Share News

జనజాతర టార్గెట్‌..10లక్షలు!

ABN , Publish Date - Apr 04 , 2024 | 05:32 AM

తుక్కుగూడలో ఈ నెల 6న తలపెట్టిన జనజాతర సభకు కాంగ్రెస్‌ పార్టీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సభకు ఏకంగా పది లక్షల మందిని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. జన సమీకరణ

జనజాతర టార్గెట్‌..10లక్షలు!

తుక్కుగూడ సభకు భారీగా జన సమీకరణ

హాజరు కానున్న రాహుల్‌, ప్రియాంక, ఖర్గే

పాంచ్‌ న్యాయ్‌ గ్యారెంటీలు, మేనిఫెస్టో

తెలుగులో విడుదలకు కాంగ్రెస్‌ సన్నాహాలు

రాజ్యాంగ నాశనానికి మోదీ యత్నం!

దాన్ని ‘ఇండియా’ ఆపుతోంది: రాహుల్‌

వయనాడ్‌ అభ్యర్థిగా అట్టహాసంగా నామినేషన్‌

వెంట సోదరి ప్రియాంక.. భారీ రోడ్‌షో

పెద్దసంఖ్యలో కార్యకర్తలు, జనం హాజరు

వయనాడ్‌లో స్మృతి ఇరానీ ప్రచారం

నేడు బీజేపీ నుంచి సురేంద్రన్‌ నామినేషన్‌

తర్వాత రోడ్‌ షో, సభ.. రాహుల్‌పై ఒత్తిడి

పెంచేందుకే ప్రచారం చేయనున్న స్మృతి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): తుక్కుగూడలో ఈ నెల 6న తలపెట్టిన జనజాతర సభకు కాంగ్రెస్‌ పార్టీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సభకు ఏకంగా పది లక్షల మందిని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. జన సమీకరణ బాధ్యతను ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు అప్పజెప్పింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ప్రకటించిన పాంచ్‌ న్యాయ్‌ గ్యారెంటీలు, ఈ నెల 5న విడుదల చేయనున్న ఎన్నికల మేనిఫెస్టోను ప్రాంతీయ భాషల్లో విడుదల చేసేందుకు ఉత్తరాదిన రెండు, దక్షిణాదిన రెండు సభలు నిర్వహించాలని ఏఐసీసీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే పాంచ్‌ న్యాయ్‌ గ్యారెంటీలు, పార్టీ ఎన్నికల మేనిఫెస్టో తెలుగు ప్రతులను విడుదల చేసేందుకు ఈ నెల 6న తుక్కుగూడలో జనజాతర సభ నిర్వహించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ హాజరు కానున్నారు. ఈ నెల 6వ తేదీన సాయంత్రం 3.30 గంటలకు ప్రత్యేక విమానంలో రాహుల్‌, ప్రియాంక హైదరాబాద్‌ చేరుకోనున్నారు. సాయంత్రం 5.15 గంటలకు తుక్కుగూడ సభా ప్రాంగణానికి చేరుకుని పాంచ్‌న్యాయ్‌ గ్యారెంటీలు, పార్టీ మేనిఫెస్టో తెలుగు ప్రతులను విడుదల చేయనున్నారు. సభను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకుని, ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు. అయితే ఖర్గే రాకకు సంబంధించి షెడ్యూల్‌ ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది.

మోదీని గద్దె దించడమే లక్ష్యంగా..

దక్షిణాదిలో కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారానికి తుక్కుగూడ సభ.. కిక్‌ స్టార్ట్‌గా ఉండేలా రేవంత్‌రెడ్డి ప్రణాళికలు రచిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబరు 17న ఇదే తుక్కుగూడలో భారీ బహిరంగ సభను నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ.. ఆరు గ్యారెంటీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ రోజు నుంచి రాష్ట్రంలో ప్రారంభమైన జోష్‌.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగడంతో పార్టీ అధికారంలోకి వచ్చింది. దీన్ని సెంటిమెంట్‌గా తీసుకున్న కాంగ్రెస్‌.. లోక్‌సభ ఎన్నికల శంఖారవాన్నీ ఏప్రిల్‌ 6న ఇదే వేదిక నుంచి పూరించనుంది. గతంలో ఆరు గ్యారెంటీలను ప్రకటించి కేసీఆర్‌ను గద్దె దింపినట్టుగానే.. ఇప్పుడు పాంచ్‌ న్యాయ్‌ గ్యారెంటీలను ప్రకటించడం ద్వారా మోదీ పాలనకు చరమగీతం పాడుతామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. తుక్కుగూడలో 60 ఎకరాల మేరకు ఉన్న మైదాన ప్రాంతంలో జనజాతర సభను నిర్వహించనున్నారు. వాహనాల పార్కింగ్‌కు మరో 300 ఎకరాల స్థలమూ అందుబాటులో ఉంది. పది లక్షల మంది ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు.

Updated Date - Apr 04 , 2024 | 05:42 AM