Share News

Manchiryāla- ముంపు బెడద తప్పేనా?

ABN , Publish Date - Feb 02 , 2024 | 10:42 PM

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతి ష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుల సముదాయం వల్ల రైతులకు ఎనలేని నష్టం వాటిళ్లుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు సముదాయంలో భాగంగా గోదావరి నదిపై నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల బ్యాక్‌ వాటర్‌ కారణంగా జిల్లాలో వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం కలుగుతోంది.

Manchiryāla-    ముంపు బెడద తప్పేనా?
కోటపల్లి మండలం రాంపూర్‌ వద్ద నీట మునిగిన పత్తి (ఫైల్‌)

- మూడేళ్లుగా నష్టపోతున్న అన్నదాతలు

- శాశ్వత పరిష్కారం కోసం ఎదురుచూపులు

మంచిర్యాల, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతి ష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుల సముదాయం వల్ల రైతులకు ఎనలేని నష్టం వాటిళ్లుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు సముదాయంలో భాగంగా గోదావరి నదిపై నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల బ్యాక్‌ వాటర్‌ కారణంగా జిల్లాలో వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం కలుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన నాటి నుంచి ఇదే పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. ప్రాజెక్టు నిర్మించినందుకు సంతోషించాలో, బాధపడాలో తెలియని పరిస్థితుల్లో రైతులు ఆందోళన చెందుతున్నారు. నీళ్లుంటే పొలాలు పండుతాయని, తమ కష్టాలు తీరుతాయని భావించిన రైతులకు ప్రాజెక్టుల విధ్వంసం వల్ల చివరకు కన్నీరే మిగులుతోంది. ముఖ్యంగా వర్షాకాలంలో గోదావరి ఉప్పొంగి నీరంతా సమీపంలోని పంట పొలాలకు చేరుతుండటంతో చేతికొచ్చిన పంట నీళ్లపాలవుతోంది. సుమారు నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి పునరావృతం అవుతున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకున్న పాపాన పోవడం లేదనే ఆరోపణలున్నాయి. పొలాల్లోకి నీరు చేరి పంట మునిగిపోవడంతో అఽధికారులు వచ్చి నష్టం అంచనా వేసి, హడావుడి చేయడమే తప్ప...రైతులకు ఒరగబెట్టిన మేలేదీ లేదనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

పరిహారానికి నోచుకోని రైతులు..

ప్రాజెక్టుల బ్యాక్‌ వాటర్‌ నదికి రెండు వైపులా రెండు మూడు కిలోమీ టర్ల పరిధిలో ప్రవహిస్తూ పంటలను ముంచుతోంది. ప్రతి ఏటా రెండు, మూడు సార్లు చేతికి వచ్చిన పంటలు నీట మునుగుతుండడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. మంచిర్యాల జిల్లాకు సంబంధించినంత వరకు గోదావరి పరివాహక ప్రాంతాలైన జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట, హా జీపూర్‌, మంచిర్యాల, నస్పూర్‌, జైపూర్‌, చెన్నూరు, కోటపల్లి మండలాల్లోని నది ఒడ్డున ఉండే పంటలు తరుచుగా నీట మునుగుతుండగా, ప్రాణహిత పరివాహక ప్రాంతమైన వేమనపల్లి, కోటపల్లి మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంటుంది. బ్యాక్‌ వాటర్‌ కారణంగా వేల ఎకరాల్లో పత్తి, వరి, మిర్చితోపాటు ఇతర పంటలు నీళ్లపాలవుతున్నాయి. ఇలా పంట నీట మునిగినప్పుడల్లా అధికారులు సర్వే జరిపి, పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేధిక పంపుతున్నారు. 2019 నుంచి ఇదే తంతు జరుగుతుండగా ప్రభుత్వపరంగా రైతులను ఆదుకున్న దాఖలాలు లేవు. గత ఏడాది కూడా అధిక వర్షాల కారణంగా బ్యాక్‌ వాటర్‌తో పంటలు నీట మునిగాయి. ఆ సమయంలో జిల్లా పర్యటనకు వచ్చిన అప్పటి రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చెన్నూరులో సమీక్ష ఏర్పాటు చేసి నీట మునుగుతున్న పంటలపై అధికారులు, రైతుల అభిప్రాయాలు తీసుకున్నారు. అయితే మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు నష్ట పరిహా రం చెల్లించడంగానీ, శాశ్వత పరిష్కారం చూపడం గానీ చేయలేదు.

జిల్లాలో పంట నష్టం ఇలా..

కాళేశ్వరం ప్రాజెక్టుల సముదాయం పూర్తయిన నాటి నుంచి జిల్లాలో పెద్ద మొత్తంలో పంట నష్టం వాటిల్లింది. అన్నారం, మేడిగడ్డ ప్రాజెక్టుల బ్యాక్‌ వాటర్‌ కారణంగా కోటపల్లి మండలంలో 2019లో 1484 మంది రైతులకు సంబంధించిన సమారు 1670 ఎకరాలు పూర్తిగా నీట మునగగా, రైతులకు కోలుకోని విధంగా నష్టం వాటిల్లింది. అలాగే 2020లో 1644 మంది రైతులకు చెందిన 4580 ఎకరాల్లో పంట తుడిచిపెట్టుకుపోయింది. 2021లో 601 మందికి చెందిన 1063 ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. చెన్నూరు మండలంలో 2019లో 839 మంది రైతులకు చెందిన 1183 ఎకరాలు, 2020లో 81 మందికి చెందిన సుమారు 100 ఎకరాలు, 20201లో 1081 మందికి చెందిన 2100 ఎకరాల్లో పంట నీళ్లపాలయింది. అలాగే సుందిళ్ల ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ కారణంగా 2021లో జైపూర్‌ మండలానికి చెందిన 258 మంది రైతులకు చెందిన సుమారు 500 ఎకరాల్లో పంట నీటమునిగింది. గత సంవత్సరం కురిసిన భారీ వర్షాల కారణంగానూ నదులు ఉప్పొంగడంతో ప్రాజెక్టుల బ్యాక్‌ వాటర్‌ చేలు, పొలాలను పూర్తిగా ముంచెత్తింది. ఈ ఏడాది జూలై నెలలో కూడా భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించి పంట పొలాలు నీట మునిగాయి. పంట నష్టం అంచనా వేసిన వ్యవసాయశాఖ అధికారులు సం బంధిత నివేధికను ఐదు నెలల క్రితమే అప్పటి ప్రభుత్వానికి అందజే శారు. అయినా ఇప్పటి వరకు పరిహారం చెల్లించిన దాఖలాలు లేవు.

కేంద్రం ఆదేశాల మేరకు..

ప్రాజెక్టుల కారణంగా ఏటా ప్రధానంగా కోటపల్లి, చెన్నూరు, వేమనప ల్లి మండలాల్లో చేతికొచ్చిన పంట నీట మునుగు తుండడంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మూడు రోజుల క్రితం నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పా న్స్‌ టీం (ఎన్డీఆర్టీ) సభ్యులు ముంపు ప్రాంతాల్లో సర్వేలు నిర్వహించారు. వరద ముంపు కారణంగా ఎంత మేర పంట పొలాలు, ప్రజల ఆస్తులకు నష్టం వాటిళ్లుతుందోననే అంశంపై కోటపల్లి మండలం అర్జునగుట్ట, లక్ష్మీపూర్‌, ఎర్రాయిపేట, బోరపల్లి గ్రామాల్లో సర్వే చేపట్టారు. ముంపు నష్టంపై ఓ అంచనాకు వచ్చిన ఎన్డీఆర్టీ బృంద సభ్యులు సంబంధిత నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నారు. ఎన్డీఆర్టీ బృందం చేసిన సర్వే రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టే అవకా శం ఉండడంతో ముంపు బాధితుల్లో నాలుగేళ్ల తరువాత ఆశలు చిగురి స్తున్నాయి. ముంపు ప్రాంతాల్లో సర్వే చేపట్టిన కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా ఓ నిర్ణయానికి రావడం ద్వారా శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు.

Updated Date - Feb 02 , 2024 | 10:42 PM