Share News

ముచ్చట తీరకుండానే మృత్యుఒడిలోకి..

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:35 PM

కుమార్తె చెవులు కుట్టించాలన్న తండ్రి, పుట్టు వెంట్రుకలు తీయించాలకున్న తాత, అమ్మమ్మ, మామ, అత్తల కోరిక తీరలేదు.

ముచ్చట తీరకుండానే మృత్యుఒడిలోకి..
ఆసుపత్రి వద్ద రోధిస్తున్న బంధువులు

కోదాడ / కోదాడ టౌన్‌, ఏప్రిల్‌ 25 : కుమార్తె చెవులు కుట్టించాలన్న తండ్రి, పుట్టు వెంట్రుకలు తీయించాలకున్న తాత, అమ్మమ్మ, మామ, అత్తల కోరిక తీరలేదు. ఆ ముచ్చట తీర్చుకునేందుకు వెళ్తున్న వారిని రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. కోదాడ మండలం చిమిర్యాలకు చెందిన జిల్లా శ్రీకాంత్‌(32), నాగమణి దంపతులకు లాస్య(4), లావణ్యలు ఉండగా, ఆయన బావమరిది నల్లమల కృష్ణరాజు(26), స్వర్ణకుమారి(23) దంపతులకు కౌశిక్‌, కార్తీక్‌లు ఉన్నారు. వీరితో పాటు కృష్ణరాజు తల్లిదండ్రులు చందరావు(50), మాణిక్యమ్మ(45)లు ఉంటున్నారు. శ్రీకాంత్‌ భార్య నాగమణి స్వయాన కృష్ణరాజు చెల్లెలు. ఇద్దరూ హైదరాబాద్‌లో డ్రైవర్లు జీవనం సాగిస్తున్నారు. లావణ్య పుట్టువెంట్రుకలతో పాటు చెవులు కుట్టించాలన్న తండ్రి శ్రీకాంత్‌, తాత, అమ్మమ్మ చందరావు, మాణిక్యమ్మ, మామ కృష్ణరాజులు నిర్ణయించారు. ఇందుకోసం బుధవారం రాత్రి హైదరాబాద్‌ నుంచి కారులో ఇరుకుటుంబాల సభ్యులందరూ కలిసి కారులో విజయవాడలోని గుణదల మేరీమాత దేవాలయానికి బయలుదేరారు. కోదాడ సమీపంలోని శ్రీరంగాపురం వద్ద హైవేపై నిలిచిన లారీని వీరు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే శ్రీకాంత్‌తో పాటు పెద్దకుమార్తె లాస్య, అత్తామామ చందరావు, మాణిక్యమ్మ, బావమరిది కృష్ణరాజు, స్వర్ణకుమారి మృతి చెందారు. శ్రీకాంత్‌ భార్య నాగమణితో పాటు చిన్నకుమార్తె లాస్య, కృష్ణరాజు కుమారులు కౌశిక్‌, కార్తీక్‌లు గాయాల పాలయ్యాయి. శ్రీకాంత్‌ సోదరుడు రాజశేఖర్‌ ఫిర్యాదు మేరకు డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

చివరి మాటలు అవుతాయని అనుకోలేదు : మేరి కుమారి

‘పెద్దమ్మ మేం వస్తున్నాం రెడీగా ఉండు, వెంటనే దేవాలయానికి వెళ్దాం’ అన్న మాటలు చివరివి అవుతాయని అనుకోలేదని శ్రీకాంత్‌ పెద్దమ్మ మేరికుమారి కన్నీటి పర్యతమైంది. మంగళవారం రాత్రి గంటలకు 3.33నిమిషాలకు వస్తున్నట్లు శ్రీకాంత్‌ ఫోన్‌ చేశాడని తెలిపింది. ఐదు గంటలకు ఫోన్‌చేస్తే ఎత్తకపోవటంతో హైదరాబాద్‌లో ఉంటున్న కుమార్‌కు ఫోన్‌ చేస్తే కోదాడ వద్ద ప్రమాదం జరిగినట్లు చెప్పారు. ఆరా తీయగా ఆసుపత్రిలో ఉన్నట్లు తెలవడంతో ఆసుపత్రికి వచ్చామన్నారు. ఆరుగురు చనిపోయారని పోలీసులు చెప్పటంతో దిక్కుతోచని స్థితి నెలకొందన్నారు. పగవారికి కూడా ఇటువంటి పరిస్థితి రాకూడదన్నారు.

మృతుల కుటుంబాలకు కోదాడ ఎమ్మెల్యే పద్మావతి సంతాపం

జాతీయ రహదారిపై కోదాడ బైపాస్‌ సమీపంలో దుర్గాపురం స్టేజీ వద్ద తెల్లవారుజామున బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి సంతాపం తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రెండు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కుటుంబం భార్య భర్తలు మృతిచెందారు. ఆ ఘటన మరువక ముందే ఈ రోజు ఈ ఘటన జరిగి ఆరుగురు మరణించడం చాలా బాధాకరమన్నారు. జాతీయ రహదారిపై తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దృష్ట్యా కోదాడలో ట్రామా సెంటర్‌ ఏర్పాటు అత్యవసరమని, దీని ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే పద్మావతి తెలిపారు. ఈ విషయాన్ని గతంలో కోదాడలో వంద పడకల హాస్పిటల్‌ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహకారంతో ట్రామా సెంటర్‌ మంజూరుకు కృషి చేస్తామని తెలిపారు.

అతివేగమే ప్రమాదానికి కారణం: ఎస్పీ రాహుల్‌హెగ్డే

అతి వేగమే ప్రమాదానికి కారణమని ఎస్పీ రాహుల్‌హెగ్గే అన్నారు. ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే నేషనల్‌ హైవ్‌ ఆఫ్‌ అథారిటీ వారితో మాట్లాడామని, అతివేగంగా ప్రయాణించే వాహనాలకు గుర్తించేందుకు మూడు స్పీడ్‌గన్‌లను ఏర్పాటు చేశామన్నారు. లారీ యాగ్జిల్‌ రాడ్‌ విరిగి లారీ ముందుకు కదల్లేకపోవడంతో రహదారిపై నిలిపారన్నారు. కారు అతివేగమే ప్రమాదానికి కారణమన్నారు.

చిమిర్యాలలో విషాదఛాయలు

కోదాడ రూరల్‌ : కోదాడకు దగ్గరలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన జిల్లా శ్రీకాంత్‌, అతని కూతురు లాస్య అంత్యక్రియలు వారి స్వస్థలమైన చిమిర్యాల గ్రామంలో నిర్వహించారు. గ్రామస్థులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దీంతో గ్రామంలోని ప్రజలు పెద్దఎత్తున ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని పెద్దఎత్తున విలపించారు. రెండురోజుల కిందటే శ్రీకాంత్‌ చిమిర్యాలలోని తన పెద్దమ్మ మేరికుమారికి ఫోన్‌ చేసి తన కూతురు పుట్టువెంట్రుకలు విజయవాడలోని మేరిమాత ఆలయంలో నిర్వహిస్తున్నామని, తనను కూడా తప్పకుండా తీసుకెళ్తామని చెప్పారని ఆమె బోరున విలపిస్తూ తెలిపారు. తన దగ్గరికి రాకుండానే మృత్యువాత పడ్డారని ఆమె విలపించారు. దీంతో గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలను ఎస్పీ రాహుల్‌ హెగ్డే, డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, ఆర్డీవో సూర్యనారాయణ, తహసీల్దార్‌ సాయిగౌడ్‌ పరిశీలించారు. మృతుల కుటుంబాలకు తగిన ఆర్థిక సాయం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ఆగిన లారీని ఢీకొట్టిన మరో లారీ

తిప్పర్తి: ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్‌ మృతి చెందాడు. ఈ ప్రమాదం గురువారం తెల్లవారుజామున తిప్పర్తి మండల పరిధిలోని అనిశెట్టి దుప్పలపల్లి వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గుంటూరు జిల్లా చేబ్రోలు మండల కేంద్రానికి చెందిన షేక్‌ నాగుల్‌మీరా(58) లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. బుధవారం రాత్రి చేబ్రోలు నుంచి హైదరాబాద్‌కు మినపగుండ్ల లోడుతో హైదరాబాద్‌కు వెళ్తున్నాడు. ఈ క్రమంలో తిప్పర్తి మండల పరిధిలోని అనిశెట్టి దుప్పలపల్లి గ్రామం వద్ద తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ప్లైఓవర్‌ బ్రిడ్జిపై ఎలాంటి ఇండికేటర్లు, సిగ్నల్స్‌ లేకుండా ఆపిన మరో లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో నాగుల్‌మీరాకు తీవ్ర గాయాలయ్యాయి. పక్కనే ఉన్న క్లీనర్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. నాగుల్‌మీరాను చికిత్స నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు అంబులెన్స్‌లో గుంటూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడు నాగుల్‌మీరా కుమారుడు యూనుస్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎ్‌సఐ లింగయ్య తెలిపారు.

Updated Date - Apr 25 , 2024 | 11:35 PM