జర్నలిస్టులెప్పుడూ ప్రతిపక్షమే
ABN , Publish Date - Mar 06 , 2024 | 04:14 AM
జర్నలిస్టులు ఎప్పుడూ ప్రతిపక్షమేనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయ నాయకులు మోర్ పవర్ అంటే పాత్రికేయులు మోర్ ఫ్రీడమ్ అంటారని తెలిపారు.

జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే తెలుగువారిని ప్రోత్సహిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
జర్నలిస్టు వెంకట నారాయణకు ‘పొత్తూరి’ స్మారక పురస్కారం ప్రదానం
హైదరాబాద్ సిటీ, మార్చి5(ఆంధ్రజ్యోతి) : జర్నలిస్టులు ఎప్పుడూ ప్రతిపక్షమేనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయ నాయకులు మోర్ పవర్ అంటే పాత్రికేయులు మోర్ ఫ్రీడమ్ అంటారని తెలిపారు. ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు స్మారక కమిటీ ఆధ్వర్యంలో రవీంద్ర భారతీలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. ప్రముఖ జర్నలిస్టు వెంకట నారాయణకు ఉత్తమ పాత్రికేయ పురస్కారం అందజేశారు. శాలువా, జ్ఞాపికతోపాటు రూ.లక్ష నగదు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. పాత్రికేయులు లేవనెత్తిన అంశాలను వీలైనంత వరకు పరిష్కరించాలనే ఆలోచనతో తమ ప్రభుత్వం ఉందన్నారు. రాజకీయ, న్యాయ, సామాజిక రంగాలలో జాతీయ స్థాయిలో తెలుగువారి పాత్ర అధికమవ్వాలని ఆకాంక్షించారు. ఏపీ, తెలంగాణ నుంచి జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయగలిగే వారిని తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ప్రకటించారు. జాతీయ, అంతర్జాతీయ జర్నలిజంలో వెంకట నారాయణ అందిస్తోన్న ేసవలను కొనియాడారు. ఇక, పొత్తూరి స్మారక పురస్కారం అందుకోవడం అత్యంత గౌరవంగా భావిస్తున్నానని పురస్కార గ్రహీత వెంకట నారాయణ పేర్కొన్నారు. కాగా, ‘ఆంధ్రజ్యోతి‘ ఎడిటర్ కె.శ్రీనివాస్ వంటి విలువలు కలిగిన వారు ఇంకా పాత్రికేయ రంగంలో ఉండడం వల్లే.. సమాజానికి నాలుగో స్తంభమైన మీడియా కూలిపోకుండా ఉందని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ‘ఆంధ్రజ్యోతి’ ఎడిటర్ కె.శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టులు కె. రామచంద్రమూర్తి, పాశం యాదగిరి, రచయిత వోలేటి పార్వతీశం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.