Share News

తెలంగాణ అనే పదాన్ని చెరిపేసిందే కేసీఆర్‌

ABN , Publish Date - Jan 09 , 2024 | 04:46 AM

తెలంగాణ అనే పదాన్ని చెరిపేసే కుట్ర కాంగ్రెస్‌ పార్టీ చేస్తోందంటూ కేటీఆర్‌ వ్యాఖ్యానించడం ఆశ్యర్యకరంగా ఉందని, అసలు ఆ పని చేసిందే కేసీఆర్‌ అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు.

తెలంగాణ అనే పదాన్ని చెరిపేసిందే కేసీఆర్‌

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆరోపణ

ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకోండి: నిరంజన్‌

ఒక్క ఎంపీ సీటూ గెలవదు: బండ్ల గణేష్‌

హైదరాబాద్‌, జనవరి 8(ఆంధ్రజ్యోతి): తెలంగాణ అనే పదాన్ని చెరిపేసే కుట్ర కాంగ్రెస్‌ పార్టీ చేస్తోందంటూ కేటీఆర్‌ వ్యాఖ్యానించడం ఆశ్యర్యకరంగా ఉందని, అసలు ఆ పని చేసిందే కేసీఆర్‌ అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ పార్టీ పేరులోనే తెలంగాణ అన్న పదాన్ని తొలగించిన బీఆర్‌ఎస్‌ పార్టీ వాళ్లు. తెలంగాణ గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అవినీతి తప్ప కేసీఆర్‌కు ప్రజలు పట్టలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కింద పని చేసే సీబీఐతో విచారణ కన్నా.. రాష్ట్ర ప్రభుత్వంలో నిర్వహించే న్యాయ విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించే ప్రయత్నం చేస్తున్న ఈఎన్సీ మురళీధర్‌రావును తక్షణం బాధ్యతల నుంచి తొలగించాలన్నారు. కేసీఆర్‌ పాలనలో రూ.లక్ష కోట్ల అవినీతి జరగ్గా..అందులో కాళేశ్వరం, యాదాద్రి, మిషన్‌ భగీరథల్లో జరిగిన అవినీతే రూ. 50 వేల కోట్లకు పైన ఉంటుందని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ఓటమికి కేసీఆర్‌ కుటుంబం ఎంతవరకు కారణమో ముందుగా సమీక్ష చేసుకోవాలని నిరంజన్‌ హితవు పలికారు. జిల్లాలను రద్దు చేస్తామని సీఎం రేవంత్‌ ఎక్కడా చెప్పలేదని, రిటైర్డ్‌ హైకోర్టు జడ్జి నేతృత్వంలో కమిటీని వేసి శాస్త్రీయ పద్ధతిలో పునస్సమీక్షిస్తామని మాత్రమే చెప్పారన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా జిల్లాలు రద్దు చేస్తారంటూ బీఆర్‌ఎస్‌ నేతలు ప్రచారం చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన..అన్ని రాష్ట్రాలూ మెచ్చుకునే విధంగా సాగుతోందని కాంగ్రెస్‌ పార్టీ నేత బండ్ల గణేష్‌ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ప్రజాపథంలో దూసుకుపోతుంటే కేటీఆర్‌, హరీశ్‌రావుల ఈర్ష్య పీక్‌ స్టేజికి చేరుకుందన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఒక్క ఎంపీ సీటును కూడా గెలవబోదన్నారు. నెల రోజులుగా బీఆర్‌ఎస్‌ నేతల సంపాదన ఆగిపోయిందని, అందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వంపైన విమర్శలు చేస్తున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు నేరెళ్ల శారద అన్నారు.

Updated Date - Jan 09 , 2024 | 06:43 AM