కల్లు... గొల్లు!
ABN , Publish Date - Aug 25 , 2024 | 12:02 AM
సహజసిద్ధమైన తాటి, ఈత చెట్ల నుంచి తీసే స్వచ్ఛమైన కల్లుకు బదులుగా నిషేధిత మత్తు పదార్థాలతో తయారు చేసిన కల్తీ కల్లు కష్టజీవులను కాటేస్తోంది, ఏళ్ల తరబడి కృత్రిమ కల్లు తాగుతున్న వారంతా ఎముకలు గూడులా, జీవచ్ఛవంలా తయారవుతున్నారు. క్లోరోఫాం, అల్ఫాజోలం.. డైజోఫాం.. ఇప్పుడు జిల్లాలో చాలమందిని వణికిస్తున్న డ్రగ్ ఇది.. మామూలు మనుషులను కూడా సైకోలుగా మార్చే శక్తి దీనికుంది. ఇప్పుడు వందలాది కుటుంబాలకు శాపంగా మారింది. మనుషులను నిద్రపుచ్చడానికి పనికి వచ్చే ఈ కల్తీకల్లు ఇప్పుడు ఎన్నో జీవితాలను నాశనం చేస్తోంది. కృత్రిమ కల్లు తయారు చేస్తూ అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్న మాఫియాల పాపం ఇది. మోతాదుకు మించి కల్లులో కలపడం వల్ల ఆ కల్లుకు అలవాడు పడిన వారు పూర్తిగా బానిసలైపోతున్నారు. ఇటీవల జిల్లాలో జరిగిన ఘటనలే ఇందుకు సాక్ష్యం.
కాటేస్తున్న కల్తీకల్లు!
మూడేళ్ల కిందట ఎర్రవల్లి, మమ్మదాన్‌పల్లి, నారాయణపూర్ గ్రామాల్లో 200 మందికి పైగా అస్వస్థత
తాజాగా పీరంపల్లిలో కల్తీ కల్లు పంజా
ఒకరు మృతి, నలుగురికి కిడ్నీలపై ప్రభావం..
ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులు
జిల్లాలో అనుమతులు లేని కల్లు దుకాణాలేఎక్కువ
గ్రామాల్లో విచ్చలవిడిగా విక్రయాలు...
కోట్లల్లో కల్లు వ్యాపారం..
మామూళ్ల మత్తులో ఎక్సైజ్ అధికారులు
సహజసిద్ధమైన తాటి, ఈత చెట్ల నుంచి తీసే స్వచ్ఛమైన కల్లుకు బదులుగా నిషేధిత మత్తు పదార్థాలతో తయారు చేసిన కల్తీ కల్లు కష్టజీవులను కాటేస్తోంది, ఏళ్ల తరబడి కృత్రిమ కల్లు తాగుతున్న వారంతా ఎముకలు గూడులా, జీవచ్ఛవంలా తయారవుతున్నారు. క్లోరోఫాం, అల్ఫాజోలం.. డైజోఫాం.. ఇప్పుడు జిల్లాలో చాలమందిని వణికిస్తున్న డ్రగ్ ఇది.. మామూలు మనుషులను కూడా సైకోలుగా మార్చే శక్తి దీనికుంది. ఇప్పుడు వందలాది కుటుంబాలకు శాపంగా మారింది. మనుషులను నిద్రపుచ్చడానికి పనికి వచ్చే ఈ కల్తీకల్లు ఇప్పుడు ఎన్నో జీవితాలను నాశనం చేస్తోంది. కృత్రిమ కల్లు తయారు చేస్తూ అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్న మాఫియాల పాపం ఇది. మోతాదుకు మించి కల్లులో కలపడం వల్ల ఆ కల్లుకు అలవాడు పడిన వారు పూర్తిగా బానిసలైపోతున్నారు. ఇటీవల జిల్లాలో జరిగిన ఘటనలే ఇందుకు సాక్ష్యం.
వికారాబాద్, ఆగస్టు 24 : ప్రజల శారీరక శ్రమను తీర్చాల్సిన కల్లు కలుషితమై ప్రజల ప్రాణాలను హరిస్తోంది. అంతే కాకుండా శరీరంలోని అవయవాలను దెబ్బ తీస్తూ లోలోపల కోలుకోలేని విధంగా దెబ్బతీస్తోంది. కూలీనాలి చేసుకుని కుటుంబం వెళ్లదీసుకునే పేదలు ఆసుపత్రుల పాలయ్యేలా చేసి ఆర్థికంగా మరింత చితికిపోయేలా చేస్తోంది. ఇందుకు కల్లు వ్యాపారుల అత్యాశ ఒక కారణమైతే... మరోవైపు కాసులకు అలవాటు పడ్డ ఎక్సైజ్ శాఖ మరో కారణం. వికారాబాద్ మండల పరిధిలో గతంలో ఎర్రవల్లి, నారాయణపూర్, నవాబుపేట పరిధిలోని మమ్మదాన్‌పల్లి, చిట్టిగిద్ద తదితర గ్రామాల్లో కల్తీ కల్లు బారిన పడి ఎంతో ఆసుపత్రుల పాలయ్యారు. తాజాగా వికారాబాద్ మండలం పీరంపల్లి గ్రామంలో కల్తీ కల్లు తాగి పలువురు ఆసుపత్రుల పాలైన విషయం ఆ గ్రామస్తులను భయాందోళనకు గురి చేస్తోంది. కలుషిత కల్లు తాగి దుర్గయ్య అనే వ్యక్తి మృతి చెందగా, మరో నలుగురి కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపింది. అంతేకాకుండా ఎంతో మంది ఆసుపత్రుల పాలయ్యారు.
కొన్నింటికే అనుమతులు...
వికారాబాద్ జిల్లా పరిధిలో టీఎఫ్‌టీలు 341 , టీసీఎస్‌లు 57 ఉండగా, 2246 మంది లైసెన్స్ హోల్టర్లు ఉన్నారు. కాగా, జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా కల్లు దుకాణాలు కొనసాగుతున్నాయి. ఒక గ్రామంలో ఒకటి లేదా రెండు కల్లు దుకాణాలకు అనుమతులు ఉండగా అనుమతులు లేకుండా మరికొన్ని కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో పుట్టుక నుంచి చావు వరకు అనేక సందర్భాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కల్లు భాగంగా మారింది. పేదల బలహీనతను ఆసరాగా చేసుకున్న కల్లు వ్యాపారులు తమ ఇష్టానుసారంగా కల్లు దుకాణాలు తెరిపిస్తున్నారు. విచ్చలవిడిగా కల్లు విక్రయాలు జరిగేలా చేస్తున్నారు. జిల్లాలో సుమారు 400 వరకు కల్లు దుకాణాలు అనుమతులు లేకుండానే కొనసాగుతున్నాయంటే ఎక్సైజ్ శాఖ పనితీరు ఏ విధంగా ఉందనేది స్పష్టమవుతోంది.
కోట్ల వ్యాపారానికి.. ఎక్సైజ్ అధికారుల గులాంగిరి
జిల్లాలో కల్లు వ్యాపారం వ్యాపారులకు కాసులు కురిపిస్తోంది. అయితే టీఎఫ్‌టీ పరిధి అయినా, టీసీఎస్ పరిధి అయినా ఎక్కడ ఉండే కల్లు అక్కడే విక్రయించాలనేది నిబంధన. అయితే జిల్లాలో ఒక ప్రాంతంలోని కల్లును అక్కడే విక్రయించిన సందర్భాలు లేవు. కల్లు డిపోలు ఏర్పాటు చేసి ఆయా గ్రామాలకు రోడ్డుమార్గం ద్వారా కల్లు తరలిస్తున్నారు. మూడేళ్ల కిందట నవాబుపేట చిట్టిగిద్ద వద్ద ఉన్న డిపో నుంచి సరఫరా చేసిన కల్లు వల్లనే పరిసరాల్లోని పలు గ్రామాల ప్రజలు అవస్థలు పడ్డారు. తాజాగా పీరంపల్లిలో కల్తీ కల్లు తాగి 60 మంది వరకు అస్వస్థతకు గురైన సంఘటన తెలిసిందే. ఆ గ్రామంలో కల్లు వ్యాపారం చేసేందుకు అనుమతులు లేవు. అక్కడ విక్రయించే వ్యాపారి ఎక్కడో తయారు చేసుకుని వచ్చి గ్రామంలో కల్లు విక్రయిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గత కొన్నేళ్లుగా అక్కడ కల్లు విక్రయిస్తున్నా ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం ఆ వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.
పీరంపల్లి ఘటనలో ఒకరు మృతి...
రాఖీ పండుగ రోజు ఇళ్లకు వచ్చే చుట్టాలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. సాయంత్రం సమయంలో సంతోషంతో ప్రజలు కల్లు తాగారు. రోజుమాదిరి కంటే ఎక్కువ కల్లు గ్రామంలోకి రాగా రోజూ కల్లు తాగే వారితో పాటు పండుగకు తమ ఇళ్లకు వచ్చిన అక్కా చెల్లెళ్లు, బంధువులు సైతం కల్లు తాగారు. పండుగ మరుసటి రోజు నుంచే ఒక్కొక్కరుగా ఆసుపత్రుల్లో చేరుతూ వచ్చారు. ఇప్పటి వరకు సుమారు 60 మంది వరకు ఆయా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, వారిలో దుర్గయ్య(57) అనే వ్యక్తి మూడు రోజుల కిందట మృతి చెందాడు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న మరో నలుగురి కిడ్నీలపై ప్రభావం చూపినట్లుగా తెలుస్తోంది. మిగతా వారు ఇంకా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కల్తీకాదంటున్న ఎక్సైజ్ అధికారులు...
ఇదిలా ఉంటే, ల్యాబ్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి నివేదికలు రాక ముందే కల్తీకల్లు కాదని ఎక్సైజ్ అధికారులు తేల్చేయడం చర్చనీయాంశంగా మారింది. అనుమతి లేకుండా కల్లు వ్యాపారం కొనసాగుతున్నదని, కల్లుకారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడమే కాకుండా ఎంతో మంది ఆసుపత్రుల పాలయ్యారనేది పక్కన పెట్టేసి... సీజనల్ వ్యాధుల వల్లనే పీరంపల్లిలో పలువురు అస్వస్థతకు గురైనట్లుగా విలేకరుల సమావేశంలో అధికారులు ప్రకటించడం విమర్శలకు దారి తీస్తోంది. పీరంపల్లి గ్రామంలో ఐదు రోజులుగా వైద్య శిబిరం నిర్వహిస్తుండగా, గురువారం గ్రామంలో పర్యటించిన జిల్లా వైద్యాధికారి ముందు కల్తీకల్లు బారిన పడిన వారు కోలుకుంటున్నారని ప్రకటించి, ఆ తరువాత సీజనల్ వ్యాధులతో అని చెప్పడం కూడా ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే విధంగా అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదనేది అంతుపట్టని పరిస్థితి నెలకొంది. పీరంపల్లిలో కల్లు తాగి పలువురు అస్వస్థతకు గురైన ఉదంతంలో సంబంధిత శాఖల అధికారుల తీరు పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పర్యటించిన అధికారులు
ఇప్పటికే ఎంపీడీవో బృందం గ్రామంలో పర్యటించి నీటి పరీక్షలు చేసి గ్రామంలో తాగునీరు కలుషితం కాలేదని, తాగునీటి పరంగా ఏ సమస్య లేదని స్పష్టం చేసింది. ఒకవైపు గ్రామంలో ప్రజలు అస్వస్థతకు గురవడానికి నీటి సమస్య కారణం కాదని మండల పరిషత్ అధికారులు... మరో వైపు కల్లీ కల్లు కాదని ఎక్సైజ్ అధికారులు పేర్కొనడం గమనార్హం. నీరు కలుషితం కాకుండా, క ల్లు కల్లీ కాకుండా 60 మంది వరకు ఆసుపత్రుల పాలవడానికి దారితీసిన కారణాలపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడం గమనార్హం.