Share News

లంచం ఇవ్వలేదని ఇల్లు కట్టుకోనివ్వట్లే

ABN , Publish Date - Jan 17 , 2024 | 04:04 AM

లంచం ఇవ్వలేదని సర్పంచ్‌, పంచాయతీ సిబ్బంది మా ఇంటి నిర్మాణాన్ని అడ్డుకున్నారు...

లంచం ఇవ్వలేదని ఇల్లు కట్టుకోనివ్వట్లే

బాసరలో వక్ఫ్‌ బోర్డు భూములు మింగేస్తున్నారు

ప్రజావాణికి వేర్వేరు ఫిర్యాదులు.. మొత్తం 590 దరఖాస్తులు

సంక్రాంతి నేపథ్యంలో తగ్గిన అర్జీల సంఖ్య

బేగంపేట, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): లంచం ఇవ్వలేదని సర్పంచ్‌, పంచాయతీ సిబ్బంది మా ఇంటి నిర్మాణాన్ని అడ్డుకున్నారు... బాసర శివారులోని వక్ఫ్‌ బోర్డు భూములకు అక్రమంగా పట్టాలు చేసి అమ్మేస్తున్నారు... ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణికి వచ్చిన కొన్ని ఫిర్యాదులు ఇవి. వీటితో పాటు వేర్వేరు సమస్యలకు సంబంధించి ప్రజావాణికి 578, ప్రజాపాలనకు 12 కలిసి మొత్తం 590 దరఖాస్తులు వచ్చాయి. రూ.1.50 లక్షల నగదు లేదా 60 గజాల స్థలం లంచం ఇవ్వలేదని తమ గ్రామ సర్పంచ్‌ తన ఇంటి నిర్మాణ పనులను అడ్డుకున్నారని అమీన్‌పూర్‌ మండలం సుల్తాన్‌పూర్‌కు చెందిన మైతారం సురేష్‌ నాయీ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ దరఖాస్తును స్వీకరించి వివరాలు సేకరించిన హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి సమస్యను వీలైనంత త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇక, నిర్మల్‌ జిల్లా బాసర శివారులో వక్ఫ్‌బోర్డుకు చెందిన 450 ఎకరాల భూములను కొందరు సిండికేట్‌గా ఏర్పడి పట్టా పాస్‌బుక్‌లు చేసి అమ్ముకుంటున్నారని బాసర మాజీ ఉప సర్పంచ్‌ సయ్యద్‌ ఖలీల్‌ ఫిర్యాదు చేశారు. ఇప్పటికే 270 ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయని పేర్కొన్నారు. ఇక, గురుకుల కళాశాలు, పాఠశాలల్లో కొలువుల భర్తీకి 2023 ఆగస్టులో నిర్వహించిన పరీక్షల విడుదల చేసి నియామకాలు చేపట్టాలని కొందరు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా, సంక్రాంతి పండుగ నేపథ్యంలో మంగళవారం ప్రజావాణికి వచ్చిన దరఖాస్తుల సంఖ్య గణనీయంగా తగ్గిందని అధికారులు తెలిపారు.

Updated Date - Jan 17 , 2024 | 04:04 AM