Share News

ట్యాంకుల్లో నీరు సురక్షితమేనా?

ABN , Publish Date - Apr 05 , 2024 | 11:45 PM

ఓవర్‌హెడ్‌ ట్యాంకుల్లోనుంచి ఇళ్లలోకి సరఫరా అయ్యే నీరు సురక్షితమేనా? వాటి నిర్వహణ సరిగానే ఉందా? అనే చర్చ మొదలైంది.

 ట్యాంకుల్లో నీరు సురక్షితమేనా?
భువనగిరిలోని ప్రధాన నీటి ట్యాంక్‌

నాగార్జునసాగర్‌ ఘటనతో ట్యాంకుల నిర్వహణపై చర్చ

మినీ ట్యాంకుల నిర్వహణ అస్తవ్యస్తం అంటున్న స్థానికులు

ప్రధాన ట్యాంకులు సురక్షితమే అంటున్న అధికారులు

భువనగిరి టౌన, ఏప్రిల్‌ 5: ఓవర్‌హెడ్‌ ట్యాంకుల్లోనుంచి ఇళ్లలోకి సరఫరా అయ్యే నీరు సురక్షితమేనా? వాటి నిర్వహణ సరిగానే ఉందా? అనే చర్చ మొదలైంది. ఇటీవల నల్లగొండ జిల్లా పరిధిలోని నాగార్జునసాగర్‌లోని ఓ కాలనీకి తాగునీటిని సరఫరా చేసే ట్యాంకులో 30కోతులు మృత్యువాత పడడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ క్రమంలో స్థానికంగా ట్యాంకుల నిర్వహణ సరిగానే ఉందా? అందులోనుంచి ఇళ్లలోకి సరఫరా అయ్యే తాగునీరు సరక్షితమేనా? అనే ప్రశ్నలు చర్చనీయాంశమయ్యాయి. ఇదే విషయమై జిల్లా కేంద్రమైన భువనగిరి మునిసిపాలిటీని పరిశీలిద్దాం.. భువనగిరి పట్టణం కేంద్రంగా తాగునీటి సరఫరా ట్యాంకులపై చర్చ జరుగుతోంది. సికింద్రాబాద్‌ సైనిక్‌పురి రిజర్వాయర్‌ నుంచి రోజువారీగా 5.7 ఎంఎల్‌డీ గోదావరి జలాలు, సుమారు 1 ఎంఎల్‌డి స్థానిక జలాల సరఫరా జరుగుతోంది. పైపులైనలేని ప్రాంతాల్లో మూడు ట్యాంకర్ల ద్వారా రోజువారీగా తాగునీటిని మునిసిపాలిటీ సరఫరా చేస్తోంది. గోదావరి జలాలను మూడు రోజులకు ఒకసారి, స్థానిక జలాలను రోజు విడిచి రోజు వేర్వేరు పైపులైన్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. కాగా భువనగిరి పట్టణ పరిధిలో ఆరు ప్రధాన ట్యాంకులు, 14 మినీ ట్యాంకులు ఉన్నాయి. క్రమం తప్పకుండా ట్యాంకులను శుభ్రం చేస్తున్నట్లు అధికారులతో పాటు సిబ్బంది పేర్కొంటున్నారు. అయితే ప్రధాన ట్యాంకుల నిర్వహణ సక్రమంగానే ఉన్నప్పటికీ బస్తీల్లోని కొన్ని మినీ ట్యాంక్‌ల నిర్వాహణ అద్వానంగా ఉన్నట్లు కంటికి కనిపిస్తోంది. అన్ని ట్యాంక్‌లకు మూతలు ఉన్నప్పటికీ వాటి పరిసరాల పరిశుభ్రతను మా మాత్రం మునిసిపల్‌ యంత్రాంగం విస్మరిస్తోందని స్థానికులు అంటున్నారు. సికింద్రాబాద్‌ నుంచి భువనగిరికి రక్షిత జలాలను సరఫరా చేసే సుమారు 50 కిలోమీటర్ల పైపులైనకు తరచూ తలెత్తే లీకేజీలకు మరమ్మతులు చేస్తున్న సందర్భంలో అప్పుడప్పుడూ నల్లాల ద్వారా కలుషిత నీరు కూడా సరఫరా అవుతోందని సానికులు పేర్కొంటున్నారు. పైపులైనకు మరమ్మతులు చేపట్టిన వెంటనే సంబంధిత ట్యాంక్‌లను శుభ్రం చేస్తే ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాదని పట్టణ వాసులు అంటున్నారు. అయితే భువనగిరిలో కోతుల సంచారం విరివిగా ఉన్న నేపథ్యంలో నాగార్జునసాగర్‌ ఘటన ఇక్కడా తలెత్తకుండా జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మునిసిపాలిటీదేనని పలువురు అంటున్నారు.

ట్యాంకుల నీరు సురక్షితమే..అపోహలు వద్దు

భువనగిరి మునిసిపల్‌ పరిధిలోని నీటి ట్యాంక్‌ల నిర్వహణ సక్రమంగానే ఉంది. అన్ని ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేస్తున్నాం. స్థానిక జలాలను క్లోరినేషన చేస్తున్నాం. అన్ని ట్యాంకులకు మూతలు ఉన్నాయి. ట్యాంకుల నిర్వహణను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నాం. శిథిలావస్థకు చేరిన మినీ ట్యాంకులను తొలగించి నూతన ట్యాంకులను నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించాం. ట్యాంకుల నిర్వహణపై ప్రజలు ఎలాంటి అపోహలకు గురి కావద్దు. కలుషిత నీరు సరఫరా అయినా, ట్యాంక్‌ల నిర్వహణలో లోపాలు తలెత్తినా వెంటనే ప్రజలు మునిసిపల్‌ అధికారులకు లేదా సిబ్బందికి సమాచారం ఇవ్వాలి.

-పి.రామాంజుల్‌రెడ్డి, మునిసిపల్‌ కమిషనర్‌, భువనగిరి

Updated Date - Apr 05 , 2024 | 11:45 PM