రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చిన వ్యక్తి కాళోజీ
ABN , Publish Date - Sep 09 , 2024 | 11:00 PM
ప్రజల్లో సామాజిక, రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చిన కాళోజీ కృషి మరువలేనిదని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు.
జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
వికారాబాద్, సెప్టెంబరు 9 : ప్రజల్లో సామాజిక, రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చిన కాళోజీ కృషి మరువలేనిదని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. సోమవారం తెలంగాణ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని కాళోజీ నారాయణరావు జయంతిని కలెక్టరేట్‌లో యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కాళోజీ నారాయణరావు చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు ఆర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. సామాజిక సమస్యలపై నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా స్పందించే వ్యక్తిత్వం కాళోజీదన్నారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్తలు బందప్ప, నర్సప్పగౌడ్, సంగీతపు రాజలింగంలు కాళోజీ జీవనశైలి, కవిత్వంలో ఆయన వాడిన పదజాలంపై కవితా సంపుటితో వివరించారు. ఈ సందర్భంగా వారిని కలెక్టర్ శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, ఆర్డీవో వాసుచంద్ర , డీవైఎ్‌సవో హనుమంతరావు, ఉపేందర్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో 199 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం దిశగా అధికారులు పనిచేయాలన్నారు. అధిక వర్షాలతో దెబ్బతిన్న పంటల వివరాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలు సమర్పించాలని తెలిపారు. ప్రభుత్వ భవనాలు, ఇళ్లు దెబ్బతిన్నట్లయితే వివరాలివ్వాలన్నారు.
కాళోజి ఆశయాలు భవిష్యత్ తరాలకు ఆదర్శం : అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి
మేడ్చల్ సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతిప్రతినిధి) : ప్రజల కోసం నిత్యం పరితపించిన కవితామూర్తి కాళోజి అని, ఆయన ఆశయాలు భవిష్యత్ తరాలకు ఆదర్శమని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా యువజన, క్రీడాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కాళోజి జయంతి సందర్భంగా కాళోజి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టుక నీది, చావు నీది బతుకంతా దేశానిది అన్న కాళోజి మాటలు అందరికి ఆదర్శమని అన్నారు. తెలంగాణ ప్రజల కోసం తన కలం ద్వారా తెలంగాణ భాష, యాస ఎంత మంచిగుంటదో రాసి మరీ చూపించారని అన్నారు. కార్యక్రమంలో డీఆర్‌వో హరిప్రియ, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.