Share News

‘హెటిరో’కు భూ సంతర్పణపై దర్యాప్తు?

ABN , Publish Date - Jan 30 , 2024 | 03:54 AM

ఐటీ కారిడార్‌లో అత్యంత ఖరీదైన స్థలం అది..! హైటెక్‌సిటీకి కూతవేటు దూరంలో ఉన్న 15 ఎకరాల భూమిని గత సర్కారు తమ ఎంపీకి కారు చౌకగా కట్టబెట్టింది. రూ.4 వేల కోట్ల విలువైన భూమిని.. ఏడాదికి ఎకరానికి రూ.2 లక్షల చొప్పున.. మొత్తం రూ.30 లక్షలు చెల్లించేలా లీజుకు ఇచ్చింది. అంతేకాదు.. బీఆర్‌ఎస్‌

‘హెటిరో’కు భూ సంతర్పణపై దర్యాప్తు?

హైకోర్టు వద్దన్నా రూ.4 వేల కోట్ల

విలువైన భూమి ధారాదత్తం

రూ.30 లక్షలకే లీజుకు కట్టబెట్టిన గత ప్రభుత్వం

బీఆర్‌ఎస్‌ ఎంపీ పార్థసారథి ట్రస్టుకు 15 ఎకరాలు

ఏడాదికి ఎకరానికి రూ.2 లక్షల చొప్పున

సాయిసింధు ఫౌండేషన్‌కు అప్పగింత

ఎన్నికలకు ముందు.. గత సర్కారు రహస్య జీవో

ఈ గ‘లీజు’పై కొత్త ప్రభుత్వం నజర్‌

హైదరాబాద్‌, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): ఐటీ కారిడార్‌లో అత్యంత ఖరీదైన స్థలం అది..! హైటెక్‌సిటీకి కూతవేటు దూరంలో ఉన్న 15 ఎకరాల భూమిని గత సర్కారు తమ ఎంపీకి కారు చౌకగా కట్టబెట్టింది. రూ.4 వేల కోట్ల విలువైన భూమిని.. ఏడాదికి ఎకరానికి రూ.2 లక్షల చొప్పున.. మొత్తం రూ.30 లక్షలు చెల్లించేలా లీజుకు ఇచ్చింది. అంతేకాదు.. బీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు పార్థసారథిరెడ్డి ట్రస్టీగా ఉన్న సాయిసింధు ఫౌండేషన్‌కు ఎన్నికలకు ముందు గోప్యంగా జారీ చేసిన జీవో ద్వారా ఈ భూమిని ధారాదత్తం చేసింది. ఈ వ్యవహారంలో గత సర్కారు ఎంతలా దిగజారిందంటే.. హైకోర్టు జీవోను కొట్టివేసినా.. లీజు కేటాయింపులను రద్దు చేస్తూ.. పునఃపరిశీలించాలని ఆదేశించినా పెడచెవిన పెట్టింది. పైగా.. లీజు నిబంధనలకు సంబంధించిన జీవోలకు సవరణలు చేసి, కొత్త జీవో ద్వారా మళ్లీ పార్థసారథిరెడ్డి ట్రస్టీగా ఉన్న సంస్థకు భూములను కట్టబెట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై.. బీఆర్‌ఎ్‌స(అప్పట్లో టీఆర్‌ఎస్‌) అధికార పగ్గాలు చేపట్టిన మూణ్నెల్లకే.. అంటే 2014 సెప్టెంబరులో హెటిరో డ్రగ్స్‌ కంపెనీ ఎండీ పార్థసారథి రెడ్డి సాయిసింధు ఫౌండేషన్‌ పేరుతో ఒక చారిటబుల్‌ ట్రస్ట్‌ను నెలకొల్పారు. ఆ ట్రస్టు పేరుతో తాము క్యాన్సర్‌ జనరల్‌ ఆస్పత్రిని నిర్మించనున్నట్లు ప్రభుత్వానికి విన్నవించారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని ఇజ్జత్‌నగర్‌(హైటెక్స్‌ వెళ్లే మార్గం)లో 15.48 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలంటూ విజ్ఞప్తి చేశారు. 1989లో బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రికి లీజుకు ఇచ్చిన తరహాలోనే.. ఏడాదికి రూ.50 వేల చొప్పున చెల్లించేలా భూమిని కేటాయించాలని కోరారు. అందుకు ప్రతిగా.. తమ ఆస్పత్రిలో కూడా 25ు మంది ఇన్‌పేషెంట్లు, 40ు మంది ఔట్‌పేషెంట్లకు ఉచిత వైద్యం అందిస్తామని ప్రతిపాదించారు. అయితే.. అప్పటికే పార్థసారధిరెడ్డి ట్రస్టు అడిగిన స్థలాన్ని వేలం వేయాలని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వనరుల సంస్థ(టీఎ్‌సఐఐసీ) నిర్ణయించింది. దీంతో.. ఇజ్జత్‌నగర్‌కు బదులుగా.. ఆ పక్కనే ఉన్న ఖానామెట్‌లో స్థలం కేటాయించాలని బీఆర్‌ఎస్‌ సర్కారు నిర్ణయించింది. ఖానామెట్‌ సర్వేనంబరు 41/14/2లో 15 ఎకరాల స్థలాన్ని కేటాయించాలంటూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీసీఎల్‌ఏకు అత్యున్నత ప్రాధాన్యత కింద ఆదేశాలు జారీ చేసింది. అయితే.. అప్పట్లో శేరిలింగంపల్లి తహసీల్దార్‌, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఆ భూమి విలువైనదని.. మార్కెట్‌ ధర ప్రకారం ఎకరాకు రూ.33.7 కోట్ల చొప్పున రూ.505.5 కోట్ల విలువ ఉంటుందని పేర్కొంటూ ప్రభుత్వానికి నోట్‌ పంపించారు. అప్పటి రాజేంద్రనగర్‌ ఆర్డీవో కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయినా.. నాటి కేసీఆర్‌ సర్కారు వెనక్కి తగ్గలేదు. సాయిసింధు ఫౌండేషన్‌ ట్రస్టుకు ఆ భూములను జీవో-571(లీజులకు సంబంధించిన ఉత్తర్వు) ప్రకారం కేటాయించాలని నిర్ణయించింది. ఆ ఉత్తర్వును 2015లో సవరిస్తూ.. జీవో-218ను విడుదల చేసింది. ఆ సవరణల్లో సామాజిక, స్వచ్ఛంద సంస్థలకు భూమిని లీజుకు ఇస్తే.. సంబంధిత భూమి విలువలో 10శాతాన్ని ఏడాది లీజుగా చెల్లించాలనే విషయాన్ని చేర్చింది. అంటే.. ప్రభుత్వ భూమి విలువ రూ.505.5 కోట్లు కాగా.. అందులో 10ు.. అంటే.. రూ.50కోట్ల చొప్పున లీజును చెల్లించాలి. 60 ఏళ్లకు లీజుకు ఇచ్చేలా.. ఐదేళ్లకోసారి లీజు విలువను 10ు చొప్పున పెంచుతూ వెళ్లాలని స్పష్టం చేసింది. ఈ జీవోను కూడా ప్రభుత్వం తుంగలోకి తొక్కుతూ.. ఏడాదికి ఎకరాకు రూ.1.47 లక్షల చొప్పున చెల్లించేలా పార్థసారథిరెడ్డి ట్రస్టుకు లీజుకు ఆ భూమిని కట్టబెడుతూ 2018 మార్చి 22న జీవో-59ని విడుదల చేసింది.

హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ..

జీవో-59 ప్రకారం సాయిసింధు ఫౌండేషన్‌ ట్రస్టుకు భూకేటాయింపుపై 2018లోనే డాక్టర్‌ ఊర్మిళ పింగ్లే, మరొకరు హైకోర్టులో సవాలు చేశారు. వాదోపవాదాలను నమోదు చేసుకున్న హైకోర్టు.. చవక లీజుపై ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. 2023 జూన్‌ 5న తుదితీర్పునిస్తూ.. జీవో-59ని రద్దు చేసింది. భూకేటాయింపు పాలసీకి సంబంధించిన జీవో-218ను పునఃసమీక్షించి, నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ‘‘ప్రజల ఆస్తులకు, వనరులకు ప్రభుత్వాలు ట్రస్టీగానే వ్యవహరించాలి. ప్రభుత్వ ఆస్తులను కట్టబెట్టేప్పుడు.. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలి’’ అంటూ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కోర్టు తీర్పును ఏమాత్రం పట్టించుకోలేదు. పార్థసారథిరెడ్డి ట్రస్టుకు లీజును కట్టబెట్టేందుకే మొగ్గుచూపింది. మరోమారు లీజు నిబంధనలను సవరించింది. ఆ మేరకు 2023 ఆగస్టు 11న జీవో-99 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. అందులో.. ‘‘సామాజిక, స్వచ్ఛంద సంస్థలకు భూములను తక్కువ ధరకు ఇచ్చే విచక్షణ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది’’ అనే పదాన్ని చేర్చింది. అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడానికి కొన్ని రోజుల ముందే.. అంటే.. 2023 సెప్టెంబరు 25న జీవో-140 ద్వారా సాయిసింధు ఫౌండేషన్‌కు విలువైన భూమిని కట్టబెడుతూ ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి ఏడాదికి రూ.50 కోట్ల మేర లీజు చెల్లించాలని, ప్రతి ఐదేళ్లకోసారి లీజుమొత్తాన్ని 10ు మేర పెంచాలని సర్కారు జారీ చేసిన నిబంధనలు చెబుతున్నా.. ‘విచక్షణ అధికారం’ పేరుతో బీఆర్‌ఎస్‌ సర్కారు ఏడాదికి ఎకరాకు రూ.2 లక్షల చొప్పున.. 15.4 ఎకరాలకు రూ.30 లక్షలు చెల్లించేలా లీజుకు ఇస్తున్నట్లు జీవో-140లో స్పష్టం చేసింది. గతంలో ఈ వ్యవహారం రచ్చగా మారి, హైకోర్టుదాకా వెళ్లడంతో కాస్త జాగ్రత్తపడ్డ బీఆర్‌ఎస్‌ సర్కారు.. ఈ జీవోను గోప్యంగా పెట్టడం గమనార్హం..! నిజానికి ఆ భూముల విలువ 2023 కల్లా ఎనిమిదింతలు పెరిగాయి. ఖానామెట్‌లో ఎకరా మార్కెట్‌ విలువ రూ.300 కోట్ల దాకా ఉంది. ఈ లెక్కన రూ.4 వేల కోట్ల విలువైన భూములను ఏడాదికి రూ.30 లక్షలు చెల్లించేలా.. 60 ఏళ్లకు బీఆర్‌ఎస్‌ సర్కారు పార్థసారధిరెడ్డి ట్రస్టుకు ధారాదత్తం చేసింది.

రేవంత్‌ సర్కారు సీరియస్‌

గత ప్రభుత్వ హయాంలో ధారాదత్తం చేసిన భూములపై రేవంత్‌ సర్కారు దృష్టి సారించింది. ఇప్పటికే జీవో-59 కింద ఆమోదించిన దరఖాస్తుల దుమ్ము దులుపుతోంది. శాటిలైట్‌ చిత్రాల ఆధారంగా అవన్నీ అ‘క్రమబద్ధీకరణలు’ అని తేలడంతో.. వెయ్యి దాకా రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్లను నిలిపివేసింది. మిగతా దరఖాస్తులకూ శల్యపరీక్షలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే పార్థసారథిరెడ్డి ట్రస్టుకు కట్టబెట్టిన భూములపై దృష్టి సారించింది. నేడోరేపో దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Jan 30 , 2024 | 03:54 AM