Share News

త్యాగం.. దేశభక్తి కలిగిన నేత రాజీవ్‌గాంధీ

ABN , Publish Date - Apr 25 , 2024 | 04:01 AM

త్యాగం, దేశ భక్తి కలిగిన నేత.. ప్రజల సమస్యలపై అవగాహన ఉన్న నాయకుడు రాజీవ్‌గాంధీ అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. దేశ ప్రజలను ఆయన కుటుంబ సభ్యుల్లా భావించేవారని, దేశానికి శాంతి సందేశాన్నీ

త్యాగం.. దేశభక్తి కలిగిన నేత రాజీవ్‌గాంధీ

రాజీవ్‌ ఆశయాల సాధనకు రాహుల్‌ కృషి.. రాజీవ్‌తోనే టెలీకమ్యూనికేషన్‌ విప్లవం

మోదీ, కేసీఆర్‌ వాడే ఫోన్‌ టెక్నాలజీ ఆయన తెచ్చిందే

ఆ టెక్నాలజీతోనే.. కేసీఆర్‌ జైల్లో ఉన్న తన బిడ్డతో మాట్లాడుతున్నారు

కాంగ్రెస్‌ ఏం చేసిందని కేటీఆర్‌, హరీశ్‌ అంటున్నారు

వారి చేతిలోని సెల్‌ఫోన్లో రాజీవ్‌ ఉన్నారు

హైటెక్‌సిటీకి పునాది కూడా ఆయన ఆలోచనే: జగ్గారెడ్డి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): త్యాగం, దేశ భక్తి కలిగిన నేత.. ప్రజల సమస్యలపై అవగాహన ఉన్న నాయకుడు రాజీవ్‌గాంధీ అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. దేశ ప్రజలను ఆయన కుటుంబ సభ్యుల్లా భావించేవారని, దేశానికి శాంతి సందేశాన్నీ ఇచ్చారని అన్నారు. రాజీవ్‌ ఆశయాల సాధన కోసం ఇప్పుడు రాహుల్‌గాంధీ కృషి చేస్తున్నారన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు. ‘‘గడిచిన 70 ఏళ్లలో కాంగ్రెస్‌ పార్టీ ఏం చేసిందని కేటీఆర్‌, హరీశ్‌రావు, బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వారి చేతుల్లో ఉన్న సెల్‌ఫోన్లోనే రాజీవ్‌గాంధీ ఉన్నారు. రాజీవ్‌గాంధీ కుటుంబాన్ని గురించి మాట్లాడేప్పుడు ఆయన తీసుకువచ్చిన టెక్నాలజీని గుర్తుచేసుకోవాలి. దేశంలో ఐటీకి, టెలీకమ్యూనికేషన్‌ రంగానికి.. ముఖ్యంగా సెల్‌ఫోన్‌ టెక్నాలజీకి ఆయన పునాదులు వేశారు. రాజీవ్‌ హయాంలోనే.. ఏపీ సీఎంగా ఉన్న నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి హైటెక్‌సిటీకి పునాదివేశారు. దేశంలో ఐటీ రంగం ఇంతగా అభివృద్ధి చెందడానికి కారణం రాజీవ్‌గాంధీనే’’ అని వివరించారు. ఓటు ద్వారా ఎన్నికల వ్యవస్థను నెహ్రూ తీసుకువస్తే.. 18 ఏళ్లకే ఓటుహక్కును కల్పించిన ఘనత రాజీవ్‌గాంధీదేనన్నారు. ‘‘దేశానికి రాజీవ్‌గాంధీ శాంతి సందేశాన్నిచారు. శ్రీలంకలో శాంతిని కాపాడేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలోనే ఎల్‌టీటీఈ కుట్రకు బలయ్యారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అలా శాంతి కోసం, ప్రజల కోసం బలిదానాలు చేసిన కుటుంబం గాంధీలదని వివరించారు. బీజేపీ నేతలకు ఇలాంటి చరిత్ర ఉందా? అని నిలదీశారు. రాజీవ్‌ ఆశయాల సాధనలో భాగంగానే రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర నిర్వహించి, ప్రజల సమస్యలను తెలుసుకున్నారని వ్యాఖ్యానించారు.

Updated Date - Apr 25 , 2024 | 04:01 AM