Share News

కల్వకుంట్ల కన్నారావు అరెస్టు

ABN , Publish Date - Apr 03 , 2024 | 02:33 AM

మాజీ సీఎం కేసీఆర్‌ అన్న కుమారుడు కల్వకుంట్ల తేజేశ్వర్‌రావు అలియాస్‌ కన్నారావును రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీసు లు మంగళవారం అరెస్టు చేశారు. ఆదిభట్లలోని మన్నెగూడలో ఓ

కల్వకుంట్ల కన్నారావు అరెస్టు

భూ వివాదంలో జోక్యం.. నెల రోజులుగా పరారీ

ఆదిభట్ల, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం కేసీఆర్‌ అన్న కుమారుడు కల్వకుంట్ల తేజేశ్వర్‌రావు అలియాస్‌ కన్నారావును రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీసు లు మంగళవారం అరెస్టు చేశారు. ఆదిభట్లలోని మన్నెగూడలో ఓ భూవివాదంలో జోక్యం చేసుకున్న కేసులో ఆయన నిందితుడు. కన్నారావును మంగళవారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం మన్నెగూడకు చెందిన జక్కిడి సురేందర్‌రెడ్డి మన్నెగూడలోని సర్వే నంబర్‌ 32లో ఉన్న 2 ఎకరాల 15 గుంటల భూమిని 2013లో చామ సురేశ్‌ వద్ద రూ.కోటి తీసుకుని, జీపీఏ చేశారు. ఆ మొత్తం తిరిగి చెల్లించాక.. ఆ భూమిని తిరిగి సురేందర్‌రెడ్డి పేరిట మార్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఇది జరిగిన రెండు నెలల తర్వాత సురేశ్‌ ఆ భూమిని సెల్ఫ్‌ రిజిస్ట్రేషన్‌ చేయించారు. 2020 వరకు సురేందర్‌రెడ్డి డబ్బులను తిరిగి ఇవ్వలేదు. దాంతో సురేశ్‌ ఈ భూమిని ఓఎ్‌సఆర్‌ గ్రూప్‌ అనే రియల్‌ఎస్టేట్‌ కంపెనీ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ పేరిట రిజిస్టర్‌ చేశారు. ఆ తర్వాత జక్కిడి సురేందర్‌రెడ్డికి.. శ్రీనివా్‌సకు మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో శ్రీనివాస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. సురేందర్‌రెడ్డి వివాదాన్ని పరిష్కరించాలని కోరుతూ కన్నారావును కలిశారు. డీల్‌ సెటిల్‌ చేయడానికి ఇరువురి మధ్య 2021లో ఒప్పందం కుదిరింది. ఆ మేరకు కన్నారావుకు సురేందర్‌రెడ్డి రూ.3కోట్లు ఇవ్వాలి. అలా విడతల వారీగా రూ.2.35 కోట్లను అందజేశారు. డబ్బులిచ్చినా.. పనిచేయడం లేదంటూ కన్నారావుపై సురేందర్‌రెడ్డి ఒత్తిడి పెరగడంతో.. గత నెల 3వ తేదీ తెల్లవారుజామున కన్నారావు సహాయకులు డేనియల్‌, శివ, మరో 40 మంది ఆ భూమిపైకి వచ్చి, వాచ్‌మన్‌పై దాడి చేశారు.

ఎక్స్‌కవేటర్లతో భూమి చుట్టూ వేసిన ప్రీకాస్ట్‌ ప్రహరీని కూల్చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, ఎక్స్‌కవేటర్‌ డ్రైవర్‌, యజమాని, మరో ముగ్గురిని అరెస్టు చేశారు. ఏ1 సురేందర్‌రెడ్డి, ఏ2 హరినాథ్‌ సహా.. మొత్తం 8 మంది ఈ కేసులో అరెస్టై, రిమాండ్‌లో ఉండగా.. ఏ3గా ఉన్న కన్నారావు మాత్రం అప్పటి నుంచి పరారీలో ఉన్నారు. బెయిల్‌ కోసం ప్రయత్నాలు చేస్తూనే.. ఢిల్లీ, బెంగళూరులో మకాం వేశారు. మాల్దీవులకు కూడా మూడ్రోజుల ట్రిప్‌కు వెళ్లారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ఏడు ఫోన్లు, సిమ్‌కార్డులను మార్చారు. కన్నారావు కోసం 12 మంది పోలీసులతో మూడు బృందాలను ఏర్పాటు చేశామని.. మంగళవారం అరెస్టు చేశామని ఆదిభట్ల ఇన్‌స్పెక్టర్‌ రాఘవేందర్‌రెడ్డి తెలిపారు. ఈ కేసులో 40 మంది దాకా నిందితులున్నారని, 23 మందిని గుర్తించామని చెప్పారు. మిగతా నిందితులను కూడా అరెస్టు చేస్తామన్నారు. కన్నారావును మరింత విచారించాల్సి ఉందని, కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుంటామని వెల్లడించారు. అయితే.. కన్నారావు తానే పోలీసులకు ఫోన్‌ చేసి, లొంగిపోయినట్లు చెబుతున్నారు.

Updated Date - Apr 03 , 2024 | 02:33 AM