Share News

కబ్జాలపై చర్యలేవీ?

ABN , Publish Date - Apr 06 , 2024 | 04:19 AM

కాకతీయ యూనివర్సిటీ భూములు కబ్జాకోరుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. వర్సిటీ అధికారులు, పోలీసులు, రాజకీయ నేతలు, రౌడీ షీటర్లు యథేచ్చగా విశ్వవిద్యాలయ భూములను ఆక్రమించేస్తున్నారు. అంతా తెలిసినా వర్సిటీ అధికారులు

కబ్జాలపై చర్యలేవీ?

కేయూ భూములు కాజేసిన వర్సిటీ అధికారులు, పోలీసులు, నేతలు

కాకతీయ విశ్వవిద్యాలయ భూములు అన్యాక్రాంతం

కలెక్టర్‌ సర్వే.. 51 ఎకరాలు మాయమైనట్లు గుర్తింపు

విచారణ కమిటీ నివేదికను తొక్కిపెడుతున్న అధికారులు

దర్యాప్తు జరిపిస్తే వందల కోట్ల భూ దందా వెలుగులోకి

వరంగల్‌, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కాకతీయ యూనివర్సిటీ భూములు కబ్జాకోరుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. వర్సిటీ అధికారులు, పోలీసులు, రాజకీయ నేతలు, రౌడీ షీటర్లు యథేచ్చగా విశ్వవిద్యాలయ భూములను ఆక్రమించేస్తున్నారు. అంతా తెలిసినా వర్సిటీ అధికారులు చోద్యం చూస్తుండటంతో రూ.వందల కోట్ల విలువ చేసే 51 ఎకరాల భూములు ఇప్పటికే మాయమయ్యాయి. కబ్జాలపై విచారణ కమిటీ ఇచ్చిన నివేదికను తొక్కి పెడుతూ యూనివర్సిటీ అధికారులు అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. వరంగల్‌లో కాకతీయ యూనివర్సిటీని 1976లో ఏర్పాటు చేశారు. అప్పుడు వర్సిటీ కోసం కుమారపల్లిలో 188.28ఎకరాలు, లష్కర్‌ సింగారంలో 309.20 ఎకరాలు, పలివేల్పుల శివారులో 175.14ఎకరాల చొప్పున 673.12 ఎకరాల భూమిని కేటాయించారు. అయితే, ప్రధాన రహదారి వెంట మాత్రమే ప్రహరీ నిర్మించారు. వెనుక భాగంలో గోడ లేకపోవటంతో పలివేల్పుల, డబ్బాల ఏరియా, ముచ్చర్ల రోడ్డు వైపు ఉన్న భూముల్లో చాలా వరకు వర్సిటీ ఉద్యోగులు, రాజకీయ నాయకులు, రౌడీషీటర్లు, పోలీసు అధికారులు దొరికినంత కబ్జాలు చేసుకున్నారు. సర్వే నంబరుకు బై నంబర్లు, వేరే అదనపు నంబర్లు వేసుకుని రికార్డుల్లో మార్పు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో 2021లో అప్పటి కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు డిఫరెన్షియల్‌ గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టం(డీజీపీఎస్‌) ద్వారా వర్సిటీ భూములను సర్వే చేయించారు. అయితే 622.2 ఎకరాల భూములే లెక్కలోకి వస్తున్నాయి. సుమారు 51 ఎకరాలు కబ్జాకు గురైనట్లు గుర్తించారు. ఇందులో 229, 234, 412, 413, 414 సర్వే నంబర్లతో పాటు మరికొన్ని సర్వే నంబర్లలో భూములు కబ్జా అయినట్టు తేలింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎకరాకు రూ.3 కోట్లకుపైగా ధర పలుకుతోంది. రూ.150 కోట్లకుపైగా విలువైన భూములు మాయమయ్యాయి.

అంతా తెలిసినా.. చర్యలు శూన్యం..

వర్సిటీలో కబ్జాల పర్వం కొనసాగుతున్నా.. వర్సిటీ అధికారులు పట్టించుకోవటం లేదనే ఆరోపణలున్నాయి. 2021లో డీజీపీఎస్‌ ద్వారా సర్వే చేసి 622.20ఎకరాల వర్సిటీ భూములు ఉన్నట్లు నివేదిక ఇచ్చారు. అందులోనూ కొంత మేర భూములు కబ్జాకు గురైనట్లు తేలింది. కేయూ ఉద్యోగి అశోక్‌తో పాటు మరో ఇద్దరు, కొంతమంది పోలీసు అధికారులు, రౌడీషీటర్లు, రాజకీయ నాయకులు కలిసి మొత్తం 19 మంది అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. 2023లో కలెక్టర్‌ ప్రత్యేక సర్వే చేయించగా ఆ నివేదికలో కూడా కేయూ ఉద్యోగి అశోక్‌తో పాటు మరో ఇద్దరి పేర్లను ప్రస్తావించారు. కేయూ వీసీకి వీరు సన్నిహితంగా ఉండటం వల్లే వారిపై చర్యలు తీసుకోవటం లేదనే విమర్శలున్నాయి. 214 సర్వే నంబరులోని ఎకరం 36 గుంటల భూమి కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఆ భూమిని దక్కించుకునేందుకు వర్సిటీ అధికారులు న్యాయ పోరాటం చేయటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2021 నుంచి వర్సిటీ భూములపై స్పష్టత రావటంతో పాటు కబ్జాదారుల పేర్లు బయటకు వచ్చినా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

కబ్జాలపై కమిటీ నివేదిక ఎక్కడ..?

భూముల కబ్జాలపై విద్యార్థులు, ప్రొఫెసర్లు ఆందోళనకు దిగడంతో వీసీ టి.రమేశ్‌ స్పందించి.. అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ అశోక్‌బాబు కన్వీనర్‌గా విచారణ కమిటీని నియమించారు. అయితే అశోక్‌బాబుపైనే కబ్జాల ఆరోపణలు రావటంతో 2022 అక్టోబరులో ప్రొఫెసర్‌ చంద్రమౌళి కన్వీనర్‌గా మరో కమిటీని నియమించారు. ఈ కమిటీ కలెక్టర్‌ ఆధ్వర్యంలో చేపట్టిన డిజిటల్‌ సర్వే ఆధారంగా 622.2 ఎకరాల్లో భూమి ఎంత కబ్జా అయిందో.. ఎవరెవరు ఎంత భూమిని కబ్జా చేశారో గుర్తించింది. 2023 నవంబరులోనే కేయూ పాలక మండలి చైర్మన్‌, వీసీ రమేశ్‌బాబుకు నివేదిక ఇచ్చింది. కమిటీ నివేదికలో ఏముందో పాలకమండలిలో పెట్టి చర్చించిన తర్వాత ఆమోదించాల్సి ఉంది. అయితే, ఐదు నెలలైనా స్పందన లేకపోవడంతో.. నివేదికను వీసీ తొక్కి పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్త ప్రభుత్వమైనా దీనిపై దృష్టిసారించి కబ్జాలపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశించాలని ప్రొఫెసర్లు, విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Apr 06 , 2024 | 04:19 AM