.. ఆ కోవలోనే.. అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ నేతలకే పట్నం మహేందర్‌రెడ్డి వెన్నుపోటు పొడిచారు. వారి ఓటమికి కారణమయ్యారు. ఇక.. రంజిత్‌రెడ్డి విషయానికి వస్తే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నాకు ఫోన్‌ చేశారు. చేవెళ్ల అభ్యర్థిగా నన్ను ప్రకటించండి.. తప్పకుండా గెలుద్దాం.. అని స్వయంగా చెప్పారు. తీరా చూస్తే ఎమ్మెల్సీ కవిత అరెస్టయిన రోజే నవ్వుకుంటూ.. వెళ్లి కాంగ్రె్‌సలో చేరారు. పార్టీకి ద్రోహం చేసిన రంజిత్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డిపై కార్యకర్తలు పగ తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం చేవెళ్లలో బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించుకోవాలి’’ అని సూచించారు. ఇలాంటి కష్ట కాలంలో కేకే, కడియం వంటి నాయకులు పార్టీ వదిలిపెట్టి వెళ్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.

13న చేవెళ్ల సభను విజయవంతం చేద్దాం

వచ్చే నెల 13న కేసీఆర్‌ ఆధ్వర్యంలో చేవెళ్లలో నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. సభకు పెద్దఎత్తున జనాన్ని తరలించేందుకు కార్యాచరణ రూపొందించాలన్నారు. చేవెళ్ల పార్లమెంటులో నిలబడ్డది కాసాని జ్ఞానేశ్వర్‌ కాదు... కేసీఆర్‌ అన్నట్టుగానే పార్టీ శ్రేణులు నిబద్ధతతో పనిచేయాలని కోరారు. ముఖ్య నాయకులు పార్టీని వదిలి వెళ్లినా సరే.. పార్టీ కేడర్‌ కోసం తానే స్వయంగా పని చేస్తానన్నారు. ఇన్ని రోజులు పార్టీ కోసం, నాయకుల కోసం పని చేసిన కార్యకర్తలను రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించుకుంటానని హమీ ఇచ్చారు.

బీజేపీని ఆపే శక్తి కాంగ్రె్‌సకు లేదు

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి బీ టీమ్‌ బీఆర్‌ఎస్‌ అంటూ ప్రచారం చేసిన రేవంత్‌రెడ్డి.. ఎన్నికల తర్వాత ఆయనే బీజేపీకి బీ టీమ్‌లా మారారని కేటీఆర్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ నుంచి సీఎం అయిన ఆయన రాహుల్‌ కోసం పనిచేస్తున్నారా? మోదీ కోసం పని చేస్తున్నారా? చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కాంగ్రె్‌సకు ఓటు వేస్తే.. బీజేపీకి లాభమవుతుందన్న విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. బీజేపీని ఆపే బలం స్థానిక పార్టీలు, స్థానిక నేతలకే ఉందని, కాంగ్రె్‌సకు ఆ శక్తి లేదన్నారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి దేశవ్యాప్తంగా 40ఎంపీ సీట్ల కన్నా ఎక్కువ వచ్చే పరిస్థితి లేదని జోస్యం చెప్పారు. సిటింగ్‌ స్థానమైన మల్కాజిగిరిలో ఎంపీగా పోటీ చేయాలన్న సవాల్‌పై వెనుకంజ వేసిన రేవంత్‌రెడ్డి.. అన్ని సీట్లలో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపిస్తామని అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు. ‘‘నల్లగొండ, ఖమ్మం నేతలే మానవ బాంబులు అవుతారు జాగ్రత్త.. అయిదేళ్లు.. సీఎం పదవిని కాపాడుకో’’ అని రేవంత్‌ను ఉద్దేశించి అన్నారు. కాగ్రెస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

పోరాటపథంలో కదం తొక్కుదాం

రాష్ట్రంలో నిఖార్సయిన కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేస్తామని కేటీఆర్‌ పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉంటూ పోరాట పంథాలో కదం తొక్కుదామని పార్టీ శ్రేణులకు ‘ఎక్స్‌’ వేదికగా పిలుపునిచ్చారు. శూన్యం నుంచి సునామీ సృష్టించి.. అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధీశాలి కేసీఆర్‌ అని కొనియాడారు. అలాంటి వ్యక్తిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే వారికి ప్రజలే జవాబు చెప్తారని పేర్కొన్నారు. 14 ఏళ్లు పోరాడి తెలంగాణ సాధించిన కేసీఆర్‌ను, బీఆర్‌ఎ్‌సను ప్రజలే గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటారన్నారు.

భవిష్యత్తు కార్యాచరణపై కేసీఆర్‌ మంతనాలు

కేటీఆర్‌, హరీశ్‌తో సమాలోచన

కార్యకర్తలకు ధైర్యం చెప్పాలని సూచన

జగదేవ్‌పూర్‌, మార్చి 29: పలువురు ముఖ్య నేతలు పార్టీని వీడుతున్న వేళ భవిష్యత్తు కార్యాచరణపై బీఆర్‌ఎస్‌ అధినేత దృష్టి పెట్టారు. ఈ మేరకు మాజీ మంత్రులు కేసీఆర్‌, హరీశ్‌రావుతో సమావేశమై సమాలోచన జరిపారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి కేశవరావు వచ్చి వె ళ్లిన తర్వాత గురువారం మధ్యాహ్నం కేటీఆర్‌, హరీశ్‌రావు అక్కడికి చేరుకుని కేసీఆర్‌తో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించినట్లు తెలిసింది. గురువారం రాత్రి పొద్దుపోయే వరకూ వీరి సమావేశం జరిగినట్లు తెలిసింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌ వెళ్లిన కేటీఆర్‌ మధ్యాహ్నం తిరిగి వ్యవసాయ క్షేత్రానికి వచ్చారు. హరీశ్‌రావు కూడా దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల కార్యకర్తల సమావేశాల్లో పాల్గొని తిరిగి వచ్చారు. అలాగే, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌ వ్యవసాయ క్షేత్రానికి వచ్చి కేసీఆర్‌ను కలిశారు. పార్టీకి సంబంధించిన పలు అంశాలపై వీరి మధ్య సుదీర్ఘ చర్చ కొనసాగినట్లు సమాచారం. నాయకులు పార్టీని వీడినంత మాత్రాన నష్టం ఏమీ లేదని, కార్యకర్తలకు ధైర్యం చెప్పాలని కేసీఆర్‌ ఈ సందర్భంగా సూచించినట్లు తెలిసింది.

Updated Date - Mar 30 , 2024 | 06:30 AM