Share News

జలగండం?

ABN , Publish Date - Apr 03 , 2024 | 11:41 PM

జిల్లాలో వేసవిలో తాగునీటి సమస్య ఎదురవుతోంది. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోనూ ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శివారు ప్రాంతాలకు మిషన్‌ భగీరథ నీరు సక్రమంగా సరఫరా కాకపోవడంతో ప్రజలకు తాగునీటి ఇక్కట్లు తప్పడం లేదు. భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతున్న నేపథ్యంలో సమస్య మరింత త్రీవం కానుంది. దీంతో వ్యవసాయ బోరుబావుల వద్దకు పరుగులు పెడుతున్నారు. అయితే వ్యవసాయం బోర్లు, బావులను అద్దెకు తీసుకుని ప్రజలకు తాగునీటిని సరఫరా చేయాలని అధికారులు నిర్ణయించారు

జలగండం?

వేగంగా అడుగంటుతున్న భూగర్భ జలాలు

ఎల్లూరులోనూ గణనీయంగా తగ్గుతున్న నీటిమట్టం

తాగునీటి సమస్య ఎదురు కాకుండా ముందస్తు చర్యలు

మిషన్‌ భగీరథతో పాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై యంత్రాంగం దృష్టి

ముందస్తు చర్యలకు రూ.3.54 కోట్ల సీడీఎఫ్‌ నిధులు విడుదల

జిల్లాలో వేసవిలో తాగునీటి సమస్య ఎదురవుతోంది. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోనూ ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శివారు ప్రాంతాలకు మిషన్‌ భగీరథ నీరు సక్రమంగా సరఫరా కాకపోవడంతో ప్రజలకు తాగునీటి ఇక్కట్లు తప్పడం లేదు. భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతున్న నేపథ్యంలో సమస్య మరింత త్రీవం కానుంది. దీంతో వ్యవసాయ బోరుబావుల వద్దకు పరుగులు పెడుతున్నారు. అయితే వ్యవసాయం బోర్లు, బావులను అద్దెకు తీసుకుని ప్రజలకు తాగునీటిని సరఫరా చేయాలని అధికారులు నిర్ణయించారు

వికారాబాద్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : భూగర్భ జలాలు వేగంగా తగ్గిపోతుండడంతో వేసవిలో జిల్లాలో తాగునీటి సమస్య ఉత్పన్నమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఎల్లూరు సెగ్మెంట్‌ నుంచి మిషన్‌ భగీరథ ద్వారా వికారాబాద్‌ జిల్లాకు తాగునీటి సరఫరా కొనసాగుతోంది. రాఘవాపూర్‌ సమీపంలోని వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ నుంచి పరిగి, వికారాబాద్‌, తాండూరు, కొడంగల్‌ నియోజకవర్గాలకు మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా జరుగుతోంది. జిల్లాకు తాగునీటిని సరఫరా చేసే ప్రధాన తాగునీటి వనరులైన ఎల్లూరులోనూ నీటి మట్టం గణనీయంగా తగ్గుతుండగా, గత ఏడాదితో పోలిస్తే జిల్లాలో భూగర్భ జలాలు వేగంగా కిందకు పడిపోతున్నాయి. ఏప్రిల్‌, మే నెలల్లో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ వేసవిలో తాగునీటి సమస్య ఎదురు కాకుండా ముందస్తు చర్యలపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. తాగునీటి సమస్య ఎదురు కాకుండా తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై మిషన్‌ భగీరథ అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు.

రోజూ 8,70,09 కిలో లీటర్ల తాగునీరు సరఫరా

జిల్లాలో నాలుగు మునిసిపాలిటీలు, 566 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 990 ఆవాసాలున్నాయి. మిషన్‌ భగీరథ ద్వారా 964 ఆవాసాలకు 871 ఓహెచ్‌ఎ్‌సఆర్‌ ట్యాంకుల ద్వారా తాగునీటి సరఫరా జరుగుతోంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు 100ఎల్‌పీసీడీ, పట్టణ ప్రాంత ప్రజలకు 135 ఎల్‌పీసీడీ నీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుంది. జిల్లాకు ప్రతిరోజూ 8,70,09కిలో లీటర్ల నీటి సరఫరా జరిగే విధంగా మిషన్‌ భగీరథ యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. పెరుగుతున్న ఎండలు, పెరగనున్న విద్యుత్‌ డిమాండ్‌ కారణంగా ఒత్తిడి పెరిగి పంపింగ్‌ మోటార్లు కాలిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పంపు సెట్ల మరమ్మతులు, బోరు బావుల్లో ఫ్లషింగ్‌ పనులు, పైపులైన్లు, చేతి పంపుల మరమ్మతులు ఎప్పటికప్పుడు చేపట్టే విధంగా మిషన్‌ భగీరథ అధికారులు ముందుగానే కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. నిరుపయోగంగా ఉన్న పవర్‌ పంపులు, సింగిల్‌ ఫేజ్‌ పంపు సెట్లు, చేతి పంపులను ఉపయోగించుకునేందుకు వీలుగా సంసిద్ధం చేస్తున్నారు. వేసవిలో తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా కలెక్టర్‌ నారాయణరెడ్డి ఇటీవల మిషన్‌ భగీరథ, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

అప్పుడే తాగునీటి ఇబ్బందులు?

జిల్లాలో ప్రతి వేసవిలోనూ తాగునీటి సమస్య ఎదురవుతోంది. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోనూ ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు. శివారు ప్రాంతాలకు మిషన్‌ భగీరథ నీరు సక్రమంగా సరఫరా కాకపోవడంతో ఆ ప్రాంతాల ప్రజలకు తాగునీటి ఇక్కట్లు తప్పడం లేదు. భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతున్న నేపథ్యంలో తాగునీటి సమస్య ఎదురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. జిల్లాలో మిషన్‌ భగీరథ ప్లాంట్‌కు నీటిని సరఫరా చేసే ప్రధాన నీటి వనరులో నీరు అడుగంటక ముందే తాగునీటి ఇబ్బందులు ఎదురు కాకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. మిషన్‌ భగీరథ కారణంగా వినియోగంలో లేని తాగునీటి సరఫరా పథకాలకు మరమ్మతులు చేపట్టి సిద్ధంగా ఉంచేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పంపుసెట్లు కాలిపోయినా నీటి సరఫరా నిలిచిపోకుండా కార్యాచరణ సిద్ధం చేశారు.

వినియోగించని శివసాగర్‌ నీరు

జిల్లాలో గ్రామీణ ప్రాంతాలతో పాటు మునిసిపాలిటీల్లోనూ మిషన్‌ భగీరథ ద్వారా నీటి సరఫరా కొనసాగుతోంది. వికారాబాద్‌ పట్టణంలో మిషన్‌ భగీరథ కంటే ముందు మంజీరా, శివసాగర్‌ ద్వారా తాగునీటి సరఫరా జరిగేది. ప్రస్తుతం మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా కొనసాగడంతో శివసాగర్‌ నీరు వినియోగించడం లేదు. వేసవిలో తాగునీటి ఇక్కట్లు ఎదురు కాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా అవసరమైతే శివసాగర్‌ నుంచి తాగునీటి సరఫరా చేసే విధంగా పంప్‌హౌస్‌, ఫిల్టర్‌బెడ్‌ సిద్ధం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. కాగ్నా నుంచి తాండూరు పట్టణ ంతో పాటు పరిసర గ్రామాలకు నీటిని సరఫరా చేసేలా కార్యాచరణ సిద్ధం చేశారు.

రూ.3.54 కోట్లు మంజూరు ...

జిల్లాలో తాగునీటి సమస్య ఎదురు కాకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 3.54 కోట్లు ఎస్‌డీఎఫ్‌ నిధులు మంజూరు చేసింది. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 776 పనులు చేపట్టాలని ప్రతిపాదించగా, ఇప్పటి వరకు ఆ పనుల్లో 140 పనులు పూర్తి చేశారు. తాగునీటి సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రాథమికంగా అంచనా వేసిన ఆవాసాల్లో పంప్‌సెట్లు, పైపులైన్లు, చేతి పంపుల మరమ్మతులు, బోరు బావుల్లో ఫ్లషింగ్‌ పనులు చేపట్టే విధంగా ప్రణాళిక తయారు చేశారు. తాగునీటి సమస్య పరిష్కారానికి అవసరమైతే సమీపంలో ఉన్న వ్యవసాయ బోర్లు, బావులను అద్దెకు తీసుకుని ప్రజలకు తాగునీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు.

తాగునీటి సమస్య ఎదురవకుండా చర్యలు

జిల్లాలో తాగునీటి సమస్య ఎదురు కాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. మిషన్‌ భగీరథ నీటి సరఫరాలో ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే నీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపడతాం. పంపుసెట్లు, పైపులైన్లలో మరమ్మతులు ఏర్పడితే 24 గంటల్లోగా సరి చేయించి నీటి సరఫరా జరిగేలా చూస్తాం. అంతరాయం లేకుండా తాగునీటి సరఫరా కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నాం.

- బాబు శ్రీనివాస్‌, మిషన్‌ భగీరథ ఈఈ, వికారాబాద్‌

Updated Date - Apr 04 , 2024 | 12:59 AM