Share News

వచ్చేనెల నుంచి జనంలోకి కేసీఆర్‌

ABN , Publish Date - Jan 07 , 2024 | 04:00 AM

కేసీఆర్‌ కోలుకుంటున్నారని, ఫిబ్రవరి నుంచి ఆయన సం పూర్ణ ఆరోగ్యంతో ప్రజల మధ్యకు వస్తారని, జిల్లాల్లో పర్యటిస్తారని, తెలంగాణ భవన్‌కొచ్చి కార్యకర్తలను కలుస్తారని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు.

వచ్చేనెల నుంచి జనంలోకి కేసీఆర్‌

అభివృద్ధి చేసినా దుష్ప్రచారం వల్లే ఓడాం

వడ్ల పైసలు, రైతుబంధు ఖాతాల్లో పడలేదు

ఏడాదిలో ప్రజా తిరుగుబాటు వస్తదేమో: హరీశ్‌

హైదరాబాద్‌, జనవరి 6(ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌ కోలుకుంటున్నారని, ఫిబ్రవరి నుంచి ఆయన సం పూర్ణ ఆరోగ్యంతో ప్రజల మధ్యకు వస్తారని, జిల్లాల్లో పర్యటిస్తారని, తెలంగాణ భవన్‌కొచ్చి కార్యకర్తలను కలుస్తారని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓటమి స్పీడ్‌ బ్రేకర్‌లాంటిది మాత్రమేనని, అభివృద్ధి చేసినా దుష్ప్రచారం వల్లే ఓడిపోయామని చెప్పారు. భవిష్యత్తులో మళ్లీ మంచిరోజులొస్తాయని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. శనివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం.. కేసీఆర్‌ కిట్‌ మీద ఉన్న కేసీఆర్‌ గుర్తును చెరిపేస్తోందని, కిట్‌ మీద నుంచి తొలగించవచ్చేమోకానీ.. తెలంగాణ ప్రజల గుండెల నుంచి మాత్రం తొలగించలేరని అన్నారు. కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్‌ సర్కారు రద్దు చేస్తోందని, రద్దులు, వాయిదాలు అన్నట్లుగా ప్రభుత్వం నడుస్తోందన్నారు. ఇప్పటికీ కొన్నిచోట్ల వడ్ల పైసలు పడలేదని, రైతుబంధు కూడా వేయలేదని రైతులు వ్యవసాయం ఎలా చేయాలని నిలదీశారు.

ప్రభుత్వ తీరు చూస్తుంటే ఏడాదిలోపే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదనిపిస్తోందని అన్నారు. తొలిసారి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నామని తమ సత్తా ఏంటో చూపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ దగాకోరు పార్టీ అని బీఆర్‌ఎస్‌ నేత కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చిందని, వాటిని అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని.. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను నిలిపివేయడంతో పాటు రద్దు చేసే పరిస్థితులు కనబడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా రైతుబంధు నిధుల కోసం తమ ప్రభుత్వం సిద్ధం చేసిన నిధులు ఇంకా రైతుల ఖాతాల్లో జమకాలేదని, అవన్నీ ఏ కాంట్రాక్టర్‌ ఖాతాలోకి వెళ్లాయని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒక బడా కాంట్రాక్టర్‌ ఖాతాలోకి వెళ్లాయంటూ సోషల్‌మీడియాలో సెటైర్లు పేలుతున్నాయన్నారు.

Updated Date - Jan 07 , 2024 | 07:43 AM