Share News

లక్ష్మణ్‌.. పొలిటికల్‌ చిప్‌ ఖరాబైంది

ABN , Publish Date - May 15 , 2024 | 03:12 AM

బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్‌ పొలిటికల్‌ చిప్‌ ఖరాబైందని, తక్షణమే దాన్ని రిపేర్‌ చేయించుకుంటే ఆయనకే మంచిదని టీపీసీసీ కార్యనిర్వాహక

లక్ష్మణ్‌.. పొలిటికల్‌ చిప్‌ ఖరాబైంది

తక్షణం రిపేర్‌ చేయించుకుంటే మంచిది

కాంగ్రెస్‌కు సొంతంగా 64 సీట్లున్నయ్‌

ఐదేళ్లూ మా సర్కారే ఉంటుంది: జగ్గారెడ్డి

హైదరాబాద్‌, మే 14(ఆంధ్రజ్యోతి): బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్‌ పొలిటికల్‌ చిప్‌ ఖరాబైందని, తక్షణమే దాన్ని రిపేర్‌ చేయించుకుంటే ఆయనకే మంచిదని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. రానున్న ఐదేళ్లూ కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఉంటుందని, ఆయన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. గాంధీభవన్‌లో మంగళవారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయంటే ఆ క్రెడిట్‌ సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికే దక్కతుందన్నారు. ఆగస్టులో కాంగ్రెస్‌ సంక్షోభంలో పడుతుందంటూ లక్ష్మణ్‌ చేసిన వ్యాఖ్యలు విని ప్రజలు గందరగోళ పడొద్దన్నారు. ఆగస్టు సంక్షోభం అన్నది ఒట్టి మాట అంటూ కొట్టి పారేశారు. రాష్ట్రంలో 64 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను గెలిపించి ప్రజలు అధికారం ఇచ్చారని, రేవంత్‌ ప్రభుత్వం ఐదేళ్లూ కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ డిస్ట్రబ్‌ చేయాలని చూపినా.. సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు ఒక్కతాటిపై నిలబడి ఐదేళ్లూ ప్రభుత్వాన్ని కాపాడుకుంటారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500 గ్యాస్‌ సిలిండర్‌ వంటి పథకాలూ అమలవుతున్నాయని చెప్పారు. ఆగస్టు 15 కల్లా రైతు రుణమాఫీని సీఎం రేవంత్‌ అమలు చేస్తారని అన్నారు. ‘‘కేంద్రంలోని మీ బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై చర్చకు సిద్ధమా?’’ అంటూ లక్ష్మణ్‌కు సవాల్‌ విసిరారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ.. ఇవ్వలేదని, దానిపైన ఆలోచన చేయాలని హితవు పలికారు. బట్టకాల్చి మీద వేయడం బీజేపీకి ఉన్న అలవాటైతే.. చెప్పింది చెయ్యడం గాంధీ కుటుంబానికి ఉన్న అలవాటని పేర్కొన్నారు. 2 కోట్ల ఉద్యోగాల హామీని పక్కన పెట్టి.. దేవుడిని ముందుకు తెచ్చి పెట్టారని తెలిపారు. ‘‘శివలింగంపై పాము ఉంటే మొక్కుతాం. అది దిగి.. పక్కకు చేరితే చంపుతాం. ప్రస్తుతం బీజేపీ వాళ్లు శివలింగంపై కూర్చుని ఉన్నారు. బీజేపీపై కోపం ఉన్నా.. శివలింగాన్ని చూసి ప్రజలు ఊరుకుంటున్నారు’’ అని జగ్గారెడ్డి అన్నారు.


బీఆర్‌ఎస్‌ విలీనం అంటే జనం నమ్మాలి కదా..?

‘‘కాంగ్రె్‌సలో బీఆర్‌ఎస్‌ విలీనం అవుతుందంటూ లక్ష్మణ్‌ మాట్లాడుతున్నడు. కేసీఆర్‌.. పార్టీని ఎందుకు విలీనం చేస్తడు..? చెబితే జనం నమ్మాలి కదా?’’ అని జగ్గారెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పార్టీ మారితే మారొచ్చని, అలా మారాలనుకుంటే బీజేపీలోకి వెళ్లరు కదా..? అని అన్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి 20 మంది వస్తే కాంగ్రెస్‌ బలం 84కు చేరుకుంటుందని, బీజేపీ ఎమ్మెల్యేల్లోనూ ఓ ఐదుగురు మనసు మార్చుకుని కాంగ్రెస్‌ పార్టీలోకి రావచ్చేమోనని చెప్పారు. ఈ మాత్రం ఆలోచన లక్ష్మణ్‌కు రాలేదా..? అని జగ్గారెడ్డి అన్నారు.

Updated Date - May 15 , 2024 | 03:12 AM