Share News

విచారణకు కవిత హాజరు కావటం లేదు

ABN , Publish Date - Feb 06 , 2024 | 04:04 AM

ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన కేసులో తాము జారీ చేసిన సమన్లకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత స్పందించడం లేదని, విచారణకు హాజరు కావడం లేదని ఈడీ సుప్రీంకోర్టుకు తెలిపింది.

విచారణకు కవిత హాజరు కావటం లేదు

ఢిల్లీ మద్యం కేసులో సుప్రీంకోర్టుకు ఈడీ వెల్లడి

ఇతర పిటిషన్లతో కలిపి 16న విచారణ: ధర్మాసనం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన కేసులో తాము జారీ చేసిన సమన్లకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత స్పందించడం లేదని, విచారణకు హాజరు కావడం లేదని ఈడీ సుప్రీంకోర్టుకు తెలిపింది. దీనిపై కవిత తరఫు న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపిస్తూ, ఈడీ సమన్లను సవాల్‌ చేస్తూ కవిత పిటిషన్‌ వేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టేవరకూ కొత్తగా సమన్లు జారీ చేయబోమని ఈడీ గతంలో సుప్రీంకోర్టుకు తెలిపిందని గుర్తు చేశారు. ఈడీ తరఫు న్యాయవాది అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజు జోక్యం చేసుకుంటూ.. ఆ మినహాయింపు ఆ ఒక్కసారికే పరిమితమని చెప్పారు. కవిత దాఖలు చేసిన పిటిషన్‌ సోమవారం ధర్మాసనం ముందుకు వచ్చింది. అయితే ఈ పిటిషన్‌ నళిని చిదంబరం, అభిషేక్‌ బెనర్జీల పిటిషన్లతో ట్యాగ్‌ అయి ఉన్నందున ఆ కేసుల స్టేట్‌సను ధర్మాసనం ఆరా తీసింది. ఈ సందర్భంగా ఈడీ తరఫున ఎస్‌వీ రాజు.. ఈడీ నోటీసు ఇచ్చినా కవిత హాజరు కావడం లేదని బెంచ్‌కు నివేదించారు. దీనిపై కవిత తరఫు న్యాయవాది కపిల్‌ సిబల్‌.. ఈడీ సమన్లనే కవిత సవాలు చేసినందున, విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. కవిత తరఫున సీనియర్‌ న్యాయవాదులు విక్రమ్‌ చౌదరి, నితీశ్‌ రానా కూడా కోర్టులో హాజరయ్యారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, ఈ నెల 16వ తేదీన అన్ని పిటిషన్లు కలిపి విచారిస్తామని తెలియజేసింది.

నేపథ్యం ఇదీ..

కవితకు ఈడీ గత ఏడాది సెప్టెంబరు 4న సమన్లు జారీ చేసింది. అదే నెల 15న ఢిల్లీలోని తమ ఆఫీసులో విచారణకు హాజరు కావాలని పేర్కొంది. అయితే, ఈడీ సమన్లను సవాల్‌ చేస్తూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మనీలాండరింగ్‌నిరోధక చట్టంతోపాటు ఇతర క్రిమినల్‌ చట్టాల్లో మహిళలకు మినహాయింపులు ఉన్నాయని, వాటి దృష్ట్యా.. తనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఈడీని ఆదేశించాలని కవిత విజ్ఞప్తి చేశారు. తన పిటిషన్‌పై తేల్చే లోపు ఈడీ సమన్లపై స్టే విధించాలని కోరారు. దీనిపై సుప్రీంకోర్టు.. తాము విచారణ జరిపే వరకూ కవితకు మళ్లీ సమన్లు జారీ చేయవద్దని ఈడీని అప్పట్లో ఆదేశించింది.

Updated Date - Feb 06 , 2024 | 04:04 AM