Share News

Manchiryāla- ఓటమిని తట్టుకోలేకపోతున్న కేసీఆర్‌ కుటుంబం

ABN , Publish Date - Feb 01 , 2024 | 10:38 PM

సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌ పార్టీకి కర్ర కాల్చి వాత పెట్టి ఓడించారని ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి ధ్వజమెత్తారు. మందమర్రి ప్రెస్‌క్లబ్‌ లో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Manchiryāla-   ఓటమిని తట్టుకోలేకపోతున్న కేసీఆర్‌ కుటుంబం
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి

మందమర్రిటౌన్‌, ఫిబ్రవరి 1: సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌ పార్టీకి కర్ర కాల్చి వాత పెట్టి ఓడించారని ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి ధ్వజమెత్తారు. మందమర్రి ప్రెస్‌క్లబ్‌ లో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీష్‌రావులు మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారు. కల్వకుంట్ల కుటుంబం కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడి రాష్ట్రాన్ని దివాలా తీయించారని విమర్శించారు. హైదరాబాద్‌ చుట్టు పక్కల భూములను అప్పనంగా నచ్చిన వారికి కట్టబెట్టారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల కుంభ కోణం జరిగిందని అందరికి తెలుసన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, రాష్ట్ర ప్రగతే లక్ష్యంగా పనిచేస్తున్నారని వివరించారు. తమ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు అవుతున్నందున గద్దర్‌ జయంతి రోజు మంచి నిర్ణయం తీసుకున్నారని, సినిమా కళాకారులకు ఇచ్చే అవార్డును గద్దర్‌ అవార్డుగా ప్రకటించిన గొప్ప సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఇంద్రవెల్లిలో అమరులకు నివాళులర్పించడంతో పాటు అమరుల స్ఫూర్తితో పార్లమెంట్‌ ఎన్నికల శంఖారావం పూరించడానికి సీఎం వస్తున్నారని తెలిపారు. త్వరలోనే బీఆర్‌ఎస్‌ పార్టీకి ఆ కుటుంబం తప్పితే అందులో ఎవరుండరనేది వాస్తవమన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో నిరుద్యోగ యువత కోసం తప్పకుండా రెండు స్కిల్‌ డెవలప్‌మెంట్‌సెంటర్లను ఏర్పాటు చేయడానికి దృష్టి సారించానని తెలిపారు. సీఎం సభకు నియోజకవర్గం నుంచి 10 వేల మందికి పైగా తరలివస్తున్నారని, ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేశామని తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు గుడ్ల రమేష్‌, సత్యనారాయణరెడ్డి, సుదర్శన్‌, కొమురయ్య,తిరుమల్‌,ఇసాక్‌, జావేద్‌, పాషా,నర్సింగ్‌తదితరులు పాల్గొన్నారు.

క్యాంపు కార్యాలయం పరిశీలన

పట్టణంలోని కేకే 5 బంగ్లాస్‌ ఏరియాలో గురువారం క్యాంపు కార్యాలయం కోసం సింగరేణి యాజమాన్యం కేటాయించనున్న క్వార్టర్‌ను ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి పరిశీలించారు. సింగరేణి అధికారులతో మాట్లాడారు. పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పట్టణప్రాంతానికి దూరంగా ఉన్న బంగ్లాస్‌ ఏరియాలోని క్వార్టర్‌ను కేటాయించాలన్నారు. ఎమ్మెల్యే వెంట పీఏ రమణరావు ,స్ధానిక నాయకులు గుడ్ల రమేష్‌, ఒడ్నాల కొమురయ్య, మంద తిరుమల్‌రెడ్డి, మహంత్‌ అర్జున్‌కుమార్‌, జావేద్‌ఖాన్‌, సత్యనా రాయణరెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - Feb 01 , 2024 | 10:38 PM