కేసీఆర్, కేటీఆర్ గజినీలు
ABN , Publish Date - Oct 25 , 2024 | 11:34 PM
కేసీఆర్, కేటీఆర్ హరీ్‌షరావులను చూస్తుంటే గజిని సినిమా గుర్తుకు వస్తుందని, ఓడిపోగానే వారు చేసిన పాపాలు మరిచి గజినీలుగా మారారని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.

అప్పులు చేసి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశారు.
దామగుండం ప్రాజెక్ట్ అనుమతులు ఇచ్చింది కేసీఆరే
ఆనంద్‌కు అనుభవం లేదు...తెలవక చేస్తుండని క్షమిస్తున్నా
వుడాతో జిల్లా సమగ్రాభివృద్ధి
వికారాబాద్ నియోజకవర్గానికి 7వేల ఇళ్లు తేస్తా
త్వరలో బెల్ట్ షాపులు ఎత్తివేస్తాం
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
వికారాబాద్, అక్టోబర్ 25 : కేసీఆర్, కేటీఆర్ హరీ్‌షరావులను చూస్తుంటే గజిని సినిమా గుర్తుకు వస్తుందని, ఓడిపోగానే వారు చేసిన పాపాలు మరిచి గజినీలుగా మారారని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో మహాలక్ష్మి పథకంలో భాగంగా 500లకే గ్యాస్ సిలిండర్ ప్రొిసీడింగ్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. దామగుండం వేలకోట్ల ప్రాజెక్ట్ అని, దాంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. ఆ ప్రాజెక్టును గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఇందు కోసం కేంద్రం నుంచి రూ.130 కోట్లు కేటీఆర్ తీసుకొని మర్చిపోయి గజినీలా అయ్యారని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి గుద్దుడుకు నెత్తులు పగిలి ఆముగ్గురు చరిత్ర మర్చిపోయారన్నారని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ నేతలు పొద్దున లేస్తే అబద్దాలే చెబుతున్నారన్నారు. గత ముఖ్యమంత్రి కుటుంబం కోసం పని చేస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి పేద ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్నారన్నారు. వికారాబాద్‌లో ఓడిన మాజీ ఎమ్మెల్యేకు రాజకీయ అనుభవం లేదన్నారు. ఓడిపోయినా కూడా తెలవక చేస్తున్నాడని, క్షమిస్తూనే ఉంటామని తెలిపారు. డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టిన రోజు వరకు రాష్ట్రంలో అప్పులు తగ్గించి సంక్షేమ పథకాలు అమలయ్యే విధంగా ముందుకు ప్రభుత్వం వెళుతుందన్నారు. త్వరలో డ్వాక్రా గ్రూపులకు రూ.10 లక్షలు మిత్తి లేని రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. వుడాతో వికారాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధి చెందుతుందని, దీని పరిధిలోకి నాలుగు మునిసిపాలిటీలు, 493 గ్రామాలు వస్తాయన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3600 ఇళ్లను మంజూరు చేశారని, స్పీకర్ నియోజకవర్గం కాబట్టి వికారాబాద్‌కు 7వేల ఇండ్లు తీసుకొస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో బెల్టుషాపులు ఎత్తివేసే విధంగా ప్రయత్నం చేస్తానని, డిసెంబరు 9 నాటికి అర్హులైన రెండు లక్షల రూపాయల వరకు రుణాలు ఉన్న వారికి రుణమాఫీ పూర్తి అవుతుందని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ 10ఏళ్ల పాలనలో తెల్ల రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి ప్రజలను కులాలు, మతాల వారిగా విడగొట్టడానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ గురుకులాలను వేర్వేరుగా ఏర్పాటు చేశారన్నారు. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అందరూ కలిసి ఉండాలని ప్రతి నియోజకవర్గంలో రూ. 170 కోట్లతో ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నారన్నారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందక పోతే స్థానిక ఎంపీడీవో కార్యాలయం, మునిసిపాలిటీలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ కేంద్రాలను సంప్రదించి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సుదీర్, ఆర్డీవో వాసుచంద్ర, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, నాయకులు మహిపాల్‌రెడ్డి, ఎర్రవల్లి జాఫర్, వేమారెడ్డి, గురువారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వికారాబాద్ పట్టణంలోని రాజీవ్‌నగర్ కాలనీ సమీపంలో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను స్పీకర్ అధికారులతో కలిసి పర్యవేక్షించారు.