Share News

ఉగాది తర్వాత కేసీఆర్‌ రోడ్‌షో

ABN , Publish Date - Mar 24 , 2024 | 02:39 AM

రాష్ట్రంలో అధికారం చేజారడంతో క్యాడర్‌లో స్థైర్యం దెబ్బతిన్న వేళ.. నేతలంతా ఒక్కొక్కరుగా కారు దిగుతుండడంతో పార్టీ బలహీనపడిన వేళ..

ఉగాది తర్వాత కేసీఆర్‌ రోడ్‌షో

బహిరంగ సభలు, కార్నర్‌ మీటింగ్‌లు కూడా

మరో మూడు స్థానాలకు అభ్యర్థులను

ఖరారు చేసిన బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌

సికింద్రాబాద్‌ నుంచి పద్మారావు గౌడ్‌

నల్లగొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి,

భువనగిరి బరిలో క్యామ మల్లేశ్‌

16 స్థానాలకు పూర్తయిన ఎంపిక

హైదరాబాద్‌కు ఖరారుకాని అభ్యర్థి

హైదరాబాద్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అధికారం చేజారడంతో క్యాడర్‌లో స్థైర్యం దెబ్బతిన్న వేళ.. నేతలంతా ఒక్కొక్కరుగా కారు దిగుతుండడంతో పార్టీ బలహీనపడిన వేళ.. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు మూడో స్థానమేనని సర్వేలన్నీ స్పష్టం చేస్తున్న వేళ.. అధినేత కేసీఆర్‌ రంగంలోకి దిగుతున్నారు. శ్రేణుల్లో ధైర్యం నింపి.. కనీస సంఖ్యలోనైనా ఎంపీ సీట్లను దక్కించుకోవడం ద్వారా పార్టీ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయిన నేపథ్యంలో ఉగాది పండుగ (ఏప్రిల్‌ 9వ తేదీ) తరువాత ప్రచారం మొదలుపెట్టనున్నారు. గతంలో భారీ బహిరంగ సమావేశాలకే ప్రాధాన్యమిచ్చిన కేసీఆర్‌.. ఈసారి వాటితోపాటు రోడ్‌షోలు, కార్నర్‌ మీటింగ్‌లలో ఎక్కువగా పాల్గొనాలని నిర్ణయించారు. తద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని భావిస్తున్నారు. మొత్తం 17 నియోజకవర్గాల్లో కేసీఆర్‌ ప్రచారం ఉండేలా పార్టీ శ్రేణులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కాగా, రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాలకుగాను 13 స్థానాలకు ఇంతకుముందే అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్‌..

మరో మూడు స్థానాలకు అభ్యర్థులను శనివారం ప్రకటించారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్‌ నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.పద్మారావు గౌడ్‌ను బరిలోకి దింపాలని నిర్ణయించారు. నల్లగొండ నుంచి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డిని, భువనగిరి నుంచి క్యామ మల్లేశ్‌ను అభ్యర్థులుగా ఖరారు చేశారు. తాజాగా ప్రకటించిన 3 స్థానాలు కలిపి మొత్తం 16 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లయింది. దీంతో హైదరాబాద్‌ స్థానానికి మాత్రమే అభ్యర్థి ఎంపిక మిగిలి ఉంది. బీసీ సామాజికవర్గానికి చెందిన నూతి శ్రీకాంత్‌ను హైదరాబాద్‌ అభ్యర్థిగా పార్టీ పెద్దలు దాదాపుగా ఖరారు చేసినప్పటికీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సికింద్రాబాద్‌ నుంచి ఎవరిని బరిలో నిలపాలనే దానిపై బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం తీవ్రస్థాయిలో చర్చలు జరిపింది. రెండు మూడు పేర్లు పరిశీలించినప్పటికీ చివరికి పద్మారావు గౌడ్‌ పేరును ఖరారు చేసింది. ఆ నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలతో పూర్తిస్థాయిలో చర్చించిన అనంతరం పద్మారావును ఖరారు చేశారు. ఉద్యమకాలం నుంచి ఇప్పటివరకు పార్టీకి విధేయుడిగా ఉన్న పద్మారావుగౌడ్‌.. అందరివాడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. సికింద్రాబాద్‌ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన, నిబద్ధత కలిగిన నేతగా ఆ ప్రాంత ప్రజలు, బస్తీ వాసులుందరికీ ‘పజ్జన్న’గా సుపరిచితుడైన పద్మారావుగౌడ్‌ను సరైన అభ్యర్థిగా సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. కాగా, తనను లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించిన అధినేత కేసీఆర్‌కు పద్మారావు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Mar 24 , 2024 | 02:40 AM