వడ్డీ తక్కువ.. షరతులు ఎక్కువ!
ABN , Publish Date - Jan 12 , 2024 | 05:09 AM
అప్పులు తీసుకోవాలి.. కానీ, చాలా తక్కువ వడ్డీకి ఇచ్చే సంస్థల వద్ద తీసుకోవాలి! ఇదీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ యోచన. ఇదే విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే అధికారులకు స్పష్టం చేశారు.

తక్కువ వడ్డీకి అప్పులు తీసుకోవాలన్న సీఎం
కానీ.. జైకా, ఏడీబీ రుణాలు అంత సులభం కాదు
వాటి షరతులను తట్టుకోలేమంటున్న అధికారులు
బడ్జెట్ అప్పుల్లో లెక్కిస్తే ఇబ్బందికరమే
కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం నెరపాల్సిందే
తెచ్చిన అప్పులను మౌలిక సదుపాయాలకే వాడాలి
పథకాలకు మళ్లిస్తే తదుపరి అప్పుల నిలిపివేత!
హైదరాబాద్, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): అప్పులు తీసుకోవాలి.. కానీ, చాలా తక్కువ వడ్డీకి ఇచ్చే సంస్థల వద్ద తీసుకోవాలి! ఇదీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ యోచన. ఇదే విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే అధికారులకు స్పష్టం చేశారు. జాతీయ ఆర్థిక సంస్థలు, బ్యాంకుల నుంచి కాకుండా అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలు ఇప్పించాలని ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలైతే తక్కువ వార్షిక వడ్డీలతో రుణాలు ఇస్తాయని ప్రస్తావిస్తున్నారు. ఈ ఆలోచన మంచిదేనని ఆర్థిక నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. కానీ, అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలు తీసుకోవడం అంత సులభం కాదని చెబుతున్నారు. ఆ సంస్థల షరతులు, నిబంధనలు, కొర్రీలను సర్కారు తట్టుకుంటుందా? అడుగడునా నివేదికలు సమర్పించడం సాధ్యమవుతుందా? మౌలిక సదుపాయాలకు కాకుండా ప్రభుత్వ పథకాలకు మళ్లించే అవకాశాలు ఉండవు కదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒక ఇంటిని నిర్మించుకోవడానికి బ్యాంకులు ఇచ్చే గృహ రుణాలకు ఎన్ని రకాల షరతులు పెడతాయో.. అంతర్జాతీయ సంస్థలు కూడా అలాంటి నిబంధనలే విధిస్తాయని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. ఇలాంటి రుణాలను దేశంలోని కొన్ని రాష్ట్రాలు తీసుకుంటున్నప్పటికీ తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వీటి జోలికి వెళ్లలేదు. కానీ, సీఎం రేవంత్‌రెడ్డి తక్కువ వడ్డీకి అప్పులు తీసుకోవాలని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ రుణాలు చర్చకు వస్తున్నాయి. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘జైకా’, ఏడీబీ వంటి సంస్థల నుంచి రుణాలు ఇప్పించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని రేవంత్ చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ సందర్భంలోనూ ఈ రుణాల గురించి ప్రస్తావించానని తెలిపారు. తమకు అదనపు అప్పులు అవసరం లేదని, తక్కువ వడ్డీకి రుణాలిచ్చే ఇలాంటి సంస్థల నుంచి రుణాలు ఇప్పించాలని అడిగారు.
నిర్దేశిత పనులకే వినియోగించాలి..
తక్కువ వడ్డీకి అంతర్జాతీయ సంస్థలిచ్చే రుణాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు మళ్లించడానికి వీలుండదని, పక్కాగా నిర్దేశిత పనులకే వినియోగించాలని అధికారులకు చెబుతున్నారు. రోడ్లు, హైవేలు, షిప్పింగ్, బ్రిడ్జిలు, నీటి సరఫరా, శానిటేషన్, పట్టణ రవాణా, పర్యావరణం, అడవుల పెంపకం, పాఠశాలలు, ఆస్పత్రి భవనాల నిర్మాణాలు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించాల్సి ఉంటుంది. ఏ మాత్రం దారి మళ్లించినా.. ఆ సంస్థలు నిబంధనల ఉల్లంఘన కింద అప్పులను నిలిపివేస్తాయి. మరోసారి అప్పులు ఇవ్వకుండా దేశాలను బ్లాక్ లిస్ట్ చేస్తాయి. ఒకసారి దేశం బ్లాక్ లిస్ట్‌లో చేరితే ఆ దేశంలోని రాష్ట్రాలకు రుణాలు తీసుకునే పరిస్థితి ఉండదు. అందుకే ఒక రాష్ట్ర ప్రభుత్వ రుణ విజ్ఞప్తులను పరిశీలించేటప్పుడు కేంద్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటుందని అధికారులు వివరిస్తున్నారు. ప్రపంచంలోని పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు.. పేద దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు రుణాలు ఇస్తుంటాయి. ఇలాంటి సంస్థల్లో ‘జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ (జైకా)’, ఏషియన్ డెవల్‌పమెంట్ బ్యాంక్ (ఏడీబీ)’, ‘ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ డెవల్‌పమెంట్ (ఐబీఆర్‌డీ)’ వంటివి ఉన్నాయి. ఇవి ఎక్కువగా పేద దేశాలనే పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఆఫ్రికా, ఆసియా ఖండాల్లో తలసరి ఆదాయం తక్కువగా ఉండి, దారిద్య్రంలో కొట్టుమిట్టాడుతున్న దేశాలను ఆదుకునే చర్యల్లో భాగంగా రుణాలు ఇస్తున్నాయి.
మౌలిక సదుపాయాలకు ‘జైకా’ రుణాలు
జపాన్‌లోని టోక్యోలో గల ‘జైకా’ ప్రపంచంలోని వివిధ దేశాలకు ‘అఫీషియల్ డెవల్‌పమెంట్ అసిస్టెన్స్ (ఓడీఏ)’ పేర రుణాలు ఇస్తుంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం తక్కువ శాతం వార్షిక వడ్డీతో ఈ రుణాలను అందజేస్తుంది. రుణ గ్రహీత దేశం.. ఏ రాష్ట్రంలోనైనా నిధులను ఖర్చు పెట్టుకునే వెసులుబాటు ఉంటుంది. మన దేశంలోని ఏదైనా రాష్ట్రం ‘జైకా’ రుణాన్ని తీసుకోవాలంటే.. కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలి. కేంద్రం ఇచ్చే భరోసా మేరకు రుణం లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వమే ‘జైకా’తో మధ్యవర్తిత్వం నెరపి, రుణాన్ని ఇప్పిస్తుంది. ‘జైకా’ రుణాల కోసం రాష్ట్రాలు కేంద్ర ఆర్థిక శాఖకు ప్రతిపాదనలను పంపించాలి. మౌలిక సదుపాయాల అభివద్ధి కోసం జైకా ఈ రుణాలను ఇస్తుంది. ఈ మేరకు లోయర్-మిడిల్ ఇన్‌కమ్ దేశాలు, అప్పర్-మిడిల్ ఇన్‌కమ్ దేశాలుగా వర్గీకరించి వడ్డీ రేట్లను అమలు చేస్తుంది. 2023 జూన్‌లో ‘ప్రపంచ బ్యాంకు’ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఇండియా లోయర్-మిడిల్ ఇన్‌కమ్ దేశంగా ఉంది. దీంతో భారత్‌కు 1.45 లేదా 1.20 శాతం వడ్డీ రేట్లు వర్తిస్తాయి. 2014లో కూడా జైకా నుంచి అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం రూ.370 కోట్ల రుణం తీసుకుంది.
ఏడీబీ ద్వారా రుణాలు
ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో ఉన్న ‘ఏషియన్ డెవల్‌పమెంట్ బ్యాంక్ (ఏడీబీ)’ కూడా ఆసియాలోని దేశాలకు రుణాలు ఇస్తుంటుంది. ఆసియా-పసిఫిక్ రీజియన్‌లోని దేశాల్లో ఆర్థికాభివృద్ధికి, పేదరికాన్ని దూరం చేయాలన్న ఉద్దేశంతో రుణాలను అందిస్తుంది. సహజ వనరుల వినియోగం, విద్య, విద్యుత్తు, ఆర్థికం, ఆరోగ్యం, సామాజిక భద్రత, పరిశ్రమలు, వాణిజ్యం, పబ్లిక్ సెక్టార్ మేనేజ్‌మెంట్, రవాణా, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, నీటి సరఫరా, మౌలిక సదుపాయాలు వంటి వాటి కోసం రుణాలు ఇస్తుంది. దీని రుణాలు దేశాల తలసరి ఆదాయం, అప్పులను తిరిగే చెల్లించే సామర్థ్యంపై ఆధారపడి ఉంటాయి.