Share News

సీఎం సీటు పోతుందని రేవంత్‌కు భయం

ABN , Publish Date - May 02 , 2024 | 05:19 AM

కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రేవంత్‌రెడ్డికి ముఖ్యమంత్రి సీటు పోతుందనే భయం పట్టుకుందని కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. బుధవారం

సీఎం సీటు పోతుందని రేవంత్‌కు భయం
కరీంనగర్‌లో మాట్లాడుతున్న బండి సంజయ్‌కుమార్‌, పక్కన కేంద్ర సహాయ మంత్రి మురుగన్‌

రిజర్వేషన్ల రద్దు నాటకం కాంగ్రెస్‌ కుట్రనే

మీరు చేస్తున్నదే ‘గాడిద గుడ్డు’: సంజయ్‌

రాజ్యాంగం భగవద్గీత అని మోదీ చెప్పారు: కేంద్ర మంత్రి మురుగన్‌

భగత్‌నగర్‌/హైదరాబాద్‌, మే 1(ఆంధ్రజ్యోతి): కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రేవంత్‌రెడ్డికి ముఖ్యమంత్రి సీటు పోతుందనే భయం పట్టుకుందని కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. బుధవారం రాత్రి కరీంనగర్‌లో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ను బద్నాం చేస్తే చట్టపరమైన చర్యలకు వెనుకాడబోమన్నారు. రిజర్వేషన్ల రద్దు నాటకం కాంగ్రెస్‌ కుట్రలో భాగమేనని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి నాన్‌ లోకల్‌ అని, పదేళ్లు అధికారంలో ఉన్నా ప్రజలకు చేసిందేమి లేదన్నారు. నరేంద్ర మోదీ తెలంగాణకు గాడిదగుడ్డు కూడా ఇవ్వలేదన్న రేవంత్‌ వ్యాఖ్యలపై సంజయ్‌ స్పందించారు. ‘‘రేవంత్‌ రెడ్డీ.. మహిళల అకౌంట్లో నెలనెలా రూ.2,500 వేశావా? మరి అది గాడిద గుడ్డే కదా, వృద్ధులకు నెలనెలా రూ.4వేలు ఇచ్చావా? రైతుల అకౌంట్లో రూ.15వేలు వేస్తానని చెప్పి గాడిద గుడ్డు, గుండు సున్నా చేసినవ్‌. వడ్లకు రూ.500బోనస్‌ అని చెప్పి గాడిద గుడ్డు చూపిస్తున్నవు’’ అంటూ మండిపడ్డారు. రాజ్యాంగాన్ని భగవద్గీతగా మోదీ అభివర్ణించారని కేంద్ర మంత్రి మురుగన్‌ అన్నారు. రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను తాను బతికున్నంత కాలం మార్చే ప్రసక్తి లేదని మోదీ ప్రతి సమావేశంలోనూ చెబుతున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమం కోసం బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు.

Updated Date - May 02 , 2024 | 05:19 AM