Share News

REVANTH: తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యం.. దావోస్‌లో సీఎం రేవంత్ బిజీబిజీ

ABN , Publish Date - Jan 17 , 2024 | 03:15 AM

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రె్‌స-బీఆర్‌ఎస్‌ మధ్యే పోటీ ఉంటుందని, 14 ఎంపీ స్థానాలను తాము గెలవనున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు.

REVANTH: తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యం.. దావోస్‌లో సీఎం రేవంత్ బిజీబిజీ

ఇది ఇంకో ఏడాదిలో స్పష్టంగా తెలిసి వస్తుంది

మన హైదరాబాద్‌కు మరే నగరం సాటి రాదు

లోక్‌సభ ఎన్నికల్లో 14 స్థానాలు సాధిస్తాం

బీజేపీకి మూడోస్థానమే.. మోదీకి కౌంట్‌డౌన్‌ షురూ

అయోధ్య, భద్రాద్రికి తేడా లేదు.. దేవుడితో రాజకీయాలా?

ప్రతిపక్షంలో 20 ఏళ్లు ఉన్నా..

ఆ అనుభవంతో సుపరిపాలన అందిస్తా

దావోస్‌లో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రె్‌స-బీఆర్‌ఎస్‌ మధ్యే పోటీ ఉంటుందని, 14 ఎంపీ స్థానాలను తాము గెలవనున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లోలాగే ఈసారి కూడా బీజేపీ మూడో స్థానానికి పరిమితమవుతుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది తామేనని బీజేపీ ప్రచారం చేసుకున్నదని, ఈసారి కూడా ఆ పార్టీ ఉధృతంగా ప్రచారం చేసుకున్నా ఫలితాల్లో తేడా ఏమీ ఉండదని పేర్కొన్నారు. దావోస్‌ పర్యటనలో ఉన్న సీఎం ఓ ఆంగ్ల మీడియా సంస్థ ప్రతినిధితో మాట్లాడారు. ‘దావోస్‌ సదస్సుకు తెలంగాణ తరఫున ఇంతకు ముందు కేటీఆర్‌ వచ్చేవారు. ఈ ఏడాది మీరు వచ్చారు’ అని సదరు ప్రతినిధి ప్రస్తావించగా.. తాను ఒరిజినల్‌, కేటీఆర్‌ డూప్లికేట్‌ అన్న అర్థం వచ్చేలా.. ఒరిజనల్‌కు, డూప్లికేట్‌కు మధ్య పోటీ లేదని సీఎం సరదాగా వ్యాఖ్యానించారు. ఎవరు ఒరిజనలో, ఎవరు డూప్లికేటో ఇంకో ఏడాదిలో తేలుతుందని చెప్పారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన రాజకీయ క్రీడ ముగిసిందని, ఇక రాష్ట్రాభివృద్ధిపైనే దృష్టి పెడతామని స్పష్టం చేశారు.

10-12 చోట్ల ఫార్మా గ్రామాలు

భారత్‌లో ఏ రాష్ట్రంతో తెలంగాణ పోటీ పడుతుంది అని ప్రశ్నించగా... ‘మేం ప్రపంచంతోనే పోటీపడతాం. ఇతర రాష్ట్రాలతో కాదు’ అని రేవంత్‌ బదులిచ్చారు. తాను గతంలో చెప్పినట్లు హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) వరకు ఒక స్థాయి అభివృద్ధి, ఓఆర్‌ఆర్‌ రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) మధ్య మరో దశ అభివృద్ధి, ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు ఇంకో దశ అభివృద్ధి ఉంటుందని, దీని కోసం మూడు కేటగిరిల ప్రణాళికలు రూపొందించి, అమలు చేస్తామన్నారు. దేశంలో హైదరాబాద్‌ నగరానికి మరే నగరం సాటిరాదని చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించడానికి హైదరాబాద్‌కు, తెలంగాణకు అనేక అనుకూలతలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 10-12 చోట్ల ఫార్మా గ్రామాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధి గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే మొదలు కాలేదని.. ఆ రంగం అభివృద్ధిలో పలువురి పాత్ర ఉందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. హైటెక్‌ సిటీ నిర్మాణానికి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి శంకుస్థాపన చేశారని, చంద్రబాబు, వైఎస్‌, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిల హయాంలో ఐటీతోపాటు ఫార్మా రంగం బాగా అభివృద్ధి చెందాయన్నారు. హైదరాబాద్‌ నగరానికి మరే నగరంతో పోటీ లేదని, ఖుతుబ్‌షాహీలు, నిజాంల నుంచి ఎందరో పాలకులు హైదరాబాద్‌ అభివృద్ధికి ఎంతో చేశారని రేవంత్‌ వివరించారు. పరిపాలనలో తన ప్రాధాన్యాల గురించి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ.. ‘20 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నా. చంద్రబాబునాయుడు, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిల పాలనలో మంచిచెడులు చూశాను. సుదీర్ఘంగా ప్రతిపక్షంలో ఉన్న అనుభవాలతో సుపరిపాలన అందిస్తా. సంక్షేమం, అభివృద్ధి రెండింటికి ప్రాధాన్యం ఇస్తా’ అని చెప్పారు. గత ప్రభుత్వం తెచ్చిన మంచి విధానాలను కొనసాగిస్తానని, తప్పుడు విధానాలను తొలగించి కొత్త వాటిని తీసుకొస్తానని చెప్పారు.

మోదీకి కౌంట్‌డౌన్‌..

2004 ఎన్నికల్లో ‘దేశం వెలిగిపోతోంది’ (ఇండియా షైనింగ్‌) అనే నినాదంతో నాటి ప్రధాని వాజపేయీ ప్రచారం చేశారని, కానీ 2004లోనేగాక, 2009 ఎన్నికల్లో కూడా యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిందని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. ‘కేసీఆర్‌ సీఎంగా ఉండగా.. ఆయనను ఎవరూ ఓడించలేరని ప్రచారం జరుగుతుండేది. కానీ, వాస్తవానికి ఏం జరిగింది. మోదీ విషయంలోనూ అంతే. ఆయన కౌంట్‌ డౌన్‌ ఇప్పటికే స్టార్ట్‌ అయ్యింది. దేశానికి న్యాయం జరగాలంటే ఇండియా కూటమికి ఓటేయాలి’ అని రేవంత్‌ పేర్కొన్నారు. అయోధ్యలో రామమందిరం శ్రీరాముడిని విశ్వసించే హిందువులందరిదని, అది బీజేపీకి మాత్రమే పరిమితమైనది కాదని చెప్పారు. అయోధ్య రామాలయంతో బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని, ఇది ఆ పార్టీకి మేలు చేయదని హెచ్చరించారు. ఆలయ నిర్మాణం పూర్తి కాకుండా విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేయడం సరికాదని నిజమైన హిందువులు భావిస్తారని, పలువురు ఇదే విషయాన్ని చెప్పారని గుర్తు చేశారు. ఏదో ఒక రోజు అయోధ్య రామాలయాన్ని సందర్శిస్తానన్నారు. తెలంగాణలోని భద్రాచలంలోనూ రాముని గుడి ఉందని సీఎం గుర్తు చేశారు. అయోధ్య రామాలయానికి, భద్రాచలంలోని రామాలయానికి మధ్య తన దృష్టిలో తేడా ఏమీ లేదని చెప్పారు.

Updated Date - Jan 17 , 2024 | 07:49 AM