Kandipappu Prices : రెండు రోజుల్లోనే రూ.2వేలు ఢమాల్
ABN , Publish Date - Dec 18 , 2024 | 04:41 AM
కందిపప్పు ధరలు బహిరంగ మార్కెట్‌లో ఆకాశాన్ని అంటుతున్నా వాటిని పండించే రైతుల కష్టానికి మాత్రం ప్రతిఫలం దక్కడం లేదు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు
కందుల ధరలు అమాంతం పతనం... నారాయణపేటలో శనివారం రూ.12,450 గరిష్ఠ ధర
సోమవారానికి రూ.10,756 వరకు తగ్గుదల
మార్క్‌ఫెడ్ కొనుగోళ్లు లేక వ్యాపారుల ఇష్టారాజ్యం
గిట్టుబాటు కావడం లేదని రైతుల ఆందోళన
మహబూబ్‌నగర్, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కందిపప్పు ధరలు బహిరంగ మార్కెట్‌లో ఆకాశాన్ని అంటుతున్నా వాటిని పండించే రైతుల కష్టానికి మాత్రం ప్రతిఫలం దక్కడం లేదు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడాన్ని ఆసరాగా తీసుకుని వ్యాపారులు ధరల అంశంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కంది రైతులకు నష్టం చేస్తున్నారు. సీజన్ ఆరంభం నుంచి శనివారం వరకు బాగానే పలికిన ధరలు సోమవారానికి రూ.2 వేల మేర పడిపోయాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో మహబూబ్‌నగర్, రంగారెడ్డి, ఆదిలాబాద్, మెదక్, నల్లగొండ జిల్లాల్లో కంది సాగు అధికంగా జరుగుతోంది. సుమారు 3.50 లక్షల టన్నుల కందులు మార్కెట్‌కు వస్తుంటాయి. కేంద్ర ప్రభుత్వం 2024-25కు గాను కందులకు క్వింటాలుకు రూ.7550 కనీస మద్దతు ధర నిర్ణయించింది. అయితే ఈ ధర రైతులకు సరిపోదు. మద్దతు ధర కంటే ఎక్కువ మొత్తం చెల్లిస్తుండడంతో రైతులు వ్యాపారులనే ఆశ్రయిస్తుంటారు. ఇదే వ్యాపారులకు అవకాశంగా మారింది.
వ్యాపారుల సిండికేట్..!
రాష్ట్రంలోని తాండూరు, నారాయణపేట మార్కెట్ యార్డుల్లో కందుల కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతాయి. ఈనామ్ విధానంలో ప్రతీరోజు వ్యాపారులు ధరలను నిర్ణయిస్తారు. ఈక్రమంలో ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. అయితే, శనివారం వరకు మంచి ధరలు ఇచ్చిన వ్యాపారులు మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలు లేవని సోమవారానికి ధరలు బాగా తగ్గించేశారు. నారాయణపేట మార్కెట్‌లో శనివారం ఓ క్వింటాలుకు గరిష్ఠంగా రూ.12,450 ధర పలకగా సోమవారానికి అది రూ.10,756కు పడిపోయింది. వికారాబాద్ జిల్లా తాండూరులో సోమవారం గరిష్ఠ ధర రూ.9254 రాగా సగటు ధర రూ.8811 పలికింది. నవాబుపేటలో రూ.9011, జడ్చర్ల మార్కెట్‌లో రూ.8066 మాత్రమే వచ్చింది. శనివారంతో పోలిస్తే ఈ మార్కెట్లలో ధరలు సోమవారానికి రూ.2వేలకు పైగా తగ్గాయి. వ్యాపారులంతా సిండికేట్‌గా మారి ధరలు తగ్గించేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. పైగా, ప్రతీ మార్కెట్‌లో గరిష్ఠ ధరను తక్కువ లాట్లకే ఇస్తుంటారు. ఉదాహరణకు ఎక్కువ పంట తీసుకొచ్చిన రైతుకు వ్యాపారులు తక్కువ ధర ఇస్తారు. తక్కువ కందులు తెచ్చిన రైతుకు గరిష్ఠ ధర చెల్లిస్తారు. మరోపక్క, ఆయా మార్కెట్లలోని కమీషన్ ఏజెంట్లు 4 శాతం మేర కమీషన్‌గా వసూళ్లు చేస్తుండడంతో రైతులు నష్టపోతున్నారు. కాగా,, ఽవ్యాపారులు ధరలను అమాంతం తగ్గించేయడంపై నారాయణపేట మార్కెట్‌లో రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. కార్యాలయంలోని కుర్చీలను ధ్వంసం చేశారు. మంగళవారం కూడా ఆందోళన కొనసాగడంతో ఆర్డీవో రాంచందర్, మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ప్రసాద్ రైతులతో చర్చలు జరిపారు. సోమవారం టెండర్ అయిన ధరకు రూ.250 అదనంగా ఇస్తామని చెప్పి రైతులను ఒప్పించారు. కానీ, టెండర్లు వేయక ధరలు నిర్ణయించలేదు కొనుగోళ్లు జరగలేదు. అయితే, మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే తమకు మంచి ధరలు వస్తాయని రైతులు అభిప్రాయపడుతున్నారు.
పెట్టుబడి కూడా రావడం లేదు
కందులను మార్కెట్‌కు తీసుకువస్తే అనుకున్న ధర లభించడం లేదు. శనివారం కన్నా సోమవారం దాదాపు రూ.1500 తక్కువ ధర పలికాయి. ఇలా ధర తగ్గిస్తే రైతుల పరిస్థితి ఏంటి. రూ.11 వేల కంటే తక్కువకు కందులు కొనుగోలు చేస్తే మేము నష్టపోతాం. నేను ఐదు బస్తాల కందుల తీసుకెళ్లా. క్వింటాలుకు రూ.8780 ధర నిర్ణయించారు.
ఎల్లమ్మ, రైతు,
మన్నపూర్, మద్దూర్ మండలం