Share News

తొలి తెలంగాణ ఉద్యమకారుడు కొలిశెట్టి రామదాసు కన్నుమూత

ABN , Publish Date - May 15 , 2024 | 02:54 AM

నాన్‌-ముల్కీ గోబ్యాక్‌..’ అంటూ నినదించిన గొంతు మూగవోయింది. 1969 తొలి తెలంగాణ ఉద్యమకెరటం ఒరిగిపోయింది. పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘన, రీజినల్‌ కమిటీ ఏర్పాటు సహా.. తెలంగాణ

తొలి తెలంగాణ ఉద్యమకారుడు కొలిశెట్టి రామదాసు కన్నుమూత

సింగరేణిలో ఉన్నతోద్యోగిగా ప్రస్థానం

నాన్‌-ముల్కీ గోబ్యాక్‌ ఉద్యమం ఆయనదే

తెలంగాణ ప్రాంతీయ పార్టీ స్థాపన

బోయినపల్లి శ్మశానవాటికలో అంత్యక్రియలు

బోయినపల్లి, మే 14 (ఆంధ్రజ్యోతి): ‘నాన్‌-ముల్కీ గోబ్యాక్‌..’ అంటూ నినదించిన గొంతు మూగవోయింది. 1969 తొలి తెలంగాణ ఉద్యమకెరటం ఒరిగిపోయింది. పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘన, రీజినల్‌ కమిటీ ఏర్పాటు సహా.. తెలంగాణ ప్రాంతానికి ఇచ్చిన హామీలను ప్రభుత్వాలు తుంగలో తొక్కడాన్ని నిరసిస్తూ.. ఖమ్మం నుంచి ఉవ్వెత్తున ఉద్యమాన్ని తీసుకెళ్లిన కొలిశెట్టి రామదాసు(84) ఇక లేరు. తొలితరం తెలంగాణ ఉద్యమానికి ఆద్యుడిగా గుర్తింపు పొందిన రామదాసు మంగళవారం తెల్లవారుజామున అనారోగ్యంతో హైదరాబాద్‌ బోయినపల్లిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమారులు మాధవ్‌, రఘువీర్‌, కుమార్తెలు శ్రీదేవి, మాధవి, శ్రీలత ఉన్నారు. బోయినపల్లిలోని ఎస్‌ఎంఆర్‌ ఇన్‌స్టైల్‌ అపార్ట్‌మెంట్‌లో ఆయన భౌతిక కాయాన్ని పలువురు ప్రముఖులు సందర్శించారు. మంగళవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో బోయినపల్లిలోని హిందూ శ్మశానవాటికలో రామదాసు అంత్యక్రియలు నిర్వహించారు.


విశాలాంధ్ర వ్యతిరేకోద్యమంలో కీలకం

కొలిశెట్టి రామదాసు.. కొలిశెట్టి వీరయ్య, లక్ష్మీనర్సమ్మ దంపతులకు నాలుగో సంతానంగా జన్మించారు. వీరి స్వస్థలం భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా ఇల్లెందు సమీపంలోని గేటుకారేపల్లి. చదువుకునే సమయంలోనే విద్యార్థి నాయకుడిగా పనిచేశారు. ఆ సమయంలో ఇల్లెందులో ప్రజాదరణ సంపాదించారు. చదువు పూర్తయ్యాక ఆయన సింగరేణిలో ఉన్నతోద్యోగిగా పనిచేశారు. 1954-56 మధ్యకాలంలో విశాలాంధ్ర వ్యతిరేక ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్‌ అవతరించాక.. తమ ఉద్యమం ఫలించలేదని అసంతృప్తికి, అశాంతికి లోనయ్యారు. అప్పటి నుంచే ప్రత్యేక తెలంగాణ కోసం కృషి చేశారు. తన ఆలోచనలను అమలు చేయడానికి కష్టాలను ఎదుర్కొనేందుకు సిద్ధమై.. జిల్లాల్లో పర్యటనలు చేసి.. నాయకులు, కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థుల్లో చైతన్యాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేశారు. తనతోపాటు చదువుకున్నవారంతా నిరుద్యోగులుగా ఉండడానికి కారణం.. నాన్‌-ముల్కీలేనని భావించేవారు.

సింగరేణిలో అన్ని స్థాయుల్లో ఆంధ్రాప్రాంతానికి చెందిన ఉద్యోగులు నియమితులవ్వడం.. టీచర్‌ ట్రైనింగ్‌ స్కూల్‌(బీటీఎ్‌స)లో అంతా ఆంధ్రా ఉద్యోగుల పెత్తనమే ఉండడం.. సర్వే ఆఫ్‌ ఇండియా ట్రైనింగ్‌ స్కూల్‌లోనూ అదే పరిస్థితి ఉండడం.. ఇల్లెందులో ఎక్కడ చూసినా హోటల్‌ వ్యాపారాలలో ఎక్కువగా ఆంధ్ర ప్రాంతం వారే కన్పించడం చూసి సహచరులతో చర్చించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వోద్యోగాల్లో తెలంగాణ ప్రజలకు దక్కాల్సిన కొలువులను ఆంధ్రాప్రాంతం వారికి ఇస్తుండడంతో రగిలిపోయారు. దొంగ ముల్కీలను సంపాదిస్తూ.. ఉద్యోగాలను కొల్లగొడుతున్న తీరును రుజువులతో సహా ఎండగట్టారు. పాల్వంచ కేటీపీఎ్‌సలో నాన్‌-ముల్కీలకు ఇచ్చిన కొలువులకు వ్యతిరేకంగా.. 1969 జనవరిలో ఖమ్మంలో డిగ్రీ విద్యార్థి అన్నాబత్తుల రవీంద్రనాథ్‌తో రెండు వారాలపాటు నిరవధిక నిరాహార దీక్ష చేయించారు. ఆ దీక్షతో తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ‘నాన్‌-ముల్కీ గోబ్యాక్‌’ అంటూ నినదించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఒక దిశానిర్దేశాన్ని అందించారు. ‘తెలంగాణ ప్రాంతీయ పార్టీ’ని స్థాపించారు. ఫలితంగా.. సింగరేణిలో అత్యున్నత పదోన్నతికి అర్హుడైన రామదాసు.. అణచివేతకు గురయ్యారు.


రామదాసును గుర్తించని బీఆర్‌ఎస్‌

తొలితరం తెలంగాణ ఉద్యమానికి ఆద్యుడైన రామదాసును బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, మాజీ సీఎం కేసీఆర్‌ గుర్తించలేదనే ఆరోపణలున్నాయి. టీఎ్‌సపీఎస్సీ నిర్వహించిన పలు పోటీ పరీక్షల్లో రామదాసుకు సంబంధించి, తెలంగాణ ప్రాంతీయ పార్టీపై ప్రశ్నలు వచ్చాయి. ఓ దశలో మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ఆయన సేవలను గుర్తించారు. రామదాసు పెద్దకుమారుడిని పిలిపించి, ఘనంగా సత్కరించారు.

Updated Date - May 15 , 2024 | 02:54 AM