Share News

Medigadda CM Revanth comments ; కేసీఆర్‌ కాశీకే!

ABN , Publish Date - Feb 14 , 2024 | 04:17 AM

కాళేశ్వరం ప్రాజెక్టులో చేసిన దోపిడీ బయట పడుతుందనే భయంతోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు బ్యారేజీ దగ్గరకు రాకుండా నల్లగొండలో సభ పెట్టుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును చూడడానికి తర్వాత వెళతామని

Medigadda CM Revanth comments ; కేసీఆర్‌ కాశీకే!

సన్యాసం పుచ్చుకుని బిచ్చమెత్తుకోవాల్సిందే.. 4-5 పిల్లర్లు పోతే తప్పేంటంటారా?

కేసీఆర్‌కు ఓ కాలు విరిగితే ఫరక్‌ పడుతుందా?

అవినీతిని బయట పెడుతుంటే ఎదురుదాడా?

వేటాడతాడట... అల్లాటప్పాగా కూర్చున్నామా?

నేను మంది పిల్లలను చంపి కుర్చీ ఎక్కలేదు

నల్లగొండకు పోయినోడు అసెంబ్లీకి రాలేడా?

తీర్మానంలో లోపాలుంటే సభకొచ్చి చెప్పాల్సింది

హరీశ్‌రావు ఎందుకు మద్దతు పలికిండు?

సీబీఐ విచారణ అడుగుతున్న బీజేపీ కేంద్రానికి

చెప్పి సిటింగ్‌ జడ్జిని ఇప్పించలేదా?

సీబీఐకి ఇస్తే కేసీఆర్‌ నుంచి గిల్లుకుందామనే?

కాళేశ్వరంపై జ్యుడీషియల్‌ ఎంక్వైరీ చేయిస్తాం

ఎల్‌అండ్‌టీపై రెవెన్యూ రికవరీ యాక్టు

అవసరమైతే తప్పకుండా ప్రయోగిస్తాం

మేడిగడ్డ సందర్శనలో రేవంత్‌ వ్యాఖ్యలు

నీటిపారుదల శాఖపై నేడు శ్వేతపత్రం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో చేసిన దోపిడీ బయట పడుతుందనే భయంతోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు బ్యారేజీ దగ్గరకు రాకుండా నల్లగొండలో సభ పెట్టుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును చూడడానికి తర్వాత వెళతామని అంటున్నారని, నిజానికి కేసీఆర్‌ వెళ్లాల్సింది కాళేశ్వరం కాదు కాశీకేనని ఎద్దేవా చేశారు. కాశీకి వెళ్లి సన్యాసం తీసుకొని బిచ్చమెత్తుకోవడం తప్ప ఆయనకేం మిగల్లేదన్నారు. రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టు కింద కనీసం లక్ష ఎకరాల ఆయకట్టుకు నీళ్లివ్వలేదని ఆరోపించారు. ఈ ప్రాజెక్టులో కేసీఆర్‌ సాగించిన అవినీతిపై న్యాయవిచారణ జరిపిస్తామని చెప్పారు. విచారణ బాధ్యతను సీబీఐకి ఇవ్వాలంటూ డిమాండ్‌ చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జ్యుడీషియల్‌ కమిషన్‌కు సిటింగ్‌ జడ్జిని ఇప్పించే బాధ్యత తీసుకోవాలని హితవు పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పిల్లర్లు కుంగిపోవడం, దాని నిర్మాణ లోపాలను చూపించడానికి రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, పత్రికా విలేకరులను మేడిగడ్డకు బస్సుల్లో తీసుకెళ్లింది. సీఎం రేవంత్‌, సాగునీటి పారుదల మంత్రి ఉత్తమ్‌ కూడా వారితో పాటే బస్సుల్లో ప్రయాణించారు. పరిస్థితిని పరిశీలించిన అనంతరం రేవంత్‌, ఉత్తమ్‌ విలేఖర్లతో మాట్లాడారు. అంతకుముందు ప్రాజెక్టు అంచనా వ్యయం, ఇప్పటివరకు అయిన వ్యయం, సృష్టించిన ఆయకట్టు వివరాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ప్రాజెక్టు ఈఎన్‌సీ సుధాకర్‌ వివరించారు. కాళేశ్వరంపై కేసీఆర్‌ అడుగడుగునా అబద్ధాలే చెప్పారని రేవంత్‌ ఆరోపించారు.

మొత్తం ప్రాజెక్టు పూర్తయితే దాదాపు 20 లక్షల ఎకరాలకు నీరందే అవకాశం ఉండగా, ఇప్పటికే కోటి ఎకరాలకు నీరందిస్తున్నట్లు కేసీఆర్‌ గొప్పలు చెప్పుకున్నారన్నారు. రూ.94 వేల కోట్లు ఖర్చు పెట్టి, నీళ్లిచ్చింది 98,570 ఎకరాలకు మాత్రమేనని చెప్పారు. మొత్తం పంపులు పనిచేస్తే సంవత్సరానికి రూ.10,500 కోట్ల బిల్లు అవుతుందని, ప్రాజెక్టు నిర్వహణ, బ్యాంకు రుణాలు, వడ్డీ, ఇవన్నీ లెక్కేస్తే సంవత్సరానికి రూ.25 వేల కోట్లు దాటుతుందని వివరించారు. సంవత్సరానికి రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తే కేసీఆర్‌ అనుకున్నట్లు ప్రాజెక్టు పూర్తయితే... 19.63 లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయన్నారు. ప్రాజెక్టుకు రూ.1.27 లక్షల కోట్లను అంచనా వేస్తే ఇప్పటికే రూ.లక్ష కోట్లు ఖర్చయ్యాయని వివరించారు. రూ.2 లక్షల కోట్లు పెడితే కానీ ప్రాజెక్టు పూర్తి అవదన్నారు. నిర్మాణం సక్రమంగా జరిగితే 20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందేదన్నారు. మేడిగడ్డ కుంగడంతో అది కూడా అనుమానంలో పడిందని చెప్పారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కూడా అదే టెక్నాలజీతో కట్టారని, ఇప్పటికే లీకేజీలు కనిపిస్తున్నాయని తెలిపారు. అధికారంలోకి రాగానే ఎన్‌డీఎ్‌సఏ నివేదికను పరిశీలించామని చెప్పారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌తో విచారణ జరిపించి, నివేదికను తెప్పించుకున్నామని, ప్రాజెక్టు డిజైన్‌, నిర్మాణ లోపాలు, నిర్వహణ లోపాలు, అంచనా వ్యయంలో లోపాలున్నట్లు విజిలెన్స్‌ నివేదిక ద్వారా గుర్తించామని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీ అంచనా రూ.1,800 కోట్లయితే రూ.4 వేల కోట్లకు పెంచారని, ఇందులో అవినీతి జరిగిందని చెప్పారు. కాళేశ్వరంలో వేల కోట్ల అవినీతి జరిగిందని స్వయంగా కాగ్‌ చెప్పిందని రేవంత్‌ ప్రస్తావించారు. విజిలెన్స్‌, కాగ్‌ నివేదికల ఆధారంగా సాగునీటి శాఖపై శ్వేతపత్రాన్ని రూపొందించామన్నారు. దానిపై బడ్జెట్‌ సమావేశాల్లో చర్చిద్దామంటే కేసీఆర్‌ తన బండారం బయట పడుతుందని ప్రజల ముందు దోషిగా నిలబడాల్సి వస్తుందన్న భయంతో వ్యూహాత్మకంగా శాసనసభను తప్పించుకొని కృష్ణా నది ప్రాజెక్టులపై తప్పుడు ఆరోపణలకు దిగారని మండిపడ్డారు. మీరు సీఎంగా ఉన్నప్పుడే కదా?

కృష్ణా ప్రాజెక్టుల స్వాధీనాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేద్దాం రమ్మని పిలుపునిస్తే కేసీఆర్‌ రాలేదన్నారు. కేంద్రానికి ప్రాజెక్టులను కాంగ్రెస్‌ ప్రభుత్వమే అప్పగించిందని కేసీఆర్‌ చెబుతున్నారని, నిజానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే 2023 డిసెంబరు 1న సీఎంవో కార్యదర్శి స్మితాసభర్వాల్‌ ప్రాజెక్టులను అప్పజెప్పుతూ కేంద్రానికి లేఖ రాశారన్నారు. లేఖను అసెంబ్లీలో ప్రవేశపెట్టామని చెప్పారు. కాళేశ్వరం మీద అనుమానాల నివృత్తికి 13న మేడిగడ్డ వెళదాం రమ్మంటే తప్పించుకున్నారని చెప్పారు. కాలు విరిగిందన్న నెపం చూపుతూ డిసెంబరు నుంచి సమావేశాలకు రావడం లేదని, విరిగిన కాలుతో నల్లగొండ ఎలా వెళ్లారని రేవంత్‌ ప్రశ్నించారు. అసెంబ్లీ దగ్గరుందా? నల్లగొండ దగ్గరుందా? అన్నారు. కాళేశ్వరంపై చర్చ జరగకూడదని, బీఆర్‌ఎస్‌ దోపిడీ బయటపడకూడదనే లక్ష్యంతోనే నల్లగొండ సభ పెట్టుకున్నారని ఆరోపించచారు. నాలుగైదు పిల్లర్లు కూలితే తప్పా అని నల్లగొండ సభలో కేసీఆర్‌ అంటున్నారని, ఆయనకు ఏదీ తప్పుకాదని ఎద్దేవా చేశారు. చులకన మాటలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని చెప్పారు.

తీర్మానంలో లోపాలుంటే వచ్చి సవరించాల్సింది

కేఆర్‌ఎంబీపై సలహా అడిగితే ఇచ్చే వాడిని కదా అని కేసీఆర్‌ అంటున్నారని రేవంత్‌ ప్రస్తావించారు. శాసనసభలోనే చర్చ పెట్టి సలహా అడిగామని, ఆదేశాలిచ్చయినా కేసీఆర్‌ను రప్పించాలని స్పీకర్‌ను కోరామని చెప్పారు. కేసీఆర్‌ వచ్చి సలహాలు, సూచనలు ఇచ్చాకే తీర్మానం చేద్దామని అనుకున్నామని వెల్లడించారు. ప్రభుత్వం పెట్టిన తీర్మానం సరిగా లేదంటే హరీశ్‌రావు ఎందుకు మద్దతు ఇచ్చారని ప్రశ్నించారు. హరీశ్‌ మాటలకు విలువ లేదు, కేసీఆర్‌ కొట్టిపారేస్తాడని అప్పుడే సభలో అన్నానని, అనుకున్నట్లే దిక్కుమాలిన, పనికిమాలిన తీర్మానమని నల్లగొండ సభలో కేసీఆర్‌ అన్నారని ప్రస్తావించారు. తీర్మానంలో లోపాలుంటే కేసీఆరే వచ్చి సవరించాల్సిందని రేవంత్‌ వ్యాఖ్యానించారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని అంటున్న కేసీఆర్‌ అదేమాట శాసనసభకు వచ్చి చెప్పాలన్నారు. ‘‘మమ్మల్ని వెంటాడతాడట... అల్లాటప్పగా కుర్చీలో కూర్చోలేదు. ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్న ప్రభుత్వం మాది. ఉద్యమం ముసుగులో మంది పిల్లలను చంపి కుర్చీ ఎక్కలేదు’’ అన్నారు. కుంగిపోయిన బ్యారేజీల మీద ఎందుకు మాట్లాడటం లేదన్నారు. కేఆర్‌ఎంబీ ప్రాజెక్టులపై మీ కార్యదర్శి రాసిన లేఖను బయట పెడితే... దానిపై ఎందుకు స్పందించడం లేదు? ఆమె మీ అనుమతి తీసుకుని రాశారా లేదా? ఆ విషయం ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? కేసీఆర్‌ అవినీతి చిట్టా మొత్తం ప్రజలకు తెలిస్తే ప్రతిపక్ష హోదా కూడా రాదని ఎద్దేవా చేశారు. కుర్చీ పోగానే కేసీఆర్‌కు గుర్తొచ్చేది నీళ్లు, నల్లగొండ ఫ్లోరైడ్‌ బాధితులని చెప్పారు.

వాస్తవాలను సమాజానికి చెప్పండి

ఎమ్మెల్యేలు, మీడియాకు నిజాలేమిటో చెప్పాలని మేడిగడ్డకు తీసుకొచ్చామని రేవంత్‌ ప్రకటించారు. న్యూయార్క్‌ స్క్వేర్‌లో ఇదో ‘మ్యాన్‌ మేడ్‌ వండర్‌’ అని గత ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చుకుందని, జాతీయ మీడియాలో చెప్పలేనంత ప్రచారం చేసుకుందని చెప్పారు. నేషనల్‌ మీడియా కూడా మేడిగడ్డ పరిస్థితులను చూపించాలని రేవంత్‌ కోరారు. ఇక్కడి అవినీతిపై చర్చలు పెట్టాలన్నారు. శాసనసభకు వస్తే కేసీఆర్‌ గౌరవం తగ్గకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ‘‘రేపు ఉదయం దయచేసి సభకు రండి. శ్వేతపత్రంపై చర్చలో పాల్గొని సూచనలు ఇవ్వండి. ప్రజల కోసం ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఒక్క క్షణమైనా ఆలోచన చేయండి’’ అన్నారు. కృష్ణా ప్రాజెక్టుల విషయంలో ఏనుగు ఇప్పటికే దాటిపోయిందని, మిగిలిన తోకను పట్టుకొని గుంజే ప్రయత్నం తమ ప్రభుత్వం చేస్తోందని రేవంత్‌ చెప్పారు. అన్ని పాపాలకు కేసీఆరే కారణమని, ఆయనే ప్రాజెక్టులను అప్పజెప్పాడని, నిర్వహణకు నిధులు ఇచ్చాడని, కేబినెట్‌లో ఆమోదించి, లేఖలు కూడా రాశారని రేవంత్‌ ఆరోపించారు. మేడిగడ్డలో నీళ్లు నింపితే మిగిలిన పిల్లర్లలో ఎన్ని ఉంటాయో ఎన్ని ఊడతాయో తేలుతుందన్నారు. సుందిళ్ల ఏ క్షణమైనా కొట్టుకుపోవడానికి సిద్ధంగా ఉందని రేవంత్‌రెడ్డి అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ ఐదు అడుగులు కుంగిందన్నారు. కేసీఆర్‌ సభకు వచ్చిఎల్‌ అండ్‌ టీ సంస్థను బ్లాక్‌ లిస్టు చేయాలా? వద్దా? సర్టిఫికెట్‌ ఇచ్చిన అధికారులను శిక్షించాలా? వద్దా? కాళేశ్వరం అవకతకవలపై మాజీ సీఎం, మాజీ నీటిపారుదల మంత్రిల అభిప్రాయం ఏమిటో చెప్పాలన్నారు కాలు ఇరిగినా, చేతకాక పోయినా మీ కోసం సభకు వచ్చిన అని చెబుతున్న కేసీఆర్‌కు జనం కోసం వచ్చే లక్షణం ఎన్నడూ లేదన్నారు.

ఎంతో మంది పిల్లలు చనిపోతే, ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటే, ఎంతో మంది గొప్ప వ్యక్తులు చనిపోతే చూడటానికి రాని కేసీఆర్‌ ఇప్పుడు కుర్చీ పోవడంతో కుర్చీని వెతుక్కుంటూ నల్గొండ వచ్చారని రేవంత్‌ ఎద్దేవా చేశారు. దక్షిణ తెలంగాణ మొత్తం లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలవడం ఖాయమని తెలియడంతో సానుభూతి కోసం నాకు కాలు లేదు, అవిటివాడిని, నడవలేకపోతున్నా అంటూ ఓట్లు అడుక్కోవడానికి వచ్చాడన్నారు. అవినీతిపరుడిగా పచ్చిగా పట్టుబడ్డ కేసీఆర్‌ను కుర్చీ నుంచి దించి రెండు నెలలు కాకముందే అడుక్కునే పని మొదలు పెట్టారన్నారు. నిజాం హాస్పిటల్‌ సానుభూతి పదేళ్లు అక్కరకు వచ్చిందని, ఇప్పుడు వీల్‌ చెయిర్‌తో ప్రయోగాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నల్లగొండ సభకు జనాలు దొరకకపోతే కల్వకుర్తి నుంచి బస్సులు పెట్టి తోలుకుపోయిండని ఆరోపించారు. కవులు, కళాకారులు, మేధావులంతా కాళేశ్వరానికి వచ్చి చూడాలని రేవంత్‌ పిలుపునిచ్చారు. హెలికాప్టర్‌ పెట్టినా రాని కేసీఆర్‌ తర్వాత వస్తానని చెబుతున్నారని, ఇక ఆయన వెళ్లాల్సింది కాళేశ్వరం కాదని, కాశీకి వెళ్లి సన్యాసం పుచ్చుకొని బిచ్చమెత్తుకోవాలని ఎద్దేవా చేశారు.

నిపుణుల అభిప్రాయాల మేరకు చర్యలు

కాళేశ్వరం విషయంలో సాంకేతిక నిపుణుల అభిప్రాయం మేరకు చర్యలు ఉంటాయని రేవంత్‌ చెప్పారు. ఒకటి రెండు పిల్లరు కూలితే ఏమవుతుందని కేసీఆర్‌ అంటున్నాడని, కేసీఆర్‌కు ఒక కాలు విరిగితే... ఆస్పత్రికి ఎందుకు వెళ్లాడని ప్రశ్నించారు. అసలు ప్రాజెక్టులో ఎల్‌ అండ్‌ ఉందా? ఇంకెవరైనా ఉన్నారా? తేలాల్సి ఉందన్నారు. మరమ్మతులకు ఎల్‌ అండ్‌ టీ ముందుకు రాకపోతే రెవెన్యూ రికవరీ యాక్టును అమలు చేసి, ప్రజాధనాన్ని రికవరీ చేస్తామన్నారు. కేసును సీబీఐకి ఇవ్వాలనడం కిషన్‌రెడ్డి అతి తెలివితేటకు నిదర్శనమని, సీబీఐకి ఇస్తే కళ్లెం తమ చేతిలోకి వస్తుందని, కేసీఆర్‌ నుంచి గిల్లుకోవచ్చని ఆయన ఆలోచిస్తున్నారని ఆరోపించారు. కిషన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో లేఖ రాయించి, సిట్టింగ్‌ జడ్జిని ఇప్పించే ప్రయత్నం చేయాలన్నారు. పదేళ్లలో గత ప్రభుత్వంపై సీబీఐ, ఈడీ, ఆదాయపన్ను శాఖలతో ఎందుకు విచారణ చేపట్టలేదన్నారు. కిషన్‌రెడ్డి వరంగల్‌లోనే ఉండి తానెందుకు రాలేదు? ఎమ్మెల్యేలను ఎందుకు పంపలేదు? ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు మేము వెళ్లడం లేదా? అని ప్రశ్నించారు.

వ్యయం రూ.93,570 కోట్లు

కాళేశ్వరం రెండు టీఎంసీల ప్రాజెక్టు అంచనా విలువ రూ.94,413 కోట్లని ఈఎన్‌సీ సుధాకర్‌ చెప్పారు. ఆయన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఎమ్మెల్యేలకు వివరించారు. కాళేశ్వరం కార్పొరేషన్‌ ద్వారా తీసుకున్న రుణం రూ.44,614 కోట్లని, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.28,886 కోట్లు పెట్టిందని చెప్పారు. మొత్తం రూ.73,500 కోట్లు అయ్యిందన్నారు. మూడో టీఎంసీ అంచనా వ్యయం రూ.33,459 కోట్లు కాగా, రుణాల కింద రూ.17,051 కోట్లు, రాష్ట్ర వాటాగా రూ.3,321 కోట్లు... మొత్తం రూ.20,372 కోట్లు అవుతుందన్నారు. మొత్తం మూడు టీఎంసీల అంచనా వ్యయం రూ.1,27,772 కోట్లు అయితే... ఇప్పటివరకు రూ.93,872 కోట్లను ఖర్చు చేశామన్నారు. ఇందులో రూ.61,665 కోట్లు రుణాలైతే, రాష్ట్ర ప్రభుత్వం రూ.32,207 కోట్లు పెట్టిందని చెప్పారు. 97,477 ఎకరాలు అవసరం కాగా, ఇప్పటివరకు 66,190 ఎకరాలను సేకరించామని, 31,287 ఎకరాలను సేకరించాల్సి ఉందని చెప్పారు. దీని కోసం ఇంకా రూ.5,438 కోట్లు కావాలన్నారు. 19,63,360 ఎకరాలకు సాగు నీరు లక్ష్యం కాగా ఇప్పటివరకు 98,570 ఎకరాలకు నీరు ఇచ్చామని చెప్పారు. మేడిగడ్డలో 8 బ్లాకుల కింద మొత్తం 85 పిల్లర్లు ఉన్నాయని, 7వ బ్లాకులో పిల్లర్లు కుంగిపోయాయని తెలిపారు. మూల కారణాన్ని కనుగొనడానికి పరీక్షిస్తున్నామని, బ్లాక్‌ 7కు టెస్టులు పూర్తయ్యాయని, 6, 8 బ్లాకులకు కూడా టెస్టులు చేయాల్సి ఉందని చెప్పారు. ఇవి నాలుగు రోజుల్లో పూర్తవుతాయన్నారు. ల్యాండ్‌ మైన్‌ అయ్యిందా, ఫెయిల్యూరా? తేలాల్సి ఉందని అన్నారు.

కేసీఆర్‌ చీకటి మిత్రులు రాలేదు

కేసీఆర్‌ చీకటి మిత్రులైన బీజేపీ వాళ్లు కూడా కాళేశ్వరం పర్యటనకు రాలేదని, వాళ్ల ఎమ్మెల్యేలు రాకుండా కిషన్‌రెడ్డి అడ్డుకున్నారని రేవంత్‌ ఆరోపించారు. చీకటి పొత్తులు ఎన్నాళ్లు? లోక్‌సభ ఎన్నికల్లో బయటపెట్టక తప్పదు అన్నారు. జ్యుడీషియల్‌ ఎంక్వైరీ వద్దని, తమ చేతికి ఇవ్వాలని బీజేపీ వాళ్లు ఎందుకు అడుగుతున్నారో తెలుసని, టీఆర్‌ఎ్‌సతో కూర్చొని మాట్లాడుకోవడం కోసమేనని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ అవినీతిపై చర్యలు తీసుకోవడానికి సహకరిస్తారా లేక కాపాడడానికి ప్రయత్నిస్తారో బీజేపీ స్పష్టం చేయాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. శాసనసభ సమావేశాలు ముగియగానే కాళేశ్వరం అవినీతిపై దృష్టి పెడతామన్నారు.

రేవంత్‌: నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీవాళ్లు ఏం చెప్పారు?

సుధాకర్‌: ప్రాజెక్టు ప్లానింగ్‌, డిజైన్‌, క్వాలిటీ కంట్రోల్‌ ఆపరేషన్‌, మెయింటెనెన్స్‌లలో కొన్ని కారణాలున్నాయని గుర్తించారు. ర్యాప్‌ విఫలం కావడమే ప్రాథమిక కారణమని చెప్పారు. అప్‌స్ట్రీమ్‌లో లోడ్‌ ఎక్కువ కావడం వల్ల కూడా ఏమైనా జరిగి ఉండొచ్చన్నారు. క్వాలిటీ కంట్రోల్‌ సరిగా లేకపోవడం కూడా కారణమన్నారు.

రేవంత్‌: 2020లోనే సమస్యలు గుర్తించారా?

సుధాకర్‌: 2020లో 10,300 క్యూసెక్కుల డిశ్చార్జి వచ్చింది. గేట్లన్నింటినీ వదిలేశాం. అప్పుడే సమస్యలున్నట్లు గుర్తించాం.

రేవంత్‌: ఈ సమస్యను 2020లోనే గుర్తించి లేఖ రాశారు. దానిని సరిదిద్దలేదు. దాంతో 2023 అక్టోబర్‌ 21న పియర్స్‌ కుంగిపోయినట్లు గుర్తించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఒకే సాంకేతిక నైపుణ్యంతో నిర్మించారు. ఈ మూడింటిలో ఒకే రకమైన సమస్యలున్నాయి. మేడిగడ్డలో తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. వాటిలో కూడా సమస్యలు వచ్చాయి. వీటన్నింటినీ కప్పి పుచ్చడానికి నీటిని వదిలేశారు. ఇప్పుడు ఎండాకాలం అయినందున నీటిని నింపుదామన్న అవకాశం లేదు.

Updated Date - Feb 14 , 2024 | 04:17 AM